Begin typing your search above and press return to search.

బాలీవుడ్ సెల‌బ్రిటీలు ఇంత దుర్మార్గులా?

By:  Tupaki Desk   |   18 April 2017 12:12 PM GMT
బాలీవుడ్ సెల‌బ్రిటీలు ఇంత దుర్మార్గులా?
X
దేశంలో నానాటికీ పెరిగిపోతున్న రైతు ఆత్మ‌హ‌త్య‌ల‌ను నివారించేందుకు - న‌ష్టాల సాగుతో తీవ్ర నిరాశ‌లో కూరుకుపోయిన అన్న‌దాత‌ల్లో ఆత్మ‌స్థైర్యం నింపేందుకు త‌మ‌కు తాముగానే రంగంలోకి దిగిన బాలీవుడ్ హీరోలు అక్ష‌య్ కుమార్‌. నానా ప‌టేక‌ర్‌ లు నిజంగానే అంద‌రికీ ఆద‌ర్శ‌వంతులే. అయితే ఇంత‌టి ఆద‌ర్శ‌వంతులున్న బాలీవుడ్‌ లో క‌ర‌డుగట్టిన మ‌న‌స్త‌త్వ‌మున్న న‌టుల‌కు కూడా కొద‌వే లేద‌ట‌. ఈ కోవ‌కు చెందిన న‌టులు ఎంత దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రించారో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపింది బుక్‌ మైబాయ్‌. ఆన్‌ లైన్ డొమెస్టిక్‌ మెయిడ్ సర్వీసెస్ త‌ర‌హా సేవంలందంచే ఈ సంస్థ‌ సహవ్యవస్ధాపకుడు అనుపమ్‌ సిన్హాల్‌... ట్విట్ట‌ర్ ద్వారా బాలీవుడ్‌ లో ని దుర్మార్గుల బండారం బ‌య‌ట‌పెట్టేశారు. అయితే స‌ద‌రు దుర్మార్గుల పేర్ల‌ను వెల్ల‌డించేందుకు ఇష్ట‌ప‌డ‌ని సిన్హాల్‌... వారు పాల్ప‌డిన వికృత క్రీడ‌ల‌ను మాత్రం బ‌య‌ట‌పెట్టేశారు.

రెండేళ్ల క్రితం రంగంలోకి దిగిన బుక్‌ మైబాయ్ స‌ర్వీసెస్ ఇప్ప‌టిదాకా 10 వేల ఇళ్ల‌కు చేర‌గా - రెండేళ్ల నుంచి త‌మ నుంచి సేవ‌లు పొందిన వారిలో ఒక్క‌రి నుంచి కూడా ఫిర్యాదు అంద‌లేద‌ని సిన్హాల్ చెబుతున్నారు. అయితే తాము పంపిన ప‌ని మ‌నుషుల ప‌ట్ల బాలీవుడ్ ప్ర‌ముఖులు పాల్ప‌డిన దుర్మార్గ‌పు చ‌ర్య‌ల‌ను మాత్రం ఆయ‌న వెల్ల‌డించ‌డ‌మే కాకుండా... వారి నిజ‌నైజాన్ని బ‌య‌ట‌పెట్టేశారు. బాలీవుడ్ సెల‌బ్రిటీలు పాల్ప‌డిన దుర్మార్గాలు త‌న‌ను చాలా బాధపెట్టాయని చెప్పిన సిన్హాల్‌... ఇక నుంచి బాలీవుడ్‌ సెలబ్రిటీల ఇళ్లకు ఎలాంటి సర్వీసులు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. మొత్తం ఐదుగురు బాలీవుడ్ ప్ర‌ముఖుల నుంచి త‌మ సిబ్బందికి ఎదురైన చేదు అనుభవాల‌ను ఆయ‌న వివ‌రించారు. ఆ వివ‌రాల్లోకెళితే...

సెలబ్రిటీ 1: బాలీవుడ్‌ లో ప్ర‌ముఖ న‌టిగా వెలిగిపోతున్న ఈ నటి... ఇంట్లో పనిచేసే వ్యక్తి తల్లి చనిపోతే కర్మకాండలకు వెళ్లనివ్వలేదట‌. ఆఖరి చూపులకు వెళ్లాలంటే తన స్ధానంలో వేరే వారిని ఉంచి వెళ్లాలని ఆమె ఆర్డరేశారు. ఆమె ప్రవర్తించిన తీరు అమానుషమని.. ఇంతకంటే ఆమె గురించి తానేం మాట్లాడలేనని సిన్హాల్‌ అన్నారు.

సెలబ్రిటీ 2: రూ.3 కోట్ల కారు కలిగిన ఈ బాలీవుడ్ న‌టుడు.. తన వద్ద పనిచేసే వ్యక్తికి భోజనం పెట్టలేనని చెప్పాడ‌ట‌. ఎంతో ఉదార‌త క‌లిగిన వ్య‌క్తిగా బ‌య‌టి ప్ర‌పంచానికి చెప్పుకునే ఈ న‌టుడు... టీ తాగి - రోజుకు మూడు సార్లు బ్రెడ్‌ తినాలని మెయిడ్‌ తో చెప్పినట్లు సిన్హాల్‌ వివరించారు.

సెలబ్రిటీ 3: బాలీవుడ్‌ కే చెందిన మ‌రో సెలబ్రిటీ మెయిడ్‌ ను శారీరకంగా హింసించడం తనను ఆందోళనకు గురి చేసిందని సిన్హాల్‌ చెప్పారు. సదరు సెలబ్రిటీపై కంపెనీ ఫిర్యాదు చేయడానికి ప్రయత్నం చేసినట్లు తెలిపారు. అయితే, కేసు నమోదయిన దగ్గర నుంచి స్టేషన్‌ కు వెళ్లాల్సివస్తుందని.. తాను అలా వెళ్తే ఉపాధి కోల్పోతానని ఆవేద‌న వ్య‌క్తం చేసిన మెయిడ్‌ అందుకు నిరాకరించిందని చెప్పారు. మెయిడ్‌ స్టేషన్‌ కు హాజరుకాకుండా ఫిర్యాదును తీసుకోలేమని పోలీసులకు చెప్పడంతో ఆ ఆలోచనను విరమించుకున్నట్లు వివరించారు.

సెలబ్రిటీ 4: ప‌నిమ‌నుషుల‌ను వేధింపుల‌కు గురి చేయ‌డంలో ఈ సెలబ్రిటీ దిట్ట‌గా పేరుంద‌ట‌. త‌న ఇంటిలో ప‌నికి కుదిరిన మెయిడ్ ను శారీర‌కంగానే కాకుండా మానసికంగానూ వేధింపుల‌కు గురి చేశార‌ట‌. దీంతో స‌ద‌రు మెయిడ్ చెప్పా పెట్ట‌కుండా వెళ్లిపోయింద‌ట‌. దీంతో అగ్గిమీద గుగ్గిల‌మైన స‌ద‌రు సెల‌బ్రిటీ... మెయిడ్‌ వెళ్లిపోయినందుకు కంపెనీపై కేసు వేస్తానని బెదిరించారట‌

సెలబ్రిటీ 5: బుక్‌ మై బాయ్‌ కు ఇవ్వాల్సిన రూ.15 వేల సర్వీస్‌ చార్జీని ఈ సెలబ్రిటీ ఇవ్వలేదని ఆరోపించారు. పేమెంట్‌ కోసం కంపెనీ ప్రతినిధులు కాల్ చేయడంతో స‌ద‌రు నటీమ‌ణి కాల్స్‌ లిఫ్ట్‌ చేయడం మానేశారని చెప్పారు. కొద్దిరోజుల తర్వాత తాను డబ్బులు కట్టనని ఏం చేసుకుంటారో చేసుకోమని అన్నారని తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/