Begin typing your search above and press return to search.

ప్యాడ్ ఛాలెంజ్ లో పద్మావతి

By:  Tupaki Desk   |   4 Feb 2018 10:51 AM GMT
ప్యాడ్ ఛాలెంజ్ లో పద్మావతి
X
పద్మావత్ కోసం రెండు వారాలు వాయిదా వేసుకుని త్యాగం చేసిన అక్షయ్ కుమార్ ప్యాడ్ మ్యాన్ దాన్ని సరైన రీతిలో ఉపయోగించుకుంటోంది. కావలసినంత టైం దొరకటంతో పనిలో పనిగా సినిమాతో పాటు ఒక మంచి పనిని కూడా ప్రోమోట్ చేసే బాధ్యతను తలకెత్తుకుంది. ప్యాడ్ మ్యాన్ సినిమాలో ప్రధానాంశమైన సానిటరీ నాప్కిన్ గురించి భారత దేశంలో అందులోనూ గ్రామీణుల్లో నిజంగానే అవగాహన చాలా తక్కువ స్థాయిలో ఉంది. ఇప్పటికీ భార్యకో లేక తోడబుట్టిన వాళ్ళకో కేర్ ఫ్రీ కావాలంటే ధైర్యంగా షాపుకు వెళ్లి అడిగే మగరాయుళ్ళ శాతం తక్కువే. అంత దాకా ఎందుకు. అధిక శాతం మెడికల్ షాపుల్లో నాప్కిన్ ఇచ్చేటప్పుడు అదేదో అంటరాని వస్తువు ఇస్తున్నట్టు బయటికి కనిపించకుండా న్యూస్ పేపర్ లో చుట్టి ఇచ్చే దుకాణదారులకు కొదవే లేదు. దాన్ని సంస్కరించే ప్రయత్నమే ప్యాడ్ మ్యాన్ ఛాలెంజ్

ప్రతి ఒక్కరు మహిళల ఋతుస్రావం కోసం వాడే న్యాప్కిన్ ప్యాడ్ ను చేతిలో పట్టుకుని ఫోటో దిగి మరి కొందరిని కూడా ఇలాగే చేయమని ఛాలెంజ్ చేయటం దీనిలోని ప్రధాన ఉద్దేశం. ఇప్పటి దాక ఎందరో బాలీవుడ్ సెలెబ్రిటీలు ఇందులో పాల్గొన్నారు. అమీర్ ఖాన్ నిన్నే ఈ పని చేసి అమితాబ్ - సల్మాన్ - షారుఖ్ లకు సవాల్ కూడా విసిరాడు. ఈ రోజు పద్మావత్ రాణి దీపిక పదుకునే కూడా జాయిన్ అయ్యింది. పివి సింధుకు ఛాలెంజ్ విసిరింది. అలియా భట్ అయితే ఏకంగా తాను చేస్తున్న జిమ్ ఎక్స్ సర్సైజ్ లో భాగంగా తలకిందులుగా స్టిల్ ఇచ్చి మరీ ప్యాడ్ తో ఫోటో దిగింది. ఇది ఇక్కడితో ఆగలేదు. దియా మిర్జా - సోనం కపూర్ - షబానా ఆజ్మీ - డింపుల్ కపాడియా - ఆదితి హైదారి రావు లతో పాటు ఎందరో కాలేజీ విద్యార్థులు - బాలీవుడ్ సినిమా టీమ్స్ - నటీనటులు - సాంకేతిక నిపుణులు అందరూ ఇందులో పాల్గొంటున్నారు.

మొదలుపెట్టింది సినిమా ప్రమోషన్ కోసమే అయినప్పటికీ ఇందులో ఉద్దేశం మంచిది కావడంతో అందరూ చేయూత ఇస్తున్నారు. ఇది సినిమా విడుదల అయ్యాక ఆగాల్సింది మాత్రం కాదు. ఓ పది రోజులు ఫోటోలకు ఫోజులు ఇచ్చేస్తే పరిష్కారం జరిగేది కాదు. కొంతకాలం పాటు నిరంతరాయంగా కొనసాగి జనంలో ఋతుస్రావం పట్ల న్యాప్కిన్ వాడకం పట్ల ఉన్న భిన్నాభిప్రాయాలు తొలగిపోయేలా కొనసాగించాల్సిన అవసరం చాలా ఉంది. దీనితో పాటు ఆ సమయంలో మహిళల పట్ల ఉన్న కట్టుబాట్లు, సాంఘిక మూడనమ్మకాల గురించి కూడా ఏదైనా క్యాంపైన్ లాంటిది పెడితే బెటర్. ఫిబ్రవరి 9న విడుదల అవుతున్న ప్యాడ్ మ్యాన్ మీద బాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అదే రోజు నీరజ్ పాండే అయారి కూడా రిలీజ్ అవుతోంది కాని ఇంత స్పీడ్ గా దాని ప్రమోషన్ లేకపోవడం గమనార్హం.