Begin typing your search above and press return to search.

ఒలంపిక్ విజేత మీరాబాయి చానుపై బయోపిక్

By:  Tupaki Desk   |   4 Aug 2021 1:30 AM GMT
ఒలంపిక్ విజేత మీరాబాయి చానుపై బయోపిక్
X
టోక్యో ఒలింపిక్స్ లో మహిళల 49 కేజీల విభాగంలో సైఖోమ్ మీరాబాయి చాను రజత పతాకాన్ని సాధించి దేశపు జెండాను రెపరెపలాడించింది. బలింపిక్స్ లో పతకం సాధించిన రెండో భారతీయ వెయిట్ లిఫ్టర్ గా నిలిచింది. ఆమె విజయం దేశం మొత్తానికి స్ఫూర్తినిచ్చింది. ఒక మారుమూల ఈశాన్య భారతంలోని చిన్న రాష్ట్రంలో మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఈమె జీవితగాథపై తాజాగా ఒక సినిమా రూపొందుతోంది.

ఈ చిత్రాన్ని ప్రధానంగా మణిపురిలో రూపొందించబడుతుంది.. ఆ తర్వాత ఇంగ్లీష్, హిందీ, ఇతర భారతీయ భాషలలోకి డబ్ చేయబడుతుంది. మీరాబాయి జీవితంపై సినిమా చేయడానికి ఇప్పటికే ఒక ఒప్పందం కూడా కుదిరినట్టు తెలిసింది.

ఇంఫాల్ కు చెందిన సెయుటి ఫిలిమ్స్ ప్రొడక్షన్ తాజాగా ఇంఫాల్ తూర్పు జిల్లాలోని నాంగ్ పాక్ కక్చింగ్ గ్రామంలో ఉన్న ఆమె ఇంటికి వెళ్లి మరీ మీరాబాయ్ కుటుంబంతో ఈ ఒప్పందం చేసుకుంది. నిర్మాణ సంస్థ చైర్ పర్సన్ మనోబి ఎంఎం ఇదే విషయాన్ని తాజాగా ప్రకటించారు.

మనోబి ఎంఎం ఈ చిత్రానికి కథను సమకూరుస్తున్నారు. దీనికి ఓసీ మీరా దర్శకత్వం వహిస్తారు. ఆర్కే నళిని దేవి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

మీరాభాయి చాను పాత్రను పోషించగల అమ్మాయి కోసం చిత్ర యూనిట్ ప్రస్తుతం వెతుకుతోంది. మీరాబాయి ఎత్తు, వయసు, శరీరాకృతికి సరిపోయే.. ఆమె రూపానికి కొంత సారూప్యత కలిగిన నటి కోసం ఇప్పుడు చిత్రం యూనిట్ వేట ప్రారంభించింది.

వచ్చే ఏడాది దీని షూటింగ్ ప్రారంభించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 2022లోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.