Begin typing your search above and press return to search.

అదేంటీ `బాహుబ‌లి`.. `క‌ర‌ణ్ అర్జున్` సినిమానా?

By:  Tupaki Desk   |   7 Sep 2022 2:30 AM GMT
అదేంటీ `బాహుబ‌లి`.. `క‌ర‌ణ్ అర్జున్` సినిమానా?
X
బాలీవుడ్ గ‌త కొంత కాలంగా గ‌డ్డు ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటోంది. కానీ ఇదే స‌మ‌యంలో ద‌క్షిణాది సినిమాలు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌న విజ‌యాల్ని న‌మోదు చేసుకుంటున్నాయి. ఈ విష‌యంలో బాలీవుడ్ వ‌ర్గాల‌లో గ‌త కొన్ని నెల‌ల‌గా చ‌ర్చ జ‌రుగుతోంది. బాలీవుడ్ సినిమాలు ఆడ‌క‌పోవ‌డంపై ప‌లువురు ఎవ‌రికి తోచింది వారు చెబుతూ వ‌స్తున్నారు. కొంత మంది కంటెంట్ స‌రిగా లేద‌ని కామెంట్ లు చేస్తే మ‌రి కొంత మంది మేక‌ర్స్ లో వున్న ఆలోచ‌నా విధానం మారాల‌ని కామెంట్ లు చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ హీరో హృతిక్ రోష‌న్ ఫాద‌ర్‌, యాక్ట‌ర్‌, డైరెక్ట‌ర్ రాకేష్ రోష‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. `ఘ‌ర్ ఘ‌ర్ కీ క‌హానీ` సినిమాతో న‌టుడిగా ప్ర‌యాణం మొద‌లు పెట్టిన రాకేష్ రోష‌న్ `గూండాగ‌ర్జ్‌` మూవీతో ద‌ర్శ‌కుడిగా మారారు. క‌ర‌ణ్ అర్జున్‌, క‌హోనా ప్యార్ హై, కోయి మిల్ గ‌యా, క్రిష్‌, క్రిష్ 2, క్రిష్ 3 సినిమాల‌తో ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. త్వ‌ర‌లో త‌న‌యుడు హృతిక్ రోష‌న్ తో `క్రిష్ 4`ని తెర‌పైకి తీసుకురాబోతున్నార‌.

ఈ నేప‌థ్యంలో ఓ బాలీవుడ్ మీడియాతో ప్ర‌త్యేకంగా మాట్లాడిన రాకేష్ రోష‌న్ బాలీవుడ్ మేక‌ర్ల‌పై నిప్పులు చెరిగారు. బాలీవుడ్ ఎదుర్కొంటున్న ఫెల్యూర్స్ కి గ‌ల కార‌ణాలు వెల్ల‌డించారు. బాలీవుడ్ సినిమాలు ఫ్లాప్ కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం మేక‌ర్సే అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఫిల్మ్ మేక‌ర్స్ తాము, త‌మ స్నేహితుల కోస‌మే సినిమాలు తీసుకుంటున్నార‌ని, ప్రేక్ష‌కుల ఇష్ట‌ప‌డే సినిమాలు కాకుండా తాము, త‌మ స్నేహితుల‌కు ఇష్ట‌మైన‌వి మాత్ర‌మే చేస్తున్నార‌ని, అలాంటి సినిమాల‌ని చాలా త‌క్క‌వ మంది చూస్తార‌ని మెజారిటీ ప్రేక్ష‌కులు వాటిని ఆద‌రించ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు.

ప్రేక్ష‌కుల‌కు సంబంధం లేని క‌థ‌ల‌తో సినిమాలు చేస్తున్నార‌ని. అలాంటి క‌థ‌ల్ని ఎంచుకుంటున్నార‌ని, అందుకే హిందీ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద రాణించ‌డం లేద‌ని తెలిపారు. ద‌క్షిణాది సినిమాలు ఆడ‌టానికి కార‌ణం చెబుతూ..ఇప్ప‌టికీ జ‌నాల జీవితాల‌ను చూపించే క‌థ‌ల‌కే ద‌క్షిణాది మేక‌ర్స్ క‌ట్టుబ‌డి వున్నార‌ని అలాంటి క‌థ‌ల‌కు క‌మ‌ర్షియ‌ల్ సెన్సిబులిటీస్ ని జోడించి చాలా అప్ గ్రేడ్ గా సినిమాలు చేస్తున్నార‌ని, బాహుబ‌లి, RRR అలాంటి క‌థ‌లే అన్నారు.

అంతే కాకుండా బాహుబ‌లి తాను రూపొందించిన `క‌ర‌ణ్ అర్జున్‌`ని పోలి వుంటుంద‌ని, అయితే అదే క‌థ‌కు మార్పులు చేసి భారీ స్థాయిలో తెర‌కెక్కించార‌ని, ఆ కార‌ణంగానే ప్రేక్ష‌కులు ఆయా సినిమాల‌ని ఆద‌రించార‌న్నారు. కానీ బాలీవుడ్ మేక‌ర్స్ మాత్రం భార‌తీయ మూలాల‌ని మ‌రి అధునిక‌త పేరుతో చెత్త‌ని తెర‌మీదికి తీసుకొస్తున్నార‌ని, అది కేవ‌లం ఒక శాతం ప్రేక్ష‌కుల‌కే న‌చ్చుతోంద‌ని తెలిపారు. ఆ సినిమాలు బి,సి సెంట‌ర్ల ప్రేక్ష‌కుల‌కు అంత‌గా న‌చ్చ‌డం లేద‌ని, ప్రేక్ష‌కులు ఆద‌రించే క‌థ‌ల‌ని ఎంచుకుని బాలీవుడ్ మేక‌ర్స్ ఇప్ప‌టికైనా జాగ్ర‌త్త ప‌డితే మంచి సినిమాలు వ‌స్తాయ‌ని, ప్రేక్ష‌కులు త‌ప్ప‌కుండా ఆద‌రిస్తార‌న్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.