Begin typing your search above and press return to search.

ఫోకస్‌: హాలీవుడ్‌ వెళ్లిపోతున్నారు

By:  Tupaki Desk   |   1 July 2015 9:30 AM GMT
ఫోకస్‌: హాలీవుడ్‌ వెళ్లిపోతున్నారు
X
గ్లోబలైజేషన్‌ అన్నిటికీ వర్తిస్తుంది. నటీనటులు ఒకే భాషలో నటించాలన్న రూలేం లేదు. మార్కెట్‌ని పొరుగు భాషలకి విస్తరించుకుంటే తప్పేం లేదు. ప్రస్తుతం నవతరం కథానాయికలు అనుసరిస్తున్న పంథా ఇది. టాలీవుడ్‌లో ఉన్న స్టార్‌ హీరోయిన్లందరూ పొరుగు భాషల్లో నటిస్తున్నారు. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా అన్నిచోట్లా అవకాశాలు అందుకుంటున్నారు. అలాంటప్పుడు బాలీవుడ్‌ నాయికలు హాలీవుడ్‌లో నటిస్తే తప్పేంటి? అక్కడ నుంచి వచ్చే అవకాశాల్ని ఒడిసి పట్టుకుంటే తప్పేంటి? అసలు తప్పే కాదు.

ఉత్తరాదికి చెందిన అరడజను మంది స్టార్‌ హీరోయిన్లు ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు. నర్గీస్‌ ఫక్రీ, కత్రిన, కంగన, ప్రియాంక, శ్రీయ శరణ్‌ ఇలా నాయికలంతా హాలీవుడ్‌ బాట పడుతున్నారు. ఇప్పటికే నర్గీస్‌ ఫక్రీ 'స్పై' అనే హాలీవుడ్‌ చిత్రంలో నటించింది. ఈ చిత్రంతో నర్గీస్‌ హాలీవుడ్‌లోనూ పాపులరైంది. కొందరు దర్శకనిర్మాతలు ఇప్పటికే తమ సినిమాల్లో నటించాల్సిందిగా ఆఫర్‌ చేశారు. అలాగే ఇప్పటికే ప్రియాంక చోప్రా క్వాంటికో అనే హాలీవుడ్‌ టివి సీరియల్‌తో బాగా పాపులరైంది. మరిన్ని హాలీవుడ్‌ ప్రాజెక్టులకు సంతకాలు చేసే పనిలో ఉందని తెలుస్తోంది. ఓ వైపు బాజీ రావ్‌ మస్తానీ, గంగాజల్‌- 2 చిత్రాలతో బిజీగా ఉంది. మరోవైపు సొంత నిర్మాణంలో సినిమా ఉంది.

ఇక తను వెడ్స్‌ మను చిత్రంలో నటించిన కంగన ప్రస్తుతం హాలీవుడ్‌ వైపు దృష్టి సారిస్తోందని సమాచారం. రాణీ లక్ష్మిబాయ్‌ బయోపిక్‌లో నటించేందుకు ఓకే చెప్పింది. మరోభామ కత్రిన కైఫ్‌ ఫాంటమ్‌, జగ్గూ జాసూస్‌, ఫితూర్‌ అనే మూడు చిత్రాల్లో నటిస్తోంది. మరోవైపు హాలీవుడ్‌ అవకాశాలొస్తే నటించడానికి రెడీ అంటోంది. అయితే ఇదంతా మోడ్రన్‌ వరల్డ్‌లో వచ్చిన మార్పుకు సంకేతం. ఎక్కడ మార్కెట్‌ ఉంటే అక్కడికి ఎగిరిపోవడం, అవకాశాల్ని అందిపుచ్చుకోవడం అదొక్కటే ప్రాతిపదిక. బాలీవుడ్‌, హాలీవుడ్‌ అంటూ హద్దులు గీసుకుని నటించడానికి సిద్ధంగా లేరెవరూ.