Begin typing your search above and press return to search.

సహజమైన నటనకు సరిహద్దు .. చంద్రమోహన్

By:  Tupaki Desk   |   23 May 2021 2:59 AM GMT
సహజమైన నటనకు సరిహద్దు .. చంద్రమోహన్
X
ఒకప్పుడు హీరోగా ట్రై చేయాలంటే మంచి హైటూ .. అందుకు తగిన ఆకర్షణీయమైన రూపం ఉండాలి. అలా లేకుండా ఫొటో పట్టుకుని సినిమా ఆఫీసులకు వెళ్లడమనేది పెద్ద సాహసమే అయ్యేది. ఇక ఒక అవకాశం ఇవ్వమని అడగడానికి చాలా ధైర్యం కావలసి వచ్చేది. పైగా అప్పట్లో సిఫార్సుల వలన చిన్న పాత్రలు వచ్చేవే గానీ, హీరో పాత్రలు అంటే మాత్రం ఒక రేంజ్ లో విషయం ఉండవలసిందే. అలాంటి పరిస్థితుల్లో హీరో వేషాలు అందుకుని, నటన పరంగా తన సత్తా చాటుకున్న అతికొద్ది మందిలో ఒకరుగా చంద్రమోహన్ కనిపిస్తారు.

చంద్రమోహన్ ఎంట్రీ కూడా ఏదో సాదాసీదాగా జరిగిపోలేదు .. ఆయన మొదటి సినిమా 'రంగుల రాట్నం'. ఆ సినిమాకి దర్శకుడు బీఎన్ రెడ్డి. ఆయన కెరియర్ మొత్తం చూపించుకోవడానికి ఈ సర్టిఫికెట్ ఒక్కటి సరిపోతుంది. ఆ తరువాత తెరకెక్కిన 'బంగారు పిచిక' సినిమాకి దర్శకుడు 'బాపు'. విషయం లేకపోతే ఈ ఇద్దరు దర్శకులు కూడా చిన్న వేషాలు కూడా ఇవ్వరు. వాళ్ల దృష్టిలో పడి మెప్పించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అలాంటి వాళ్లతో 'శభాష్' అనిపించుకుని ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించారు.

ఒక వైపున ఎన్టీఆర్ .. ఏఎన్నార్. మరో వైపున కృష్ణ .. శోభన్ బాబు .. కృష్ణంరాజు. సరే వాళ్ల పర్సనాలిటీ వేరు .. వాళ్లకి వచ్చే కథలు వేరు అనుకుంటే, మరో వైపున చలం .. మురళీమోహన్ .. శరత్ బాబు గట్టిపోటీగా నిలిచారు. ఇంతమందిని దాటుకుని అవకాశాలు రావాలి .. ఆ సినిమాలు బయటికి రావాలి .. తనకి పేరు రావాలి. ఇది నిజంగా చాలా క్లిష్టమైన పరిస్థితి. దానిని తన సహజమైన నటనతోనే చంద్రమోహన్ అధిగమించారు. ఒక సగటు మనిషి పాత్రలను ఎక్కువగా ఎంచుకుంటూ .. ఆ పాత్రల్లో జీవిస్తూ .. ప్రేక్షకులకు చేరువయ్యారు.

చంద్రమోహన్ తో కలిసి కొత్తగా ఏ హీరోయిన్ నటించినా, ఆ తరువాత ఆమె స్టార్ హీరోయిన్ అయిపోతుందని అప్పట్లో చెప్పుకునేవారు. నిజంగానే చాలా మంది హీరోయిన్ల విషయంలో అలా జరిగింది కూడా. ఇక చంద్రమోహన్ స్థానం మరింత బలపడటంలో 'కె.విశ్వనాథ్' పాత్ర కూడా ఉందని చెప్పాలి. చంద్రమోహన్ తో ఆయన తీసిన అన్ని సినిమాలు సూపర్ హిట్. ఇక ఆ తరువాత చంద్రమోహన్ కెరియర్ ను పరిగెత్తించిన దర్శకుడిగా 'జంధ్యాల' కనిపిస్తారు. హీరోగా ఎన్నో విభిన్నమైన .. విలక్షమైన పాత్రలను, విజయాలను అందుకున్న చంద్రమోహన్ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు అందజేద్దాం!