Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్‌ సినిమా ను పట్టించుకునే నాధుడే కరువు

By:  Tupaki Desk   |   2 Sep 2022 1:30 PM GMT
సూపర్ స్టార్‌ సినిమా ను పట్టించుకునే నాధుడే కరువు
X
బాలీవుడ్ లో గత మూడు నాలుగు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా సక్సెస్ లు దక్కించుకుంటూ అత్యధిక సినిమా లను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంతో పాటు ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తంలో అత్యధిక సంపాదన కలిగిన సినీ సెలబ్రెటీగా నెం.2 గా నిలిచిన హీరో అక్షయ్‌ కుమార్‌. బాలీవుడ్‌ తో పాటు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న హీరో ఈయన.

అక్షయ్ కుమార్‌ కరోనాకు ముందు ఏడాదికి మూడు నాలుగు సినిమాలను మించి థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. అందులో దాదాపు అన్ని సినిమాలు వంద కోట్ల వసూళ్లను క్రాస్ చేసేవి. కొన్ని సినిమాలు మాత్రం రెండు మూడు వందల కోట్ల వసూళ్లను కూడా దక్కించుకునేవి. మొత్తంగా ఆయన వరుస వంద కోట్లతో బాలీవుడ్ సూపర్ స్టార్‌ హోదాను దక్కించుకున్నాడు.

కరోనా మొదలైంది.. ఆయనకి గడ్డు కాలం మొదలు అయ్యింది. కరోనా మొదలైనా కూడా అక్షయ్‌ కుమార్‌ సినిమాల జోరు మాత్రం తగ్గలేదు. బాలీవుడ్ లో ఏ హీరో విడుదల చేయలేనన్ని సినిమాలను కరోనా సమయం మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు విడుదల చేశాడు. ఆయన నటించిన సినిమాల్లో కొన్ని డైరెక్ట్‌ ఓటీటీ ద్వారా కూడా విడుదల అయ్యాయి.

వరుసగా ఫ్లాప్ లు పడుతుండటంతో అక్షయ్‌ కుమార్‌ సినిమా వస్తుంది అంటే జనాలు కనీసం పట్టించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. నేడు ఆయన నటించిన కట్‌ పుట్లీ సినిమా విడుదల అయ్యింది. హిందీ ప్రేక్షకులు కనీసం ఈ సినిమా గురించి చర్చించుకుంటున్నారు అన్నట్లుగా కూడా అనిపించడం లేదు.

ఒకప్పుడు అక్షయ్‌ కుమార్ సినిమా వస్తుంది అంటే బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు మినిమం గా పాతిక కోట్ల వసూళ్లు నమోదు అయ్యేవి. కానీ ఇప్పుడు ఆయన సినిమా ఓటీటీ లో విడుదల అయినా కూడా జనాలు పట్టించుకోవడం లేదు అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఆయన సినిమాల సంఖ్య ను పెంచుకోవడం మానేసి.. కాస్త సక్సెస్ రేటు ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తేనే ఆయన సినిమాలను జనాలు పట్టించుకునే పరిస్థితి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు అయినా అక్షయ్‌ కుమార్‌ తన పూర్వ వైభవంను చాటుకుంటాడా అనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.