Begin typing your search above and press return to search.

VD ముందే 'అర్జున్ రెడ్డి'ని విమర్శించిన బాలీవుడ్ బ్యూటీ..!

By:  Tupaki Desk   |   30 July 2022 9:30 AM GMT
VD ముందే అర్జున్ రెడ్డిని విమర్శించిన బాలీవుడ్ బ్యూటీ..!
X
''అర్జున్ రెడ్డి''.. యంగ్ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ నే మలుపు తిప్పిన సినిమా. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ఈ మూవీ VD ని రాత్రికి రాత్రే క్రేజీ హీరోగా మార్చేసింది. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు విజయ్ ఇంత ఎర్లీ స్టేజ్ లోనే పాన్ ఇండియా అంటున్నాడంటే ఒక రకంగా ఈ సినిమానే కారణం.

బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన 'అర్జున్ రెడ్డి' సినిమా తమిళ హిందీ భాషల్లోనూ రీమేక్ చేయబడింది. ఇందులో హీరో క్యారక్టరైజేషన్ మరియు అతని యాటిట్యూడ్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అదే సమయంలో ఈ సినిమాపై విమర్శలు కూడా వచ్చాయి. పలువురు సినీ ప్రముఖులు - ఫెమినిస్టులు పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు.

ఇప్పుడు లేటెస్టుగా 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో 'అర్జున్ రెడ్డి' వివాదం గురించి ప్రస్తావన వచ్చింది. కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న ఈ కార్యక్రమానికి తాజాగా 'లైగర్' చిత్రంలో జోడీగా నటిస్తున్న విజయ్ దేవరకొండ మరియు అనన్య పాండే కలిసి హాజరైన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా 'అర్జున్ రెడ్డి' చిత్రంలో ప్రీతిని చెంపదెబ్బ కొట్టినందుకు విజయ్ దేవరకొండపై వచ్చిన విమర్శల గురించి కరణ్ జోహార్ ప్రశ్నించారు. దీనికి విజయ్‌ బదులిస్తూ "నేను చేస్తున్న క్యారెక్టర్‌ ని ఫీల్ అవ్వకపోతే నటించలేను. అందుకే అర్జున్ రెడ్డి ఏం చేసినా ఒప్పుకుంటాను" అని అన్నారు.

అయితే అర్జున్ రెడ్డి పై అనన్య స్పందిస్తూ అది సమాజంపై ప్రభావం చూపుతుందనే విషయాన్ని ఎత్తి చూపింది. అర్జున్ రెడ్డి తన గర్ల్ ఫ్రెండ్ ని అవసరమైతే చెంపదెబ్బ కొట్టగలడని నార్మల్ గా చూపించడం ద్వారా.. ఇది యువతను తప్పుదారి పట్టించే సినిమా అవుతుందని అనన్య పేర్కొంది.

"నేను సినిమాలోని పాటలను ఇష్టపడ్డాను.. పెర్ఫార్మన్స్ అద్భుతంగా ఉన్నాయి. అయితే విజయ్ పక్కన ఉన్నాడు కదా అని నేను అర్జున్ రెడ్డిని అంగీకరించలేను. ఎందుకంటే ఇది మొత్తం ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రజలు దాని నుండి ప్రేరణ పొందవచ్చు" అని అనన్య తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

స్నేహితులలో ఎవరైనా అలాంటి రిలేషన్ షిప్ కలిగి ఉన్నట్లు నేను చూసినా నేను అంగీకరించను అని అనన్య పేర్కొంది. తన చుట్టూ "అర్జున్ రెడ్డి" లాంటి వ్యక్తులు లేరని.. అలాగే తన స్నేహితులకు కూడా అలా చేయమని సలహా ఇవ్వనని లైగర్ బ్యూటీ చెప్పుకొచ్చింది.

కాఫీ విత్ కరణ్ యొక్క లేటెస్ట్ ఎపిసోడ్‌ లో అర్జున్ రెడ్డి పై అనన్య మాటలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉంది. ఆ పాత్ర పోషించిన విజయ్ దేవరకొండ పక్కన ఉన్నా తన అభిప్రాయాన్ని బలంగా చెప్పిందని.. మెచ్యూర్ గా సమాధానమిచ్చిందని పలువురు నెటిజన్లు అనన్య ను ప్రశంసిస్తున్నారు.

మరికొందరు మాత్రం అనన్య కూడా ఒక ఫెమినిస్ట్ లా ఆలోచిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ పాత్రను చూసే కదా అతనితో డేటింగ్ చేయాలని ఆమె కోరుకుందని అంటున్నారు.

ఇకపోతే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ - అనన్య జంటగా నటించిన 'లైగర్' సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ఆగస్ట్ 25న పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల కాబోతోంది.