Begin typing your search above and press return to search.

'విక్రమ్ ల్యాండర్‌' ను చూశారా? బ‌్రాడ్ పిట్ ప్ర‌శ్న‌

By:  Tupaki Desk   |   18 Sep 2019 6:36 AM GMT
విక్రమ్ ల్యాండర్‌ ను చూశారా? బ‌్రాడ్ పిట్ ప్ర‌శ్న‌
X
చంద్రయాన్-2 ప్ర‌యోగం చివ‌రి నిమిషంలో ఫెయిల‌వ్వ‌డం నిరాశ‌ప‌రిచిన సంగ‌తి తెలిసిందే. విక్ర‌మ్ ల్యాండ‌ర్ తో ఇస్రోకి సంబంధాలు తెగిపోవ‌డంతో ఈ మిష‌న్ అస‌లేమైందో తెలీని ప‌రిస్థితి. ప్ర‌స్తుతం దీనిపై నాసాతో క‌లిసి ఇస్రో త‌న‌వంతు ప్ర‌య‌త్నాల్లో ఉంది. ఇది ఐదు శాతం ఫెయిల్యూర్ మాత్ర‌మే అయినా అది కూడా విఫ‌ల‌మ‌య్యాం అన్న‌ది త‌ట్టుకోలేని ప‌రిస్థితి. ఇంత‌కీ విక్ర‌మ్ ల్యాండర్ ఎక్క‌డ ఉంది? చంద్రుని ఢీకొని విధ్వంశ‌మైందా లేక అది ఇంకా ఆప‌రేష‌న్ కొన‌సాగించే స్థితిలోనే ఉందా? అన్న చ‌ర్చ వేడెక్కిస్తోంది. దీనిపై కేవ‌లం భార‌త‌ దేశంలోనే కాదు.. ప్రపంచ దేశాల్లో పెద్ద స్థాయిలో చర్చ జరుగుతూనే ఉంది. చందమామపై విక్రమ్ ల్యాండర్ దిగిందా లేదా?

ఇదే ప్ర‌శ్న‌ను హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్ పిట్ ఆరా తీయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. `విక్రమ్ ల్యాండర్‌`ను చూశారా? అంటూ ఆయ‌న‌ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో ఉన్న అమెరికా వ్యోమగామికి ఫోన్ చేశారు. ఇందుకోసం వాషింగ్టన్ లోని నాసా ప్రధాన కార్యాలయానికి బ్రాడ్‌పిట్‌ వెళ్లారు. అక్కడి నుంచి నాసా అంత‌రిక్ష‌ కేంద్రానికి వీడియో కాల్ చేసి వ్యోమగామి నిక్‌ హేగ్ తో దాదాపు 20 నిమిషాలకు పైగా మాట్లాడారు. అంతరిక్షంలోని పరిస్థితుల గురించి బ్రాడ్‌ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.

అస‌లు అంత‌రిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఎలా ఉంటుంది? అక్కడ మీ జీవ‌నం ఎలా ఉంటుంది? అంటూ ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు వేశారు. వాటికి ఆ నిక్ స‌మాధానాలిచ్చారు. చివ‌రిగా భారత్‌ ప్రయోగించిన చంద్రయాన్‌ -2 గురించి బ్రాడ్‌ పిట్ ప్ర‌శ్నించారు. జాబిల్లిపై ల్యాండర్‌ విక్రమ్‌ను గుర్తించారా? అని అడగ్గా.. ``దురదృష్టవశాత్తు ఇంకా లేదు`` అని నిక్‌ హేగ్‌ సమాధానం చెప్ప‌డం నిరాశ‌ప‌రిచింది. బ‌హుశా ఇంకా సెర్చ్ కొన‌సాగుతోంది. నాసా సాయంతో దీనిని క‌నుగోవాల‌న్న‌ది తాప‌త్ర‌యం. అస‌లు విక్ర‌మ్ ల్యాండ‌ర్ ఎక్క‌డ ఉంది? అన్న‌దానికి సంబంధించిన త‌దుప‌రి ఫోటోల్ని సేక‌రించేందుకు ఇస్రో చాలానే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. విక్ర‌మ్ ల్యాండ‌ర్ చంద్రుని ద‌క్షిణ ధృవంపై ల్యాండ‌వ్వాల్సి ఉండ‌గా 2కి.మీల దూరంలో క‌మ్యూనికేష‌న్ కోల్పోయిన సంగ‌తి తెలిసిందే.