Begin typing your search above and press return to search.

కంగనా మణికర్ణిక కార్యాలయానికి బీఎంసీ నోటీసులు...!

By:  Tupaki Desk   |   8 Sep 2020 12:30 PM GMT
కంగనా మణికర్ణిక కార్యాలయానికి బీఎంసీ నోటీసులు...!
X
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ - శివసేన నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. సుశాంత్ కేసులో న్యాయం జరగాలని చెప్తూ ముంబై పోలీసులపై నమ్మకం లేదని.. మాఫియా కంటే ముంబై పోలీసులంటేనే ఎక్కువ భయం ఉందని వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది. కంగనా రనౌత్ చేసిన ఈ వ్యాఖ్యలు అధికార పార్టీ శివసేనకు, ఆమెకు మధ్య చిచ్చు పెట్టాయి. దీనిపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ స్పందించి ముంబై పోలీసులపై నమ్మకం లేకుంటే ఇక్కడ అడుగుపెట్టవద్దని.. ముంబై మహారాష్ట్ర మరాఠాలపై మితిమీరి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని కంగనాను హెచ్చరించారు. అయితే వాటికి ఏమాత్రం జంకని కంగనా.. తాను సెప్టెంబర్ 9న ముంబైకి వస్తున్నానని, దమ్ముంటే తనను ఆపాలని సవాల్ చేసింది. తాను ముంబై పోలీసులను మాత్రమే విమర్శించానని.. మహారాష్ట్ర ను కాదని చెప్పుకొచ్చింది. ఇక కేంద్రం సైతం కంగనా కు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసింది. ఇలా కంగనాకు శివసేన ప్రభుత్వానికి మధ్య వివాదం ముదురుతున్న సమయంలో తాజాగా కంగనాకు బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) షాకిచ్చింది. కంగనా కు చెందిన బంగ్లాకు మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి తీసుకోకుండా మార్పులు చేశారని పేర్కొంటూ అధికారులు ఆ బంగ్లాకి నోటీసులు అంటించారు.

కాగా కంగనా రనౌత్ ఈ బంగళాను 'మణికర్ణిక కార్యాలయం' పేరుతో నిర్మించుకుందని తెలుస్తోంది. తన సొంత ఆఫీస్‌ గా ప్రకటించుకొని అక్కడ నుంచే సినిమాలకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చింది. అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాలతో తన కార్యాలయాన్ని కూల్చబోతున్నట్లు వెల్లడించి.. తన ఆఫీస్‌ లో బీఎంసీ అధికారులు ఉన్నట్లు ఓ వీడియోను కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో విడుదల చేసింది. తన అనుమతి లేకుండా కార్యాలయంలోకి అధికారులు వెళ్లారని.. కొలతలు తీసుకున్నారని కంగనా వీడియోలో చెప్పుకొచ్చింది. ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)తో పోల్చుతూ కంగనా వ్యాఖ్యలు చేసిన కొద్దిరోజులకే ఆమె కార్యాలయంలో బీఎంసీ అధికారులు కనిపించడం గమనార్హం. అయితే కంగనాను టార్గెట్ చేస్తూ బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కావాలనే నోటీసులు అంటించిందని ఆమె సపోర్టర్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంపై కంగనా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ''బీఎంసీ అధికారులు ఈ రోజు బుల్డోజర్‌ తో రాలేదు.. కానీ దానికి బదులుగా ఆఫీసులో జరుగుతున్న లీకేజీ పనులను ఆపడానికి నోటీసు ఇచ్చారు. ఫ్రెండ్స్ నేను చాలా రిస్క్ చేసి ఉండవచ్చు. కాని మీ అందరి నుండి నాకు అపారమైన ప్రేమ మద్దతు నాకు ఉంది'' అని ట్వీట్ చేసింది.