Begin typing your search above and press return to search.

కాదేదీ సినిమాకు అన‌ర్హం

By:  Tupaki Desk   |   27 April 2018 5:30 PM GMT
కాదేదీ సినిమాకు అన‌ర్హం
X
సినిమా క‌థ‌లు ఎక్క‌డ్నించి పుడ‌తాయి? ఎక్క‌డ్నించో కాదు మ‌న చుట్టూ జ‌రుగుతున్న జీవితాల నుంచే. కొన్ని సినిమా క‌థ‌లు ఒక చిన్న సంఘ‌ట‌న ఆధారంగా అల్లుకున్న‌వి అయితే... మ‌రికొన్ని ప్ర‌పంచంలో జ‌రిగిన పెద్ద పెద్ద ఘ‌ట‌న‌లే సినిమాల రూపంలోకి మార‌తాయి. ఇక కాస్త మాస్ మ‌సాలా ఉన్న క‌థ‌లైతే... ఎవ‌రైనా ఎందుకు వ‌దులుతారు. ఇప్పుడ‌దే జ‌రిగింది. హీరోయిన్లు లైంగికంగా వేధించిన హాలీవుడ్ ద‌ర్శ‌కుడు హార్వే వీన‌స్ట‌న్‌ పై సినిమా రాబోతోంది.

హార్వే వీన్‌ స్ట‌న్ బ‌యోపిక్ అనుకుంటే పొర‌పాటే. మీటూ క్యాంపెయిన్ ఉద్య‌మంలా ప్ర‌పంచాన్ని ముంచెత్త‌డానికి కార‌ణం హార్వేనే. క‌నిపించిన హీరోయిన్‌ ను వ‌దిలిపెట్ట‌కుండా లైంగికంగా వేధించాడు. చాలా ఏళ్లు అత‌ని అరాచ‌కం సాగింది. కొంద‌రు న‌టీమ‌ణుల తెగింపు అలాగే న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట‌ర్ల ప‌రిశోధ‌న‌తో హార్వే బండారం బ‌ట్ట‌బ‌య‌లైంది. ఒక‌రి త‌రువాత ఒక‌రు బాధితులు బ‌య‌టికి వ‌చ్చారు. మీటూ క్యాంపెయిన్ మొద‌లుపెట్టారు. లైంగిక వేధింపుల‌కు బ‌లైన వారంతా #MeToo ఉద్య‌మానికి సోష‌ల్ మీడియా వేదికగా మ‌ద్ద‌తు తెలిపారు. ఇక హార్వే రాస‌లీల‌ల గురించి న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట‌ర్లు పెద్ద ప‌రిశోధ‌న‌లే చేసి అనేక విష‌యాలు బ‌య‌ట‌పెట్టారు. ఈ వ్య‌వ‌హారమంతా ఇప్పుడు సినిమాగా తీయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు బ్రాడ్ పిట్‌.

హార్వే చేతిలో న‌టీమ‌ణుల జీవితాలు ఏమ‌య్యాయ్‌? అత‌ని గుట్టును న్యూయార్క్ టైమ్స్ ఎలా బ‌య‌ట‌పెట్టింది? అనేదే సినిమా క‌థ‌. న్యూయార్క్ టైమ్స్ నుంచి వారి ప‌రిశోధనను సినిమాగా తీసేందుకు ఇప్ప‌టికే రెండు ప్రొడ‌క్ష‌న్ సంస్థ‌లు హ‌క్కుల‌ను కొనుక్కున్నాయి. అందులో ఒక‌టి బ్రాడ్‌ పిట్ స్థాపించిన ప్లాన్ బి ప్రొడ‌క్ష‌న్ సంస్థ కాగా రెండోది మేగ‌న్ ఎల్లిస‌న్ స్థాపించిన అన్న‌పూర్ణ పిక్చ‌ర్స్‌. అన్న‌పూర్ణ పిక్చ‌ర్స్ అన‌గానే నాగార్జున‌దేమో అనుకోవ‌ద్దు. దానికి దీనికీ ఎలాంటి సంబంధం లేదు.