Begin typing your search above and press return to search.

బ్రహ్మి.. గుడ్డిలో మెల్ల

By:  Tupaki Desk   |   25 Sep 2015 9:30 AM GMT
బ్రహ్మి.. గుడ్డిలో మెల్ల
X
ఒకప్పుడు కేవలం బ్రహ్మానందం క్యారెక్టర్ మీదే సినిమాలు ఆడేసిన సందర్భాలున్నాయి. కానీ ఆ బ్రహ్మినే ఇప్పుడు చాలామంది దర్శకులకు చేదైపోయాడు. అతణ్ని ఫుల్లుగా వాడేసుకున్న డైరెక్టర్లు ఇప్పుడు పక్కనబెట్టేశారు. బ్రహ్మి పనైపోయిందంటూ ఉత్తుత్తిగా మొదలైన ప్రచారమే.. నిజమైపోయి.. ఏమోడాదిగా బ్రహ్మి బండి నడవడం కష్టంగా మారిపోయింది. శ్రీను వైట్ల, త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ల సినిమాల్లోనూ బ్రహ్మి క్యారెక్టర్లు పేలని పరిస్థితి వచ్చింది. ఇందులో బ్రహ్మి వైఫల్యం ఏమీ లేదు. సరైన క్యారెక్టర్ లు పడితే బ్రహ్మి ఎలా చెలరేగిపోతాడో చాలాసార్లు చూశాం. క్యారెక్టర్ బాలేకుంటే ఆయన మాత్రం ఏం చేయగలరు. ఈ సంగతి అర్థం చేసుకోకుండా బ్రహ్మానందాన్ని ఆడిపోసుకునేవాళ్లూ లేకపోలేదు.

తన గురించి జరుగుతున్న వ్యతిరేక ప్రచారానికి అడ్డుకట్ట పడాలంటే మంచి క్యారెక్టర్‌ తో తనేంటో రుజువు చేసుకోవడమే మార్గమని చూస్తున్నాడు బ్రహ్మి. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’లో చేసిన చింతకాయ క్యారెక్టర్.. కొంత వరకు బ్రహ్మికి సాయపడింది. ఈ క్యారెక్టర్ మరీ పేలిపోకున్నా ఓ మోస్తరుగా నవ్వులు పండించింది. ప్రథమార్ధంలో మామూలుగా అనిపించిన క్యారెక్టర్.. ద్వితీయార్ధంలో జోరందుకుంది. ఇంగ్లిషోడు ‘యాపిల్ కాయ్’ అని పేరు పెట్టుకుంటే.. నేను ‘ఆవకాయ్’ అని సాఫ్ట్ వేర్ కంపెనీ పెట్టకూడదా అంటూ బ్రహ్మి చెప్పే డైలాగ్ సెకండాఫ్ లో భలేగా పేలింది. దాంతో పాటు సన్నాఫ్ సత్యమూర్తిలో త్రివిక్రమ్ డైలాగ్ కు పేరడీగా రాసిన ‘‘నా దృష్టిలో బాటిలంటే మోయాలనిపించే బరువు.. మందంటే తాగాలనిపించే బాధ్యత’’ అంటూ బ్రహ్మి చెప్పే డైలాగ్ కి కూడా థియేటర్ లలో మంచి రెస్పాన్సే వస్తోంది. చాన్నాళ్ల తర్వాత బ్రహ్మి ఓ మోస్తరుగా నవ్వించిన సినిమా ఇదే. ఇలాంటి క్యారెక్టర్ లు ఇంకో రెండు మూడు పడ్డాయంటే బ్రహ్మి మళ్లీ ఫామ్ లోకి వచ్చేయడం ఖాయం.