Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌ నిజం కాదు.. మాజీల విమర్శలు

By:  Tupaki Desk   |   12 Sep 2018 4:37 AM GMT
బిగ్‌ బాస్‌ నిజం కాదు.. మాజీల విమర్శలు
X
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం బిగ్‌ బాస్‌ కు విశేష ఆధరణ ఉంది. ఎన్నో దేశాల్లో ఈ షో పలు రకాలుగా, పలు పేర్లతో బుల్లి తెరను షేక్‌ చేస్తూనే ఉంది. హిందీలో పుష్కర కాలంగా ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్‌ బాస్‌ సీజన్‌ 12 ప్రారంభంకు సిద్దం అయ్యింది. ఇటీవలే సీజన్‌ 12 కర్టన్‌ రైజింగ్‌ కార్యక్రమం కూడా గోవాలో జరిగింది. బిగ్‌ బాస్‌ కు హిందీలో వచ్చిన భారీ ఆధరణతో సౌ త్‌లో కూడా ప్రారంభించారు. తెలుగు - తమిళం - మలయాళంలో బిగ్‌ బాస్‌ షో ప్రస్తుతం కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఒక వైపు భారీ టీఆర్పీ రేటింగ్‌ వస్తున్న బిగ్‌ బాస్‌ కు మరో వైపు భారీ ఎత్తున విమర్శలు కూడా ఎదురవుతున్నాయి.

బిగ్‌ బాస్‌ షో మొత్తం ముందే స్క్రిప్ట్‌ గా రెడీ చేస్తారని, దానికి తగ్గట్లుగా పార్టిసిపెంట్స్‌ నడుచుకోవాల్సి ఉంటుందని మాజీ బిగ్‌ బాస్‌ పార్టిసిపెంట్స్‌ అంటున్నారు. హిందీ బిగ్‌ బాస్‌ సీజన్‌ 10లో పాల్గొన్న దియాంద్రా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. బిగ్‌ బాస్‌ షో నిజం కాదు - ఈ షో కు ఓట్లు వేసి సమయం మరియు డబ్బును ప్రేక్షకులు వృదా చేసుకోవద్దు అంటూ పిలుపునిచ్చింది. మరో బిగ్‌ బాస్‌ మాజీ పార్టిసిపెంట్‌ అష్కా గొరాడియా తన ఆవేదన వ్యక్తం చేసింది. బిగ్‌ బాస్‌ లో నా లింగత్వంనే తప్పుగా చూపించారు. నేను ఒక లెస్బియన్‌ అన్నట్లుగా షోలో ప్రొజెక్ట్‌ చేసి నా పరువు తీశారు. ఎడిటింగ్‌ లో జిమిక్కులు చేసి నా జీవితం ప్రశ్నార్థకం చేశారు. అలా చూపించడంతో నా తల్లిదండ్రులు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు అంటూ ఆష్కా బిగ్‌ బాస్‌ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇక తెలుగు బిగ్‌ బాస్‌ మాజీ పార్టిసిపెంట్‌ అయిన బాబు గోగినేని మాట్లాడుతూ.. షోలో చూపించేది నిజం కాదు, అక్కడ జరిగిన విషయాల్లో దేనికి అయితే మంచి టీఆర్పీ వస్తుందో దానినే ప్రేక్షకులకు చూపిస్తారు. రేటింగ్‌ కోసం పార్టిసిపెంట్స్‌ మద్య గొడవలు పెట్టాలని బిగ్‌ బాస్‌ చూస్తాడు అంటూ బాబు గోగినేని అన్నాడు. ఇక రెండవ సీజన్‌ మొదటి వారంలోనే ఎలిమినేట్‌ అయిన సంజన కూడా బిగ్‌ బాస్‌ ఫెయిర్‌ గేమ్‌ కాదు అంటూ విమర్శలు వ్యక్తం చేసింది. కొందరు విమర్శలు చేస్తే మరి కొందరు మాత్రం బిగ్‌ బాస్‌ షో అనేది అద్బుతం అంటూ కితాబిస్తున్నారు. 24 గంటల పాటు ఇంట్లో సభ్యుల మద్య జరిగిన సంఘర్షణలను గంటన్నర రెండు గంటల్లో చక్కటి ఎడిటింగ్‌ తో చూపించడం అనేది అద్బుతం అంటూ కొందరు ప్రశంసిస్తున్నారు.