Begin typing your search above and press return to search.

ఫేస్ బుక్కులో ఆ బొమ్మలపై బ్రహ్మి ఫీలింగ్

By:  Tupaki Desk   |   4 Feb 2018 5:19 AM GMT
ఫేస్ బుక్కులో ఆ బొమ్మలపై బ్రహ్మి ఫీలింగ్
X
ఛత్రపతిని కాస్తా.. బ్రహ్మి కోసం ‘విచిత్రపతి’గా మార్చేశారు. ‘భాగ్ మిల్కా భాగ్’ కాస్తా బ్రహ్మి కథానాయకుడిగా ‘భాగ్ బ్రహ్మి భాగ్’గా మారిపోయింది. సచిన్ టెండూల్కర్ ను సైతం ‘బ్రహ్మిన్ టెండూల్కర్’గా మార్చేశారు. ఇంకా ఒబామా.. ఇందిరాగాంధీ.. కరుణానిధి లాంటి నేతలు సైతం బ్రహ్మి అవతారంలోకి మారిన వాళ్లే. ఇంకా ఫేస్ బుక్కులో ఇలాంటి చిత్రాలు ఎన్నెన్నో. ఈ మధ్య వీటి ఊపు కొంచెం తగ్గింది కానీ.. గతంలో అయితే బ్రహ్మిని పెట్టి నెటిజన్లు మామూలు కామెడీ చేసేవాళ్లు కాదు. మరి ఇలాంటివన్నీ బ్రహ్మానందం పట్టించుకుంటాడా? ఆయనకు ఈ మార్ఫింగ్ కామెడీ గురించి తెలుసా? ఒక ఇంటర్యూలో ఈ విషయంపై ఆయన్ని కదిపితే ఏమన్నాడంటే..

‘‘ఇవన్నీ నా దృష్టికి రాకుండా ఎలా ఉంటాయి? మొనాలిసా దగ్గర్నుంచి ట్రంప్ వరకు నా మీద ఎన్ని మార్ఫింగ్ ఫొటోలు వచ్చాయో నాకు తెలుసు. నా బట్టతల మీద వచ్చినన్ని జోకులు ఇంకెవరిమీదా వచ్చి ఉండవు. ఇలాంటివి చూసి ఫీలవుతారా అని ఒకాయన అడిగాడు. ఎందుకు ఫీలవను. అవుతాను. ఆనందంగా ఫీలయ్యా అని జవాబిచ్చా. జనాలు నాకెన్ని రూపాలు ఇచ్చారో అని గర్వంగా అనిపిస్తూ ఉంటుంది’’ అని బ్రహ్మి చెప్పడం విశేషం. ఐతే తనమీద ఇలాంటివి ఎన్ని చేసినా వేరే వాళ్ల మనోభావాలు దెబ్బ తినకుండా చూసుకోవాలని బ్రహ్మి అన్నాడు. అలాగే నటీనటుల ఆరోగ్యాల విషయంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయొద్దని.. ఇలాంటివి రాస్తే ఏమవుతుందో అని ఒకసారి ఆలోచించి ఆ తర్వాత ఏదైనా చేయాలని ఆయన సూచించారు.