రాజస్థాన్ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ లో బాలీవుడ్ లవ్ బర్డ్స్ వివాహం..!
By: Tupaki Desk | 12 Nov 2021 10:30 AM GMTబాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారంటూ గత కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బీతౌన్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం విక్కీ - కత్రినా వివాహం రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ లో అంగరంగ వైభవంగా జరగనుందని తెలుస్తోంది.
విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్ వివాహ వేడుకలు డిసెంబర్ 7-12 తేదీల మధ్య జరగనుండగా.. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన హోటల్ బుకింగ్ కూడా పూర్తయిందని కథనాలు వస్తున్నాయి. అంతేకాదు ఈ వీఐపీ వెడ్డింగ్ నిర్వహించడానికి చాలా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు కలిసి పని చేస్తున్నాయని.. వీరు సవాయ్ మాధోపూర్ లోని వివిధ హోటళ్లలో రూమ్స్ బుక్ చేసే పనిలో ఉన్నారని అంటున్నారు.
మరోవైపు కత్రినా - విక్కీ కౌశల్ ల టీమ్ కూడా పెళ్లి కోసం సన్నాహాలు మొదలుపెట్టింది. సిక్స్ సెన్సెస్ బర్వారా కోటలో పరిస్థితిని సమీక్షించేందుకు 10 మంది సభ్యుల బృందం మంగళవారం అక్కడికి చేరుకుందట. వివాహ వేడుకలో భాగంగా జరిగే మెహందీ ఫంక్షన్ - సంగీత్ వంటివి ఎక్కడ నిర్వహించాలనే విషయాలను టీమ్ పర్యవేక్షిస్తోందని జాతీయ మీడియా చెబుతోంది. అయితే ఈ పెళ్లి గురించి విక్కీ - కత్రినా తరపు నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
కాగా, బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్.. యువ హీరో విక్కీ కౌశల్ తో డేటింగ్ లో ఉందనే వార్తలు బీ టౌన్ లో ఎప్పటి నుంచో చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ తరచూ చెట్టాపట్టాలేసుకుని విదేశాల్లో తిరగడంతో పాటు పలు ప్రైవేట్ పార్టీలలో కనిపించడం ఈ వార్తలకు బలం చేకూరింది. అయినా సరే ఈ జంట తమ వ్యక్తిగత జీవితం.. రిలేషన్ షిప్ కు సంబంధించిన విషయాలపై సస్పెన్స్ కొనసాగిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే విక్కీ- కత్రినాలకు దీపావళి రోజున రోకా ఫంక్షన్ జరిగినట్లు వార్తలు వచ్చాయి.
కత్రినా కైఫ్ కు ఎంతో ఆప్తుడైన దర్శకుడు కబీర్ ఖాన్ నివాసంలో ఈ వేడుక నిర్వహించారని బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. కత్రినా, ఆమె తల్లి సుజానే టర్కోయెట్ - ఇసాబెల్ - విక్కీ కౌశల్ మరియు ఆయన తల్లిదండ్రులతోపాటు సోదరుడు సన్నీ కౌశల్ ఈ వేడుకలో పాల్గొన్నారని.. వివాహానికి సంబంధించిన విశేషాల గురించి మాట్లాడుకున్నారని.. ఇరు కుటుంబాలు పలు ఖరీదైన బహుమతులను ఇచ్చిపుచ్చుకున్నారని ఆంగ్ల పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు డిసెంబర్ లో రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ లో వీరి పెళ్లి జరగనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రేమ జంట పెళ్లి వార్తలపై అధికారిక ప్రకటన చేస్తారేమో చూడాలి.