Begin typing your search above and press return to search.

ఏం తప్పు చేశారని కండల వీరుడి మీద చీటింగ్ కేసు నమోదైంది?

By:  Tupaki Desk   |   9 July 2021 4:35 AM GMT
ఏం తప్పు చేశారని కండల వీరుడి మీద చీటింగ్ కేసు నమోదైంది?
X
అది మంచి కాని చెడు కాని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. కరోనా పుణ్యమా అని.. పెద్దగా వార్తల్లో కనిపించని ఆయన.. ఆ కొరత తీర్చే ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. తాజాగా అతడి మీదా అతడి సోదరి అల్విరా ఖాన్ హోత్రిపైనా చీటింగ్ కేసు నమోదైంది. అంతేకాదు.. సల్మాన్ కు చెందిన బీయింగ్‌ హ్యూమన్‌ ఫౌండేషన్ కు సంబంధించిన మరో ఏడుగురి పైనా చండీగఢ్ పోలీసులు కేసు బుక్ చేశారు. అంతేకాదు.. జులై 13 లోపు వారిపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలన్న సమన్లను తాజాగా జారీ చేశారు.

ఇంతకూ సల్మాన్.. అతడి సోదరిపై నమోదైన కేసు పూర్వపరాలేమిటి? ఏ కారణంగా వారిపై కేసు నమోదైంది అన్న విషయంలోకి వెళితే.. సల్మాన్.. ఆయన సోదరి బీయింగ్‌ హ్యూమన్‌ ఫౌండేషన్ అనే సంస్థను నడుపుతున్న సంగతి తెలిసిందే. ట్రెండ్ కు తగ్గట్లు.. దుస్తుల్ని తయారు చేసే ఈ సంస్థ.. ఇప్పటికే చాలా ఫేమస్. సల్మాన్ అభిమానులు తమ అభిమానహీరో ఫౌండేషన్ దుస్తుల్ని తరచూ కొనుగోలు చేస్తుంటారు. కాస్త ఖరీదు ఎక్కువైనా.. ఈ బ్రాండ్ కున్న క్రేజ్ తో వాటిని కొనేస్తుంటారు.

తాజాగా నమోదైన కేసు విషయంలోకి వెళితే.. అరుణ్ గుప్తా అనే వ్యాపారి.. బీయింగ్‌ హ్యూమన్‌ ఫౌండేషన్ తనను మోసం చేసిందంటూ పోలీసులకు కంప్లైంట్ చేశారు. తాను రూ.3 కోట్లతో బీయింగ్‌ హ్యూమన్‌ షోరూంను ప్రారంభించానని.. ఢిల్లీ నుంచి తనకు రావాల్సిన వస్త్రాలు రాలేదని పోలీసులకు చెప్పారు. అంతేకాదు.. బీయింగ్‌ హ్యూమన్‌ ఫౌండేషన్ కు సంబంధించిన వెబ్ సైట్ కూడా పని చేయటం లేదని పేర్కొన్నారు. షోరూం తెరవాలని బీయింగ్‌ హ్యూమన్‌ సభ్యులే తనను కోరారని.. వారి మాటల్ని నమ్మి తాను షోరూంను రెఢీ చేశానని.. అందుకు మొత్తం రూ.3కోట్లు ఖర్చు అయినట్లు చెప్పారు.

తాను ఓపెన్ చేస్తున్న షోరూం గురించి సమాచారాన్ని అందుకొని.. సల్మాన్ తనను బిగ్ బాస్ సెట్ లోకి పిలిపించుకొని ఆనందం వ్యక్తం చేశారని.. షోరూం ప్రారంభానికి తాను తప్పనిసరిగా వస్తానని చెప్పినట్లు కంప్లైంట్ లో పేర్కొన్నారు. ఆ తర్వాత ఇచ్చిన హామీ మేరకు సల్మాన్ రాలేదన్నారు. ఈ నేపథ్యంలో సల్మాన్ కు.. ఆయన సోదరి అల్విరా.. సంస్థ సీఈవో ప్రకాశ్ కాపరేతో పాటు మరో ఏడుగురిపైనా కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఉదంతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా ఈ నెల 13 లోపు వివరణ ఇవ్వాలని పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి తాజాగా విచారణకు హాజరు కావాలని సమన్లు పంపటంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా వేడెక్కింది. మరి.. దీనిపై సల్మాన్ అండ్ కో ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.