Begin typing your search above and press return to search.

బరిలో దిగుతున్న క్రేజీ చిత్రాలు.. మరి బాక్సాఫీస్ వద్ద గెలిచేదెవరు..?

By:  Tupaki Desk   |   16 July 2022 8:41 AM GMT
బరిలో దిగుతున్న క్రేజీ చిత్రాలు.. మరి బాక్సాఫీస్ వద్ద గెలిచేదెవరు..?
X
కరోనా పాండమిక్ కారణంగా వాయిదా పడిన పెద్ద సినిమాలన్నీ ఆ మధ్య ఒక్కసారిగా విడుదల తేదీలు ప్రకటించడంతో.. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ క్లాష్ ఏర్పడే పరిస్థితి వచ్చింది. అయితే మేకర్స్ అంతా కలిసి మాట్లాడుకుని పోటీ లేకుండా చూసుకున్నారు. సినిమా సినిమాకు మధ్య కనీసం ఒకటీ రెండు వారాల గ్యాప్ ఉండేలా చూసుకున్నారు. అయినప్పటికీ ఒకటీ అర చిత్రాలు పోటీ పడాల్సి వచ్చింది.

ఏదైతేనేం సమ్మర్ సీజన్ లో పెద్ద సినిమాల సందడి అంతా ముగిసింది. కొన్ని చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిస్తే.. మరికొన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇక జూన్ రెండో వారం మొదలు కొని ఇప్పుడు జూలై సెకండ్ వీక్ వరకూ అనేక చిన్న మీడియం రేంజ్ చిత్రాలు థియేటర్లలోకి వచ్చాయి. అయితే ఏ ఒక్క సినిమా కూడా కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయింది.

ఈ నెలలో 'థాంక్యూ' 'రామారావు ఆన్ డ్యూటీ' వంటి క్రేజీ చిత్రాలు విడుదల కావాల్సి ఉంది. మరి ఈ రెండు సినిమాలు ఎలాంటి ప్రేక్షకాదరణ దక్కించుకుంటాయో చూడాలి. అలానే ఆగస్ట్ నెలలో పలు పెద్ద మీడియం రేంజ్ సినిమాలు బాక్సాఫీస్ బరిలో నిలవనున్నాయి. ఫస్ట్ వీక్ లోనే మూడు సినిమాలు పోటీ పడబోతున్నాయి.

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ''బింబిసార‌'' చిత్రాన్ని ఆగ‌స్టు 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మల్లిడి వశిష్ఠ్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది సోషియో ఫాంటసీ టైం ట్రావెల్ యాక్షన్ మూవీ. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమా. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. చాలా కాలంగా హిట్ కోసం వేచి చూస్తున్న నందమూరి హీరోకి ఈ విజయం కీలకమనే చెప్పాలి.

ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మించిన ''సీతా రామం'' సినిమా కూడా ఆగస్ట్ 5వ తేదీనే షెడ్యూల్ చేయబడింది. హ‌ను రాఘ‌వ‌పూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ - గార్జియస్ మృణాళ్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించారు. మేకర్స్ ప్రమోషనల్ కంటెంట్ తో ఇప్పటికే ఆసక్తిని కలిగించారు. గత కొంతకాలంగా ప్లాప్స్ లో హను రాఘవపూడికి ఈ
సినిమాతో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.


చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ సిద్దార్థ - అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ''కార్తికేయ 2''. బ్లాక్ బస్టర్ 'కార్తికేయ' చిత్రానికి ఇది సీక్వెల్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై రూపొందింది. నిఖిల్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ ఖర్చు పెట్టిన సినిమా ఇది. జూలై 22న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని 'థాంక్యూ' కోసం పోస్ట్ పోన్ చేసుకున్నారని టాక్. అయితే ఇప్పుడు ఆగస్ట్ 5న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల ట్రైలర్ తో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇలా ఆగస్ట్ మొదటి వారంలోనే మూడు క్రేజీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులోనూ ఈ చిత్రాల్లో వర్క్ చేసిన వారికి స‌క్సెస్ అనేది చాలా అవ‌స‌రం. ఈ నేపథ్యంలో ఒకే రోజు మూడు సినిమాలు రావడం దేనికీ మంచిది కాదనే చెప్పాలి. ఈ డేట్ మిస్ అయితే తర్వాత మరో మంచి తేదీ దొరకడం కష్టమవుతుందనేమో.. ప్రస్తుతానికి ఎవరూ వెనక్కి తగ్గాలని చూడటం లేదు.

ఇకపోతే ఇండిపెండెన్స్ డే వీక్ లో ఆగస్టు 12న నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' సినిమా రిలీజ్ కానుంది. ఎడిటర్ ఎస్ ఆర్ శేఖర్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్న ఈ సినిమాని నితిన్ హోమ్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న నితిన్ ఈసారి గట్టిగా కొట్టడానికి రెడీ అవుతున్నాడు.

అలానే ఆగస్ట్ 11న బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చద్దా' సినిమా విడుదల కాబోతోంది. అక్కినేని నాగచైతన్య ఇందులో కీలక పాత్ర పోషించడంతో.. తెలుగు ప్రేక్షకుల్లోనూ ఈ మూవీపై ఆసక్తి నెలకొంది. దీనికి తోడు మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రాన్ని తెలుగులో సమర్పిస్తుండటంతో క్రేజ్ ఏర్పడింది.

ఆగస్ట్ 2న విజయ్ దేవరకొండ మరియు పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'లైగర్' సినిమా రిలీజ్ కానుంది. పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో థియేటర్లలోకి రాబోతోంది. 'వరల్డ్ ఫేమస్ లవర్' వంటి భారీ పరాజయం తర్వాత వీడీ నటిస్తున్న ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. మరి వచ్చే నెలలో రాబోతున్న ఈ సినిమాలలో ఏవేవి సక్సెస్ అందుకుంటాయో చూడాలి.