Begin typing your search above and press return to search.

బాలీవుడ్ న‌టుడు రాజ్ బ‌బ్బ‌ర్ కు రెండేళ్ల జైలుశిక్ష‌.. కేసు ఇదే!

By:  Tupaki Desk   |   8 July 2022 5:33 AM GMT
బాలీవుడ్ న‌టుడు రాజ్ బ‌బ్బ‌ర్ కు రెండేళ్ల జైలుశిక్ష‌.. కేసు ఇదే!
X
ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, కాంగ్రెస్ నాయకుడు రాజ్ బబ్బర్ కు ఉత్తర ప్రదేశ్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. 26 ఏళ్ల నాటి కేసులో ఆయ‌న దోషిగా తేల‌డంతో రెండేళ్ల‌ జైలుశిక్షతో పాటు 6,500 జరిమానా వేసింది. 1996 సార్వ‌త్రిక ఎన్నికల్లో ఒక పోలింగ్ అధికారిపై దాడి చేసిన కేసులో రాజ్ బబ్బర్‌ను కోర్టు నేర‌స్తుడిగా నిర్ధారించింది.

కాగా ఇదే కేసులో నిందితుడిగా ఉన్న అరవింద్ సింగ్ యాదవ్ విచారణ సమయంలో మరణించిన సంగ‌తి తెలిసిందే. తరువాత కోర్టు రాజ్ బబ్బర్‌ను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేసింది. తీర్పుపై అప్పీల్ చేసుకోవ‌డానికి అవకాశం ఇచ్చింది.

కాంగ్రెస్ నాయకుడు రాజ్ బబ్బర్ ఎన్నిక‌ల విధుల్లో ఉన్న త‌న‌ను విధులు నిర్వర్తించనీయ‌కుండా అడ్డు త‌గిలారని, అంతేకాకుండా త‌న‌పై భౌతిక దాడి చేశార‌ని పోలింగ్ అధికారి శ్రీ కృష్ణ సింగ్ రాణా ఫిర్యాదు చేశారు.

1996 పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో రాజ్ బబ్బర్ సమాజ్ వాదీ పార్టీ నుండి పోటీ చేశారు. ఆ స‌మ‌యంలో పోలింగ్ అధికారిపై దాడికి పాల్ప‌డ‌టంతో ఆయ‌న‌పై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. రాజ్ బ‌బ్బ‌ర్ తోపాటు ప‌లువురిపై పోలింగ్ అధికారి ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే.

రాజ్ బబ్బర్ తన మద్దతుదారులతో కలిసి పోలీసు ప్రాంతంలోకి ప్రవేశించి పోలింగ్ సిబ్బందిపై దాడి చేసి ఓటింగ్ ప్రక్రియను కూడా ప్రభావితం చేసినట్లు ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కాగా రాజ్ బబ్బ‌ర్ ప్రస్తుతం యూపీ కాంగ్రెస్‌లో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు.

కాగా.. కోర్టు తీర్పుపై రాజ్ బబ్బర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తీర్పు వెలువడే సమయంలో రాజ్ బబ్బర్ కోర్టులో ఉన్నారు. ఈ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేస్తానని చెప్పారు. రాజ్ బబ్బర్‌కు శిక్ష ఖరారుపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీనిపై పలువురు సోష‌ల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.