Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో సత్తా చాటిన బాలీవుడ్ బ్యూటీస్...!

By:  Tupaki Desk   |   7 July 2020 2:00 PM GMT
టాలీవుడ్ లో సత్తా చాటిన బాలీవుడ్ బ్యూటీస్...!
X
మేల్ డామినేషన్ సినీ ఇండస్ట్రీలో ఎంతటి టాలెంటెడ్ హీరోయిన్ అయినా కొంతకాలం మాత్రమే తమ హవా చూపించగలుగుతారు. అందుకే ఒకే ఇండస్ట్రీకి పరిమితం అవకుండా భాషతో సంబంధం లేకుండా అవకాశాలు వచ్చినప్పుడు ఇరత భాషల చిత్రాల్లోనూ నటిస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది హీరోయిన్స్ తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ముఖ్యంగా బాలీవుడ్ నుండి టాలీవుడ్ లో అడుగుపెట్టిన హీరోయిన్లు తమ సత్తా చూపించారు.

బాలీవుడ్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ నగ్మా టాలీవుడ్ లో కొన్నేళ్లపాటు సత్తా చాటింది. 'పెద్దింటి అల్లుడు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమై 'కిల్లర్' 'ఘరానా మొగుడు' 'వారసుడు' 'మేజర్ చంద్రకాంత్' 'ముగ్గురు మొనగాళ్లు' 'కొండపల్లి రాజా' చిత్రాలతో టాలీవుడ్ లో పాతుకుపోయింది. ఇక సీనియర్ హీరోయిన్ టబు 'కూలీ నెం.1' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది. ఆ తర్వాత 'నిన్నేపెళ్లాడుతా' సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇక 'ఆవిడా మా ఆవిడే' 'పాండురంగడు' 'చెన్నకేశవ రెడ్డి' 'అందరివాడు' 'ఇదీ సంగతి' తదితర చిత్రాల్లో నటించిన టబు 'అల వైకుంఠపురంలో' సినిమాతో మరోసారి టాలీవుడ్ కి రీఎంట్రీ ఇచ్చింది. తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా టబుకి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందని చెప్పవచ్చు.

ఇక బాలీవుడ్ బ్యూటీ సోనాలి బింద్రే కూడా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'మురారి' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సోనాలి బింద్రే 'ఇంద్ర' 'ఖడ్గం' 'పల్నాటి బ్రహ్మనాయుడు' 'మన్మథుడు' 'శంకర్ దాదా ఎంబీబీఎస్' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. తెలుగులో 'ప్రేమంటే ఇదేరా' 'రాజకుమారుడు' సినిమాల్లో నటించిన ప్రీతీ జింటా రెండు సినిమాలతోనే ఎనలేని గుర్తింపు తెచ్చుకుంది. 'ప్రేమించుకుందాం రా' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన అంజలా ఝవేరీ 'చూడాలని ఉంది' 'సమరసింహారెడ్డి' 'రావోయి చందమామ' 'దేవిపుత్రుడు' సినిమాలలో నటించింది.

'లక్ష్మీ కళ్యాణం' సినిమాతో తెలుగు ఇండీస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయిన కాజల్ అగర్వాల్ ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. 'చందమామ' 'మగధీర' 'ఆర్య 2' 'డార్లింగ్' 'బృందావనం' 'మిస్టర్ పర్ఫెక్ట్' 'బిజినెస్ మాన్' 'బాద్‍ షా' 'ఎవడు' 'టెంపర్' 'ఖైదీ నెం 150' సినిమాలతో టాప్ హీరోయిన్ గా వెలుగొందింది. కొత్త హీరోయిన్స్ ఎంతమంది వస్తున్నా తనకంటూ ఇండస్ట్రీలో ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకొని ఆఫర్స్ దక్కించుకుంటూ ఉంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' లో నటిస్తోంది. ఇక 'శ్రీ' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా కూడా వరుస ఆఫర్స్ తో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. దాదాపు అందరు స్టార్ హీరోస్ తో నటించిన తమన్నా 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. వీరే కాకుండా ఇంకా చాలా మంది బ్యూటీస్ బాలీవుడ్ నుండి ఇంపోర్ట్ అయి టాలీవుడ్ లో కూడా సత్తా చాటారు.