Begin typing your search above and press return to search.

మాపై మరీ ఇంతలా పడ్డారేంటి భయ్యా

By:  Tupaki Desk   |   30 July 2021 12:30 PM GMT
మాపై మరీ ఇంతలా పడ్డారేంటి భయ్యా
X
కొన్ని సంవత్సరాల క్రితం ఏ భాష ఇండస్ర్టీ వాళ్ల కథలు వాళ్లే చేసుకునేవారు. కానీ ప్రేక్షకులు ఆలోచించే విధానంలో మార్పు రావడంతో ఒక ఇండస్ర్టీలోని కథలు మరో భాష ఇండస్ర్టీకి వెళ్లడం మొదలయ్యాయి. మొదట్లో ఇలా వెళ్లే కథలు చాలా తక్కువగానే ఉండేవి కానీ రాను రాను ఇలా రీమేక్ లు చేసే ప్రాజెక్టుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. స్టార్ హీరోల సినిమాలు అని మాత్రమే కాకుండా కథ బాగా ఉంటే చిన్న హీరోల సినిమాలను కూడా రీమేక్ చేసేందుకు అవతలి భాష కు చెందిన మేకర్స్‌ సిద్దం అవుతున్నారు. ఇప్పటికే తెలుగు నుంచి బాలీవుడ్ కి అనేక సినిమాలు రీమేక్ కోసం వెళ్లాయి. కొన్ని ఇప్పటికే అక్కడ హిట్‌ అవ్వగా మరి కొన్ని సెట్స్ పై ఉన్నాయి మరి కొన్ని చర్చల దశలో ఉన్నాయి.

నాని నటించిన సెన్సేషనల్ నేషనల్‌ అవార్డ్‌ మూవీ జెర్సీ, రవితేజ కమ్ బ్యాక్ హిట్ క్రాక్, అల్లరి నరేష్ డీసెంట్ పర్ఫామెన్స్ నాంది సినిమాలు రీమేక్ ల కోసం బాలీవుడ్ బాట పట్టాయి. హిట్ కావాలనే కాకుండా కథ నచ్చితే తీసుకెళ్లి రీమేక్ చేస్తున్నారు బాలీవుడ్ మేకర్స్. ఇటీవలే నారప్ప మూవీతో హిట్ కొట్టిన విక్టరీ వెంకటేశ్ నటించిన ఎఫ్2 కూడా రీమేక్ కోసం బాలీవుడ్ గడప తొక్కింది. ప్రస్తుతం మరో తెలుగు మూవీ బాలీవుడ్ రీమేక్ అయేందుకు సిద్ధమవుతోంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించి మెప్పించిన తాజా చిత్రం రెడ్. ఈ సినిమా తమిళ మూవీ తడమ్ కు రీమేక్.

తెలుగులోనే రీమేక్ చేసిన సినిమాను తాజాగా బాలీవుడ్ లో కూడా రీమేక్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. తమిళంలో అరుణ్ విజయ్ హీరోగా నటించిన తడమ్ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెలుగులో రెడ్ పేరుతో నిర్మించినపుడు ఆశించిన స్థాయిలో సక్సెస్‌ ను దక్కించుకోలేదు. అయితే ఇండస్ట్రీ వర్గాల దృష్టిని.. విశ్లేషకుల దృష్టిని ఆకర్షించడంలో సఫలం అయ్యింది. బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ్ రాయ్ క‌పూర్ ను పెట్టి ఈ మూవీని రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు. ఇందులో సిద్దార్థ్ కపూర్ సరసన అందాల ముద్దుగుమ్మ, హాట్ బ్యూటీ మృణాల్ క‌పూర్ ఆడి పాడనుంది. ఇక ఈ సినిమాను వ‌ర్ధ‌న్ ఖేత్క‌ర్ అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తుండడం మరో విశేషం.

బాలీవుడ్ లో పేరు మోసిన నిర్మాతలైన భూషణ్ కుమార్, మురాద్ ఖేతాని ఈ రిమేక్ ను నిర్మిస్తారు. ఈ రీమేక్ గురించి తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో నెటిజన్లు వివిధ రీతుల్లో కామెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్‌ లో వరుసగా రీమేక్ లు రూపొందుతున్న నేపథ్యంలో అక్కడ రచయితలపై నెటిజన్స్‌ కాస్త విభిన్నంగా.. వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తూ విమర్శిస్తున్నారు. కొందరు మాత్రం ఫన్నీగా మరీ ఇంతలా మా సినిమాలపై పడ్డారేంటి భయ్యా అంటూ కౌంటర్ వేస్తున్నారు. ఇదిలా ఉండగా తమిళ సినిమా అభిమానులు మాత్రం వేరేలా స్పందిస్తున్నారు.

ఈ రిమేక్ లో సిద్దార్థ్ రాయ్ కపూర్ లాంటి యావరేజ్ హీరో ఫిట్ కాడని తమిళంలో అరుణ్ విజయ్ అదరగొట్టాడని అంటున్నారు. ఏదేమైనా మన సౌత్ నుంచి చాలా సినిమాలు హిందీ ఇండస్ర్టీ బాలీవుడ్ గడప తొక్కడం విశేషం. ఇది సౌత్ సినిమాల విజయంగా భావించవచ్చు. సౌత్‌ నుండి వెళ్లిన జెర్సీ నుండి మొదలుకుని బెల్లంకొండ హీరోగా నటించబోతున్న చత్రపతి సినిమా వరకు అన్ని కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని ఆశిద్దాం. మరిన్ని సౌత్‌ సినిమాలు బాలీవుడ్‌ లో రీమేక్ అయ్యే రోజులు ముందు ముందు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.