Begin typing your search above and press return to search.

ఓ గొప్ప సినిమాకు పదేళ్లు నిండాయ్

By:  Tupaki Desk   |   9 Aug 2016 5:16 AM GMT
ఓ గొప్ప సినిమాకు పదేళ్లు నిండాయ్
X
ఆబాల గోపాలాన్ని అలరించే సినిమా అని.. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే సినిమా అని.. చరిత్రలో నిలిచిపోయే సినిమా అని.. దర్శక నిర్మాతలు తరచుగా అనేస్తుంటారు. కానీ ఈ మాటలకు సరిగ్గా సరిపోయే సినమాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి సినిమానే బొమ్మరిల్లు. యువతకు.. కుటుంబ ప్రేక్షకులకు ఒకే స్థాయిలో నచ్చి.. అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఉర్రూతలూగించిన ‘బొమ్మరిల్లు’ కచ్చితంగా తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే ఆణిముత్యమే. టాలీవుడ్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉండొచ్చు.. వసూళ్లలో ఒకదాన్ని మించే సినిమా ఇంకో వస్తుండొచ్చు. కానీ ‘బొమ్మరిల్లు’ లాగా అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ నవ్వించి.. కవ్వించి.. కదిలించే సినిమాలు మాత్రం చాలా అరుదు.

ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన భాస్కర్.. ‘బొమ్మరిల్లు’నే ఇంటిపేరుగా మార్చుకున్నాడు. ఈ సినిమాతో దిల్ రాజు నిర్మాతగా తన స్థాయిని ఎన్నో రెట్లు పెంచుకున్నాడు. హీరో సిద్దార్థ్ సిద్ధుగా.. హీరోయిన్ జెనీలియా హాసినిగా తెలుగు ప్రేక్షకుల గుండెలపై చెరగని ముద్ర వేశారు. ఇందులోని పాత్రలతో జనాలు ఎంతగా కనెక్టయ్యారంటే.. ఎవరైనా తండ్రి అతి ప్రేమ చూపిస్తుంటే ‘‘ఏంటి మీ నాన్న బొమ్మరిల్లు ఫాదర్ లాగా చేస్తున్నాడు’’ అనడం.. ఎవరైనా అమ్మాయి మరీ ఓపెన్ గా మాట్లాడేస్తుంటే ‘‘ఏంటి హాసిని లాగా ప్రవర్తిస్తున్నావ్’’ అనడం.. ఇలా ‘బొమ్మరిల్లు’ ఇంపాక్ట్ అన్నది ఇప్పటికీ కనిపిస్తూ ఉంటుంది. అసలు సిసలు ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ కు అర్థం చెప్పిన ‘బొమ్మరిల్లు’ ఆ తర్వాత ఎన్ని సినిమాలకు స్ఫూర్తినిచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2006 ఆగస్టు 9.. బొమ్మరిల్లు విడుదల తేదీ. ఇవాళ్టికి ఆ సినిమా విడుదలై సరిగ్గా పదేళ్లు. ఈ సందర్భంగా ‘బొమ్మరిల్లు’ లాంటి మంచి సినిమాను అందించిన ఆ టీమ్ మొత్తానికి మరోసారి అభినందనలు చెబుదాం.