Begin typing your search above and press return to search.

ఏడాది ముందే పబ్లిసిటీ స్టార్ట్ అయ్యింది

By:  Tupaki Desk   |   30 July 2015 5:47 PM GMT
ఏడాది ముందే పబ్లిసిటీ స్టార్ట్ అయ్యింది
X
టాలీవుడ్‌ సినిమాల ప్రచార శైలితో పోలిస్తే బాలీవుడ్‌ లో ప్రచారం తీరుతెన్నులు పూర్తి విభిన్నంగా ఉంటాయి. మనకి ఓపెనింగ్‌ తర్వాత మళ్లీ ఆడియోకే కలిసేది. ఆ మధ్యలో ఏవో మొక్కుబడికి కొన్ని ప్రెస్‌ మీట్లు పెట్టి వదిలేస్తారు. ఇక ఆడియో రిలీజ్‌ నుంచి నెలరోజుల పాటు ప్రచారం ఊదరగొట్టేస్తారు. ఫస్ట్‌ లుక్‌, ఆడియో, టీజర్‌, మేకింగ్‌ వీడియో అంటూ ఒకటొకటిగా రిలీజ్‌ చేస్తూ ప్రచారంలో ఊపు తెచ్చే ప్రయత్నం చేస్తారు. దూకుడు, గోవిందుడు నుంచి బాద్‌ షా, శ్రీమంతుడు వరకూ అందరూ చేసింది ఇదే.

అయితే ఈ ట్రెండుకి భిన్నంగా బాలీవుడ్‌ లో సినిమా ఆరంభం నుంచే ప్రచారాన్ని హోరెత్తించడం మొదలు పెట్టేశారు. ఇది లేటెస్టు ట్రెండ్‌. ఒకప్పుడు ఆరు నెలల్లో సినిమా విడుదలవుతుంది అనగా దానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. ఏడాది ఉండగానే ఫస్ట్‌ లుక్‌ అంటూ సినిమాకి క్రేజు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా అజయ్‌ దేవగన్‌ 'శివాయ్‌' సినిమాకి అలాంటి ప్రచారమే చేశారు. షారూక్‌ ఖాన్‌ రాయీస్‌, ఇమ్రాన్‌ హష్మి అజహర్‌ చిత్రాలకు ఇదే తరహా ప్రచారం చేస్తున్నారు. శివాయ్‌ ఎప్పుడో 2017లో రిలీజ్‌ కానుంది. అంటే ఫస్ట్‌ లుక్‌ 20నెలల ముందే రిలీజైంది. జనవరి నుంచి ఈ సినిమా సెట్స్‌ కెళుతుంది. షారూక్‌ రాయిస్‌ వచ్చే ఏడాది ఈద్‌ కానుకగా రిలీజ్‌ కానుంది. కానీ మొన్నటి రంజాన్‌ కి ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేశారు. అజహర్‌ రిలీజ్‌ వచ్చే ఏడాదే. కానీ ఈపాటికే ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ రిలీజ్‌ చేసేశారు.

అయితే ఇలాంటి ప్రచారం వల్ల సినిమాకి హైప్‌ వస్తుంది కానీ జనాల్లో పెరిగిన అంచనాల్ని చేరుకునేలా కథాంశం లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రేడ్‌ పండితులు విశ్లేషిస్తున్నారు. అయితే ఎంత ముందుగా ప్రచారం మొదలు పెట్టినా ఎప్పటికప్పుడు జనాలకు గుర్తు చేయడం చిత్రయూనిట్‌ బాధ్యత అని చెబుతున్నారు. కంటెంట్‌ ఉంటేనే ప్రచారం అస్సెట్‌ అవుతుందని విశ్లేషిస్తున్నారు.