Begin typing your search above and press return to search.

అప్పుడు చిరూ ఫ్యాన్ .. ఇప్పుడు ఆయన మూవీకి డైరెక్టర్!

By:  Tupaki Desk   |   6 Nov 2021 9:30 AM GMT
అప్పుడు చిరూ ఫ్యాన్ .. ఇప్పుడు ఆయన మూవీకి డైరెక్టర్!
X
కాలం ఎప్పుడు ఎవరిని ఎటు వైవు తీసుకువెళుతుందో ఎవరికీ తెలియదు. ప్రవాహంతో పాటు ప్రయాణం చేస్తూ, అది ఏ తీరానికి తీసుకెళితే ఆ తీరానికి వెళ్లేవాళ్లు కొందరు. ఆ ప్రవాహానికి ఎదురీదుతూ, తాము అనుకున్న తీరానికి చేరుకుంటారు మరికొందరు. అలాంటివారిలో దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) ఒకరుగా కనిపిస్తాడు. చదువుకునే రోజుల్లో ఆయనకి మెగాస్టార్ అంటే పిచ్చి. చిరంజీవి చేసిన ప్రతి సినిమా చూడటం, ఆయనను ప్రత్యక్షంగా చూసే సమయం కోసం ఎదురుచూడటం ఇదే అప్పట్లో ఆయన పని.

అతి కష్టం మీద ఒకసారి ఆయన చిరంజీవిని కలుసుకున్నాడు. ఆయనతో కలిసి ఫొటో తీయించుకున్నాడు. ఎప్పటికైనా చిరంజీవితో సినిమా చేయాలనుకున్నాడు. ఆయనతో దిగిన ఆ ఫొటోను గుండెల్లో భద్రంగా దాచుకున్నాడు. చిరంజీవి 154వ సినిమా అయిన 'వాల్తేర్ వీర్రాజు' సినిమాకి ఆయన డైరెక్టర్ అయిపోయాడు. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో తన కల నిజమైన సందర్భంగా బాబీ ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన మనసులోని భావాలను బయటికి చెప్పుకున్నాడు.

"మెగాస్టార్ .. ఆయన పేరు వింటే చాలు అంతులేని ఉత్సాహం .. ఆయన పోస్టర్ చూస్తే అర్థం కాని ఆరాటం .. తెరపై ఆయన కనపడితే ఒళ్లు తెలియని పూనకం. 18 ఏళ్ల క్రితం ఆయనను మొదటిసారి చూసినప్పుడు కన్న కల నిజమవుతున్న ఈ వేళ, మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాను" అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చాడు. డైరెక్టర్ కావడానికి ముందు బాబీ కొన్ని సినిమాలకు కథ .. స్క్రీన్ ప్లే ను అందించాడు. ఆ తరువాత రవితేజ 'పవర్' సినిమాతో ఆయన దర్శకుడిగా మారాడు. 'సర్దార్ గబ్బర్ సింగ్'తో మాస్ యాక్షన్ సినిమాలు బాగా చేయగలడని నిరూపించుకున్నాడు.

ఇక ఎన్టీఆర్ తో ఆయన చేసిన ' జై లవ కుశ' భారీ విజయాన్ని అందుకుని మంచి పేరు తీసుకొచ్చింది. ఇక కరోనాకు ముందు వచ్చిన 'వెంకీమామ' కూడా ఫరవాలేదనిపించింది. అలాంటి బాబీ కసితో ఓ కథపై కూర్చుని కసరత్తు చేయడం .. చిరంజీవికి వినిపించి ఓకే చేయించుకోవడం జరిగిపోయాయి. ఇప్పుడు బాబీ ఆ సినిమాకి సంబంధించిన పనుల్లోనే బిజీగా ఉన్నాడు. తన డ్రీమ్ .. చిరంజీవి సినిమాను డైరెక్ట్ చేయడమేనని చెప్పుకుంటున్న బాబీ, ఏ స్థాయి సంచలనానికి తెరతీస్తాడో చూడాలి.