Begin typing your search above and press return to search.

బాహుబ‌లి - KGF తో పోల్చుకుంటేనే సంతృప్తి!

By:  Tupaki Desk   |   25 Jun 2022 4:33 AM GMT
బాహుబ‌లి - KGF తో పోల్చుకుంటేనే సంతృప్తి!
X
సౌత్ సినిమా ప్రభావం బాలీవుడ్ పై ఏ రేంజులో ఉందో చెప్పుకోవ‌డానికి ఇంత‌కంటే ఉదాహ‌ర‌ణ అవ‌స‌రం లేదు. ఇంత‌కుముందు బాహుబ‌లి- బాహుబ‌లి 2 చిత్రాల‌తో ఇత‌రులు పోల్చుకునేవారు. ఆ రెండు సినిమాల రికార్డుల‌ను కొట్టాల‌నుకునేవారు. ఇప్పుడు కేజీఎఫ్ .. కేజీఎఫ్ 2 చిత్రాల‌తో పోల్చుకుంటున్నారు. ఈ రికార్డులను కూడా ఛేదించాల‌నుకుంటున్నారు. మ‌ధ్య‌లో ఆర్‌.ఆర్.ఆర్ రేంజులో హిట్లు కావాలని హిందీ వాళ్లు ఆరాట‌ప‌డుతున్నారు. కానీ ఇది సాధ్య‌మ‌య్యే ప‌నేనా?

ర‌ణ‌బీర్ ఇప్ప‌టికిప్పుడు బ్ర‌హ్మాస్త్ర‌- షంషేరా అంటూ రెండు భారీ చిత్రాల‌ను రిలీజ్ చేస్తున్నాడు. ఇవ‌న్నీ సౌత్ పై దండెత్తేందుకు వ‌స్తున్నాయి. కానీ వీటికి ఇక్క‌డ ఆద‌ర‌ణ ఎంత‌? అన్న‌దే ఇప్పుడు స‌స్పెన్స్ గా మారింది. ఇటీవ‌లే రిలీజైన బ్ర‌హ్మాస్త్ర సినిమా ట్రైల‌ర్ ని తెలుగులో అట్ట‌ర్ ఫ్లాపులైన వీఎఫ్ ఎక్స్ గ్రాపిక్స్ సినిమాల‌తో పోల్చారు. ఢ‌మ‌రుకం- అంజి లాంటి చిత్రాల‌కు ఇది తీసిపోద‌ని విమ‌ర్శించారు. ఇంత‌లోనే ర‌ణ‌బీర్ న‌టించిన షంషేరా ట్రైల‌ర్ విడుద‌లైంది. ఈ ట్రైల‌ర్ ఫ‌ర్వాలేద‌నిపించింది. కొంతైనా పాన్ ఇండియా అప్పీల్ దీనికి ఉందేమో! అన్న టాక్ కూడా వినిపించింది.

అంతేకాదు ర‌ణ‌బీర్ అభిమానులు ఈ ట్రైల‌ర్ చూశాక కేజీఎఫ్ లా ఉంద‌ని కూడా అనేశారు. దీన‌ర్థం సౌత్ ప్ర‌భావం బాలీవుడ్ పై ఒక రేంజులో ఉంద‌నే క‌దా? ఇక య‌ష్ న‌టించిన‌ కేజీఎఫ్ బాక్సాఫీస్ వ‌ద్ద 300కోట్లు వసూలు చేయ‌గా కేజీఎఫ్ 2 ఏకంగా 1000 కోట్లు వ‌సూలు చేసి ఔరా అనిపించింది. అందుకే ఆ రేంజులో ర‌ణ‌బీర్ క‌పూర్ కూడా హిట్టందుకోవాల‌ని అభిమానులు ఆశ‌ప‌డుతున్నారు. ఇక కేజీఎఫ్ స‌హా ఎన్నో సౌత్ సినిమాల స్ఫూర్తితోనే షంషేరాను రూపొందించార‌ని కూడా అర్థ‌మ‌వుతోంది. చివ‌రికి మేమే గొప్ప అని చెప్పుకునే బాలీవుడ్ ప్ర‌భుద్దులు ఇప్పుడు సౌత్ పై ఎంత‌గా డిపెండ్ అయ్యారో ఇది అర్థ‌మ‌య్యేలా చెబుతోంది. ఇది సౌత్ గ‌ర్వం కాదు.. గ‌ర్వించద‌గ్గ టైమ్ అని చెప్పాలి.

ట్రైల‌ర్ రాగానే ర‌ణ‌బీర్ అభిమానులు 'షంషేరా'ను యష్ KGF: చాప్టర్ 2తో పోలిక‌లు చూశారు. షంషేరా జూలై 22న‌ వెండితెరపైకి రావడానికి సిద్ధంగా ఉంది. పోస్టర్ లను లాంచ్ చేయడం నుండి టీజర్ ట్రైల‌ర్ ల‌ను విడుదల చేయడం వరకు ప్ర‌చారం ప‌రంగా మేకర్స్ ఎటువంటి అవ‌కాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. షంషేరాను ఇండియాలో అత్యంత భారీగా రిలీజ్ చేసేందుకు ప‌క‌డ్భందీగా ప్లాన్ చేస్తున్నారు.

మొదటిసారిగా రణబీర్ కపూర్ ద్విపాత్రాభినయం చేస్తుండ‌గా షంషేరాలో సంజయ్ దత్ ప్రధాన విల‌న్ గా నటించారు. వాణి కపూర్ నర్తకిగా నటించింది. ఇందులో రణబీర్ కపూర్ బానిస పాత్ర హైలైట్ గా ఉండ‌నుంది.. సంజయ్ దత్ దరోగ శుద్ధ్ సింగ్ అనే క్రూరుడిగా క‌నిపిస్తున్నాడు. అత‌డి భారి నుండి తన తెగను రక్షించడానికి ర‌ణ‌బీర్ బానిస నాయకుడిగా మారుతాడు. క్రూరమైన దరోగా యోధులు త‌మ‌ తెగను బానిసలుగా మార్చుకోవ‌డానికి ఎదురు తిరుగుతుంటాడు ర‌ణ‌బీర్‌. విల‌న్ నుండి తన మనుషులను రక్షించుకోవడానికి ర‌ణ‌బీర్ ఎలాంటి పోరాటాలు చేసాడ‌న్న‌దే సినిమాలో చూపిస్తున్నారు.

దీంతో నెటిజన్లు షంషేరాను యష్ KGF 2తో పోల్చారు. కేజీఎఫ్ 2 క‌థ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. గ‌నుల్లో బానిస‌లుగా బందీలు అయిన‌ ఊరి జ‌నాలను కాపాడుతూ వారి మెప్పు పొంది కేజీఎఫ్ గ‌నుల్లో వీర‌త్వం ప్ర‌ద‌ర్శించేవాడిగా య‌ష్ క‌నిపిస్తాడు. పైగా కేజీఎఫ్ 2లో కూడా సంజ‌య్ ద‌త్ విల‌న్ గా క‌నిపించ‌డంతో ప్ర‌జ‌లు షంషేరాకు పోలిక‌ను చూస్తున్నారు. ఒక ర‌కంగా షంషేరా లైన్ తో పాటు.. పాత్ర‌ల‌ను కూడా ఇంచుమించు కేజీఎఫ్ త‌ర‌హాలోనే తీర్చిదిద్దార‌ని అర్థ‌మ‌వుతోంది. మ‌రోవైపు ర‌ణ‌బీర్ పాత్ర ఆహార్యాన్ని ప‌ద్మావ‌త్ లో ఖిల్జీ త‌ర‌హా లుక్ లో తీర్చిదిద్దార‌ని కూడా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

కొంతమంది అభిమానులు KGF కంటే షంషేరా పెద్దదిగా ఉంటుంది! అంటూ హుంక‌రిస్తున్నారు. ఎవ‌రు ఎలా ప్ర‌శంసించినా దానికి సౌత్ లోనే మూలం ఉంది అని నిరూప‌ణ అయ్యింది. ఇది నిజంగా మ‌నోళ్ల గొప్ప‌త‌నంగా ప‌రిగ‌ణించాలి.