Begin typing your search above and press return to search.

సూర్యను బోయపాటి అంతగా పొగిడేసింది అందుకేనా?

By:  Tupaki Desk   |   6 March 2022 9:30 AM GMT
సూర్యను బోయపాటి అంతగా పొగిడేసింది అందుకేనా?
X
తమిళంలో వరుస సినిమాలు చేసే కథానాయకులలో సూర్య ఒకరు. ఆయనకి అక్కడున్న మాస్ ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. ఆయనకంటూ కొంతమంది నిర్మాతలు ఉన్నారు. వాళ్లంతా ఎప్పటికప్పుడు ఆయనతో సినిమాలు చేయడానికి రెడీగానే ఉంటారు.

ఒకవేళ బయట ప్రాజెక్టుల విషయంలో గ్యాప్ వస్తుందని భావిస్తే, తన బ్యానర్లో సినిమా చేయడానికి సూర్య ఎంతమాత్రం ఆలోచన చేయడు. సూర్య దగ్గర మన బాలయ్య మాదిరిగానే ఒక గొప్పతనం ఉంది. తన సినిమాలు హిట్ అయినా .. ఫట్ అయినా వాటిని గురించిన ఆలోచన చేస్తూ కూర్చోడు.

సూర్య ఎప్పుడూ కూడా తన సినిమా ఒకటి రిలీజ్ అయిన మరుసటి రోజు నుంచే మరో ప్రాజెక్టుపై పూర్తి దృష్టి పెడుతుంటాడు. సూర్య సినిమాలు చాలా రొటీన్ గా ఉంటాయి అని చెప్పలేం. ఎందుకంటే ప్రయోగాలు చేసే సమయం వస్తే చేయడానికి ఎంతమాత్రం వెనుకాడడు. 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' .. '24' .. 'సెవెంత్ సెన్స్' వంటి సినిమాలు ఆ జాబితాలో కనిపిస్తాయి.

ఇక ఆయన తన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోను విడుదలయ్యేలా చూసుకుంటూ ఉంటాడు. అందువలన ఆయనను ఒక తమిళ హీరోగా ఇక్కడి ప్రేక్షకులు చూడరు.

టాలీవుడ్ తో ఎప్పుడూ టచ్ లో ఉండే కోలీవుడ్ హీరోల్లో సూర్య పేరు ముందుటుంది. ఆయన తాజా చిత్రమైన 'ఈటి' తెలుగులో కూడా ఈ నెల 10వ తేదీన విడుదలవుతోంది. రీసెంట్ గా తెలుగు వెర్షన్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.

ఈ వేడుకకి బోయపాటి కూడా వచ్చాడు. తెలుగు ప్రేక్షకులు మదర్ లాంగ్వేజ్ .. అదర్ లాంగ్వేజ్ అని చూడరనీ, సినిమా బాగుంటే హిట్ ఇచ్చేస్తారని స్టేజ్ పై చెప్పాడు. రజనీ తరువాత తెలుగు ప్రేక్షకులు 'మనవాడు' అని చెప్పుకున్నది సూర్యనే అని అన్నాడు. సూర్య మంచి మనసును గురించి చెప్పుకొచ్చాడు.

బోయపాటి మాటలు విన్నవారు సూర్యతో ఆయన సినిమా చేయనున్నాడా ఏంటి? అనుకున్నారు. ఇప్పుడు ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఒక టాక్ బలంగానే వినిపిస్తోంది. సూర్య కూడా చాలా కాలంగా ఒక స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలనుకుంటున్నాడు. సరైన స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నాడు.

అలాంటి స్క్రిప్ట్ ఏదో బోయపాటి దగ్గర ఉన్నట్టుగానే ఉంది. పైగా బోయపాటి కథలు సూర్యకి కూడా బాగా సెట్ అవుతాయి. ఎందుకంటే బోయపాటి సినిమాల్లో హీరోకి అవసరమైన ఆవేశం .. అందుకు తగిన మాస్ ఇమేజ్ సూర్యకి పుష్కలంగా ఉన్నాయి. మొత్తానికి ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక ప్రాజెక్టు పట్టాలెక్కడమైతే ఖాయమని వినిపిస్తోంది. అది ఎనౌన్స్ మెంట్ గా వచ్చేరోజు కోసం వెయిట్ చేయాలంతే!