Begin typing your search above and press return to search.

పాపం బ్రహ్మిని అనడమెందుకు?

By:  Tupaki Desk   |   23 Aug 2015 1:51 AM GMT
పాపం బ్రహ్మిని అనడమెందుకు?
X
పాతికేళ్ల పాటు తెలుగు తెరను నవ్వుల మయం చేసిన కమెడియన్ బ్రహ్మానందం. ఒక్కసారి కమెడియన్ గా అగ్రస్థానాన్ని అందుకున్నాక ఆయన్ని కొట్టేవాడు లేకపోయాడు. మధ్య మధ్యలో కొంచెం జోరు తగ్గించినా మళ్లీ పుంజుకుని తన స్థానాన్ని నిలబెట్టుకున్నారాయన. ఏళ్లు గడిచేకొద్దీ ఎవరి హవా అయినా తగ్గుతుంది కానీ.. మరింత ఎత్తుకు ఎదగడం.. హీరోలతో సమానంగా ఇమేజ్ సంపాదించుకోవడం ఆయనకే చెల్లింది. ఐతే గత ఐదారేళ్లలో కమెడియన్ గా స్వర్ణయుగం చూసిన బ్రహ్మికి ఏడాదిగా అంతగా కలిసి రావట్లేదు. హైలైట్ అవుతాయనుకున్న బ్రహ్మి పాత్రలు ఒక్కొక్కటిగా తుస్సుమంటూ రావడంతో ఆయన హవా తగ్గిపోయింది.

బ్రహ్మిని భలేగా వాడుకునే శ్రీనువైట్ల, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి డైరెక్టర్ల సినిమాల్లో కూడా ఆయన పాత్ర తేలిపోయింది. ఇప్పుడిక కిక్-2 మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు బ్రహ్మి. ఐతే ‘కిక్-2’లో ఆయన పాత్ర గొప్పగా పేలనూ లేదు. అలాగని నిరాశ పరచనూ లేదు. రవితేజతో అద్భుతమైన కెమిస్ట్రీ ఉండటం వల్ల బాగానే నవ్వులు పండాయి. ఐతే సమస్యేంటంటే.. బ్రహ్మిని చూసి చూసి మొహం మొత్తేసిన పాత్రలోనే మళ్లీ చూడాల్సి రావడం. బ్రహ్మిని హీరోతో కొట్టించడం, తన్నించడమే కామెడీ అయిపోయింది కొన్నేళ్లుగా. మళ్లీ అదే ఫార్ములాలో వెళ్లిపోయాడు సురేందర్ రెడ్డి. ఇదే నిరాశ పరిచే విషయం. ఏదో అలా టైంపాస్ అయిపోయిందన్నమాటే కానీ.. ఇది పేలే పాత్ర అయితే కాదు. ఐతే బ్రహ్మి మొహం మొత్తేస్తున్నాడని.. రొటీన్ కామెడీ చేస్తున్నాడని ఆయన్ని నిందించడం సరికాదు. బ్రహ్మి ఎలాంటి పాత్రనైనా అద్భుతంగా చేయగలరు. ఆయన్ని సరిగా వాడుకోలేకపోవడం రచయితలు, దర్శకుల వైఫల్యమే. కాబట్టి నిందించాల్సింది వాళ్లనే.