Begin typing your search above and press return to search.

సుశాంత్ సింగ్ పై అగ్ర బ్యాన‌ర్ల కుట్ర?!

By:  Tupaki Desk   |   16 Jun 2020 8:30 AM GMT
సుశాంత్ సింగ్ పై అగ్ర బ్యాన‌ర్ల కుట్ర?!
X
ప‌రిశ్ర‌మ అంటేనే కొంద‌రు పెద్ద‌ల చేతిలో ఉండేది. అక్క‌డ ప‌రిశ్ర‌మ లోప‌లి వ్య‌క్తులు.. వెలుప‌లి వ్య‌క్తులు అనే స‌ప‌రేష‌న్ త‌ప్ప‌క‌ ఉంటుంది. ప‌రిశ్ర‌మ లోప‌లి వ్య‌క్తుల న‌ట‌వార‌సుల‌కు ఉండే అవ‌కాశాలు బ‌య‌టి నుంచి వ‌చ్చిన ప్ర‌తిభావంతుల‌కు ఉండ‌వ‌నేది అంద‌రికీ తెలిసిన స‌త్యం. ప‌రిశ్ర‌మ‌లో కొత్త వారు రాణించాలంటే ఎన్నో కుట్ర‌ల్ని.. రాజ‌కీయాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎదిగే వాళ్ల‌పై ఉండే కుళ్లు కుట్ర‌లు అన్నీ ఇన్నీ కావు. మీడియా సైతం ప్ర‌తికూలంగానే ఉంటుంది ఇలాంటి వాళ్ల‌కు. టాలీవుడ్ లో అయితే ఆ న‌లుగురు లేదా ఆ పది మంది మాత్ర‌మే చ‌క్రం తిప్పుతుంటారని.. పెద్ద కుటుంబాల నుంచి స్టార్ల‌కు ఎదురే ఉండ‌ద‌ని చెబుతుంటారు. అయితే ఇక్కడ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన కొంద‌రు స్టార్లు ఉన్నారు.

కానీ బాలీవుడ్ లో అలా కాదు. కొంద‌రికి గిట్ట‌క పోతే ఇక అంతే. అక్క‌డ కుట్ర‌లు మామూలుగా ఉండ‌వ‌ని సుశాంత్ సింగ్ ఆత్మ‌హ‌త్య ఉదంతం చెబుతోంది. సుశాంత్ ఆత్మ‌హ‌త్య వెన‌క చాలా ఒత్తిళ్లు ప‌ని చేశాయ‌ని ప‌లువురు సినీ ప్ర‌ముఖుల వ్యాఖ్య‌ల్ని ట్విట్ట‌ర్ సందేశాల్ని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. య‌శ్ రాజ్ ఫిలింస్ లాంటి భారీ నిర్మాణ సంస్థ సుశాంత్ ని దూరం పెట్టేసింద‌ని.. ప‌లువురు సినీపెద్ద‌లు అత‌డిని అన‌ధికారికంగా బ‌హిష్క‌రించార‌ని వ‌చ్చిన క‌థ‌నాలు చూస్తుంటే సుశాంత్ చిన్న వ‌య‌సులోనే ఎంత‌టి ఒత్తిడి అనుభ‌వించాడో అర్థం చేసుకోవ‌చ్చు.

ప‌రిశ్ర‌మ ఎంతో పెద్ద త‌ప్పు చేసింద‌ని.. అత‌డికి అవ‌కాశాలు ఇవ్వ‌కుండా ప్రారంభంలో ఎన్నో కుట్ర‌లు చేసింద‌ని కంగ‌న ఆరోపించ‌డం సంచ‌ల‌న‌మైంది. నెప్టోయిజం ప‌రిశ్ర‌మ‌లో కుట్ర‌ల్ని కంగ‌న ప‌లుమార్లు బ‌హిర్గ‌తం చేసింది. అలాంటి కార‌ణ‌మే సుశాంత్ ని బ‌లి తీసుకుంది. ప‌రిశ్ర‌మ‌లోని ఓ నాలుగైదు బ‌డా నిర్మాణ సంస్థ‌ల్ని కొంద‌రు ఉద్ధేశ‌పూర్వ‌కంగా ప్రేరేపించి సుశాంత్ సింగ్ కి అవ‌కాశాలు రాకుండా తొక్కేశార‌న్న నిజం కూడా వీరి మాటల్ని బ‌ట్టి బ‌య‌ట‌ప‌డుతోంది. ఇండ‌స్ట్రీలో అంత‌ర్గ‌త రాజ‌కీయాలు సుశాంత్ లాంటి బ‌య‌టి వ్య‌క్తిని లోనికి రానివ్వ‌వు. ఇక్క‌డ కంచె వేసి ఉంటుంది ఎప్పుడూ! అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

సుశాంత్ పై కుట్ర‌లు త‌న‌కు తెలుసున‌ని.. త‌న‌కు చెప్పుకుని ఏడ్చాడ‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌ శేఖ‌ర్ క‌పూర్ చేసిన వ్యాఖ్య‌లు.. ప‌లు అగ్ర నిర్మాణ సంస్థ‌లు అంటూ పేర్లు పెట్టి మ‌రీ వివాదాస్ప‌ద క్రిటిక్ క‌మ‌ల్ ఆర్.ఖాన్ చేసిన వ్యాఖ్య‌లు తాజాగా వేడెక్కిస్తున్నాయి. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు అత‌డిని ఎద‌గ‌కుండా కుట్ర చేశాయి. అత‌డిపై దుష్ప్ర‌చారం చేశాయ‌న్న సంగ‌తి కూడా ప‌లువురు ప్ర‌ముఖుల వ్యాఖ్య‌లు బ‌హిర్గ‌తం చేశాయి.

అయితే త‌న‌పై ఎన్ని కుట్రలు చేసినా వాట‌న్నిటినీ సుశాంత్ ఎదుర్కొని పోరాడాడు. నిల‌బ‌డి గెలిచాడు. 50 శాతం స‌క్సెస్ రేటుతో వ‌రుస స‌క్సెస్ ల‌తో స్టార్ గా త‌న‌ని తాను ఆవిష్క‌రించుకున్నాడు. ప్ర‌స్తుతం అత‌డు కెరీర్ ప‌రంగా ఉన్న‌త స్థితిలోనే ఉన్నాడు. అయితే ప‌రిశ్ర‌మ కుట్ర‌ల‌తో పాటు వ్య‌క్తిగ‌త కార‌ణాలు కూడా ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణం కావొచ్చు అన్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ల‌వ్ ఫెయిల్యూర్స్ అలాగే త‌న త‌ల్లి మ‌ర‌ణించ‌డం వంటి అంశాలు అత‌డిని తీవ్రంగా కుంగుబాటుకు గురి చేశాయ‌న్న వాద‌నా నెటిజ‌నుల్లో క‌నిపిస్తోంది.