అమ్మడికి 2022 మెమొరబుల్ గా మిగిలిపోతుంది..!
By: Tupaki Desk | 2 Aug 2022 10:35 AM GMTప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తోంది అందాల ఆలియా భట్. దర్శకుడు మహేష్ భట్ కుమార్తెగా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాతో తెరంగ్రేటం చేసిన ఈ బ్యూటీ.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి బాగానే కష్టపడింది.
'హైవే' '2 స్టేట్స్' 'డియర్ జిందగీ' 'రాజీ' 'ఉడ్తా పంజాబ్' 'కలంక్' 'గల్లీ బాయ్' 'హంప్టీ శర్మా కీ దుల్హనియా' 'బద్రీనాథ్ కీ దుల్హనియా' వంటి హిట్ సినిమాలతో అలియా భట్ మంచి పేరు తెచ్చుకుంది. అయితే గతేడాది నెపోటిజం స్టార్ అంటూ ట్రోల్స్ ఎదుర్కొన్న అలియాకు.. 2022 గొప్ప ఏడాదిగా మెమరబుల్ గా మిగిలిపోతుందని చెప్పాలి.
అలియా ఈ ఏడాది ప్రారంభంలో 'గంగూబాయి కతియావాడి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాండమిక్ తర్వాత థియేటర్లలోకి వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
అలానే RRR వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లో అలియా భట్ భాగమైంది. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఆమె సీత పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. అలియా స్వీయ నిర్మాణంలో రూపొందిన తొలి సినిమా 'డార్లింగ్' రిలీజ్ కు రెడీ అయింది. ఇది ఆగస్ట్ 5న నెట్ ఫ్లిక్ ఓటీటీలో విడుదల కాబోతోంది.
ఇకపోతే బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'బ్రహ్మాస్త్ర' సినిమా కూడా ఈ ఏడాదే రిలీజ్ అవుతుంది. తన భర్త రణబీర్ కపూర్ - అమితాబ్ బచ్చన్ - అక్కినేని నాగార్జున వంటి స్టార్స్ తో కలిసి నటించిన బ్రహ్మాస్త్ర పార్ట్-1 సెప్టెంబర్ 9న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది.
అలియా త్వరలోనే హాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. 'హార్ట్ ఆఫ్ స్టోన్' అనే పేరుతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ను బాలీవుడ్ భామ ఇప్పటికే ముగించింది. ప్రముఖ నటి గాల్ గాడోట్ తో ఆమె స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది.
సినీ కెరీర్ పరంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ 2022 అలియా భట్ కు ఎప్పటికీ గుర్తుండి పోతుంది. 30 ఏట అడుగుపెట్టిన అలియా.. తన ప్రియుడు రణవీర్ కపూర్ ను ఏప్రిల్ నెలలో పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అంతేకాదు రెండు నెలలకే తాను తల్లి కాబోతున్నానని ప్రెగ్నెన్సీ విషయాన్ని వెల్లడించింది. ఇలా అలియా కు ఈ ఏడాది గొప్పగా జరిగిందని చెప్పాలి.