Begin typing your search above and press return to search.

బోయపాటిని ఆ గొడవ వదలట్లేదు

By:  Tupaki Desk   |   23 July 2016 5:31 AM GMT
బోయపాటిని ఆ గొడవ వదలట్లేదు
X
గోదావరి పుష్కరాలు పూర్తయి ఏడాది కావస్తోంది. ఆ సందర్భంగా రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాట ఎంత పెద్ద విషాదాన్ని మిగిల్చిందో తెలిసిందే. చంద్రబాబు సర్కారుకు ఆ సంఘటన చాలా చెడ్డ పేరు తెచ్చిపెట్టింది. వేలాదిమంది భక్తుల్ని తొలి రోజు తెల్లవారుజామున ఆపించేసి.. పుష్కర ఘాట్లో పుష్కరాలపై డాక్యుమెంటరీ తీయడం వల్లే ఈ ఘోరం జరిగిందని.. ఇదంతా దర్శకుడు బోయపాటి శ్రీను నిర్దేశకత్వంలో జరిగిందని అప్పట్లో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఐతే బోయపాటి తనకు ఈ వ్యవహారంతో ఏ సంబంధం లేదని అప్పట్లో వివరణ ఇచ్చాడు. ఆ తర్వాత బోయపాటి పేరు చుట్టూ వివాదం సద్దుమణిగినట్లే కనిపించింది.

ఐతే ఏడాది విరామం తర్వాత ఇప్పుడు మరోసారి నాటి విషాదానికి సంబంధించి బోయపాటిపై కేసు నమోదైంది. అమలాపురం కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షవర్ధన్ జీవీ శ్రీరాజ్ పిర్యాదు మేరకు బోయపాటిపై క్రిమినల్ కేసు నమోదైంది. పుష్కరాల సందర్భంగా చంద్రబాబు చేతిలో ఉన్న మైకు తీసుకుని బోయపాటే భక్తుల్ని లోపలికి వదలాలని ఆదేశాలు జారీ చేశాడని.. నాటి విషాదానికి అతనే బాధ్యుడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ముఖ్యమంత్రి పక్కన నిలుచుని ఆదేశాలు జారీ చేయడానికి బోయపాటి ఎవరని.. ఈ విషయంలో సమాచార శాఖ కమిషనర్.. కలెక్టర్.. సబ్-కలెక్టర్.. ఎస్పీల మీదా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. మరి ఈ కేసు విషయంలో బోయపాటి ఎలా స్పందిస్తాడో చూడాలి.