Begin typing your search above and press return to search.

న‌వంబ‌ర్ లో రియాతో పెళ్లి.. ఇంత‌లోనే ఘోరం

By:  Tupaki Desk   |   17 Jun 2020 3:45 AM GMT
న‌వంబ‌ర్ లో రియాతో పెళ్లి.. ఇంత‌లోనే ఘోరం
X
యువ‌హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆక‌స్మిక మ‌ర‌ణం దిగ్భ్రాంతికరమైనది. ఎప్ప‌టికీ జీర్ణించుకోలేనిది. బ‌య‌టి వ్య‌క్తులపై కొంద‌రు సినీ పెద్ద‌లు ఎలా క‌క్ష కడ‌తారు? ఎలాంటి కుట్ర‌లు రాజ‌కీయాలు చేస్తారు? అన్న‌ది బ‌హిర్గ‌త‌మైంది. న‌ట‌వార‌సుల రాజ్యంలో కొత్త‌వారికి ఎలాంటి క‌ష్టాలు క‌న్నీళ్లు ఉంటాయ‌న్న‌ది అర్థం చేసుకునేందుకు ఈ మ‌ర‌ణం సాక్షీభూతంగా నిలుస్తోంది. ప‌రిశ్ర‌మ‌లో స‌రైన అండా దండా లేక‌పోయినా .. గాడ్ ఫాద‌ర్ లేక‌పోయినా ఎలా ఉంటుందో వెలుప‌లి వ్య‌క్తుల‌కు ఆర్థ‌మ‌య్యేలా చెప్పింది ఈ దుర్ఘ‌ట‌న‌.

సినీపెద్ద‌ల‌తో పాటు.. టీవీ ప‌రిశ్ర‌మ సైతం వెలుప‌లి వ్య‌క్తుల్ని ప‌ట్టించుకోకుండా ఎలాంటి నాట‌కాలు ఆడుతుందో అర్థ‌మైంది. ఇక అదంతా అటుంచితే.. సుశాంత్ తన ప్రియురాలు రియా చక్రవర్తిని నవంబర్లో వివాహం చేసుకోవడానికి ఏర్పాట్ల‌లో ఉన్నాడ‌న్న‌ది మ‌రింత దుఃఖాన్ని క‌లిగిస్తోంది. ఈ జంట వివాహానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. పెళ్లి త‌ర్వాత ఉండేందుకు బాంద్రాలో కొత్త ఇంటి కోసం వెతికే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. స్థిరాస్తి బ్రోకర్ సన్నీ సింగ్ మాట్లాడుతూ, ``సుశాంత్ - రియా వివాహం చేసుకోబోతున్నారు. అందుకే ముందుగా బాంద్రాలో ఇల్లు వెతుకుతున్నారు. రియా నా పాత క్లయింట్‌`` అని వెల్ల‌డించారు.

సుశాంత్ బంధువులు సైతం ఇప్ప‌టికే అత‌డి వివాహానికి సంబంధించిన ప్ర‌ణాళిక‌ల్ని బ‌హిర్గ‌తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఒక మంచి శుభ ముహూర్తం కోసం ఇరు కుటుంబ స‌భ్యులు వేచి చూస్తున్నార‌ని వెల్ల‌డైంది. కానీ ఇంత‌లోనే ఈ ఘోరం జ‌రిగిపోయింది. సుశాంత్ తిరిగి రాని లోకాల‌కు వెళ్లిపోయాడు. అత‌డి ఆత్మ‌హ‌త్య‌పై ర‌క‌ర‌కాల కోణాల్లో విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఇంకా పోలీసులు ద‌ర్యాప్తును కొన‌సాగిస్తున్నారు.