Begin typing your search above and press return to search.

దీపావళి బాక్సాఫీస్ వద్ద త్రిముఖ పోటీ..!

By:  Tupaki Desk   |   3 Nov 2021 6:16 PM GMT
దీపావళి బాక్సాఫీస్ వద్ద త్రిముఖ పోటీ..!
X
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కుదేలైన టాలీవుడ్ బాక్సాఫీస్ మళ్ళీ పుంజుకుంటోంది. ఎప్పటిలాగే వారానికో అర డజను సినిమాలతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. 'లవ్ స్టోరీ' తో మొదలుకుని గత శుక్రవారం వరకు విడుదలైన క్రేజీ సినిమాలన్నీ వసూళ్ల పరంగా పర్వలేదనిపించాయి. ఇప్పుడు దీపావళి సందర్భంగా మూడు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. అందులో రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు ఉంటే ఒక స్ట్రెయిట్ తెలుగు మూవీ ఉంది. 'మంచి రోజులు వచ్చాయి' 'పెద్దన్న' 'ఎనిమీ' సినిమాలు రేపు థియేటర్ లోకి వస్తున్నాయి.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ - మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'మంచి రోజులొచ్చాయి'. వాస్తవ సంఘటన ఆధారంగా మారుతి తరహా ఎంటర్టైన్మెంట్ తో ఈ సినిమా సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ - ట్రైలర్ సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - అల్లు అర్జున్ వంటి హీరోల సపోర్ట్ కూడా దీనికి అదనపు అడ్వాంటేజ్. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేస్తున్న పెయిడ్ ప్రీమియర్ షోలు హౌస్ ఫుల్ అవడం శుభసూచకంగా కనిపిస్తోంది. యువీ కాన్సెప్ట్స్ మరియు మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ మీద వి సెల్యులాయిడ్ - SKN సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా సిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ''అన్నాత్తే''. ఇందులో రజినీ సోదరిగా కీర్తి సురేష్ నటించగా.. నయనతార - మీనా - ఖుష్బూ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. తెలుగులో ఏషియన్ సినిమాస్ నారాయణదాస్ కె. నారంగ్ మరియు సురేష్ బాబు కలిసి ''పెద్దన్న'' పేరుతో రిలీజ్ చేస్తున్నారు. డి.ఇమ్మాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.


కోలీవుడ్ స్టార్ హీరోలు విశాల్ - ఆర్య కలిసి నటించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ''ఎనిమీ''. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ‘గద్దల కొండ గణేష్’ ఫేమ్ మృణాళిని రవి - మమతా మోహన్ దాస్ కీలక పాత్రలు పోషించారు. మినీ స్టూడియోస్‌ పతాకంపై వినోద్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'వాడు - వీడు' వచ్చిన పదేళ్ల తర్వాత విశాల్ - ఆర్య స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సినిమా ఇది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ విశేషంగా అలరించింది. ఎస్.ఎస్‌ థమన్ ఈ చిత్రానికి సాంగ్స్ కంపోజ్ చేయగా.. శ్యామ్ సీఎస్ బ్యాగ్రౌండ్ స్కోర్ సమకూర్చారు.

ఇలా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద త్రిముఖ పోటీ ఏర్పడింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ లో భారీ ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉంది. మరి వీటిలో ఏది ప్రేక్షకాదరణ దక్కించుకుని దీపావళి విన్నర్ గా నిలుస్తుందో చూడాలి.