Begin typing your search above and press return to search.

బాలీవుడ్ చేతికి బ్ర‌హ్మాస్త్రం దొరికిన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   1 Jun 2022 1:31 PM GMT
బాలీవుడ్ చేతికి బ్ర‌హ్మాస్త్రం దొరికిన‌ట్టేనా?
X
ద‌క్షిణాది మార్కెట్ ని టార్గెట్ చేస్తూ త‌మ సినిమాల‌తో ఇక్క‌డ పాగా వేయాల‌ని బాలీవుడ్ మేక‌ర్స్, స్టార్స్‌ చాలా ఏళ్లుగా విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఆ ప్ర‌య‌త్నాల‌కు `బాహుబ‌లి` నీళ్లు చ‌ల్లింది. బాలీవుడ్ మేక‌ర్స్ మ‌న మార్కెట్ లో పాగా వేయాల‌ని భావిస్తే అక్క‌డి మార్కెట్ ని మ‌న వాళ్లు ఆక్ర‌మించేశారు. `బాహుబ‌లి` త‌రువాత విడుద‌లైన ప్ర‌తీ సినిమా అక్క‌డ రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తున్నాయి. గ‌త ఏడాది విడుద‌లైన బ‌న్నీ`పుష్ప‌` బాలీవుడ్ వ‌ర్గాల‌కు నిద్ర‌లేని రాత్రేల్ని మిగిల్చి షాకిచ్చింది.

దీని నుంచి తీరుకుని ఊపిరి పీల్చుకుందామ‌ని బాలీవుడ్ భావించే లోపే `ట్రిపుల్ ఆర్` దాడి మొద‌లు పెట్టింది. ఈ మూవీ త‌రువాత విడుద‌లైన `కేజీఎఫ్ 2` కోలుకోలేని దెబ్బ‌కొట్టి బాలీవుడ్ క్రేజీ స్టార్ల రికార్డుల్ని తుడిపి పెట్టేసింది. ఎలాగైనా దీని నుంవ‌చి బ‌య‌ట‌ప‌డాల‌ని, ద‌క్షిణాదిలో పాగా వేయాల‌ని `బాహుబ‌లి`కి మించిన సినిమాని అందించాల‌ని బాలీవుడ్ చేసిన ప్ర‌య‌త్నాలేవీ ఫ‌లించ‌లేదు. భారీ తార‌గ‌ణంతో చేసిన క‌లంక్‌, మ‌ణిక‌ర్ణిక‌, థ‌గ్స్ ఆఫ్ హిందోస్తాన్ చిత్రాలు పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయాయి.

వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేసి భారీ తారాగ‌ణంతో చేసిన ఈ సినిమాలు భారీ న‌ష్టాల‌ని తెచ్చిపెట్టాయి. ఇక క‌ర‌న్ జోహార్, సాజిద్ న‌దియా వాలా, హీరూ జోహార్‌, అపూర్వ మెహ‌తా క‌లిసి 130 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించిన ఈ పీరియాడిక్ డ్రామా భారీ డిజాస్ట‌ర్ గా నిలిచింది. మాధురీ దీక్షిత్‌, సంజ‌య్ ద‌త్‌, అలియాభ‌ట్‌, సోనాక్షి సిన్హా, వ‌రుణ్ ధావ‌న్‌, ఆదిత్య రాయ్ క‌పూర్ వంటి క్రేజీ న‌టులు న‌టించినా ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద పెద్దగా ప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోయింది. ఇక అమీర్ ఖాన్‌, అమితాబ్ బ‌చ్చ‌న్ క‌లిసి న‌టించిన పీరియాడిక్ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ `థ‌గ్స్ ఆఫ్ హిందోస్తాన్‌`.

ప్ర‌తిష్టాత్మ‌క య‌ష్ రాజ్ ఫిలింస్ 300 కోట్ల భారీ బ‌డ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ డిజాస్ట‌ర్ కా బాప్ గా నిలిచి బాలీవుడ్ ఆశ‌ల‌ని ఆవిరి చేసింది. `బాహుబ‌లి`ని మించిన సినిమాతో సౌత్‌తో పాటు యావ‌త్ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించాల‌ని బాలీవుడ్ మేక‌ర్స్ చేసిన ప్ర‌య‌త్నాలేవీ ఫ‌లించ‌లేదు. దీంతో గ‌త కొంత కాలంగా ద‌క్షిణాదితో పాగావేసే బ్ర‌హ్మాస్త్రం కోసం ఎదురుచూస్తున్న బాలీవుడ్ కు ఇప్ప‌డు `బ్ర‌హ్మ‌స్త్ర‌` రూపంలో దొరికిన‌ట్టేనా అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ర‌ణ్ బీర్ క‌పూర్‌, అలియాభ‌ట్‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌, నాగార్జున కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీని మూడు భాగాలుగా విడుద‌ల చేస్తున్నారు.

ముందు సెప్టెంబ‌ర్ 9న తొలి పార్ట్ విడుద‌ల కాబోతోంది. ఇదే మంచి అద‌నుగా భావించిన బాలీవుడ్ ఈ మూవీతో ద‌క్షిణాదిలో పాగావేయాల‌ని ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే రాజ‌మౌళిని ద‌క్షిణాది భాష‌ల‌కు స‌మ‌ర్ప‌కుడిగా ఎంచుకున్నారు. ఈ మూవీ ప్ర‌చారాన్ని బుధ‌వారం ద‌క్షిణాదిలో మొద‌లు పెట్టారు. శివ త‌త్వాన్ని ఆవిష్కిస్తూ తెర‌కెక్కిన పార్ట్ 1 సెంటిమెంట్ బ‌లంగా వీస్తున్న ఈ నేప‌థ్యంలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిల‌వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది అనే చ‌ర్చ వినిపిస్తోంది. జూన్ 15న ఈ మూవీ ట్రైల‌ర్ ని విడుద‌ల చేయ‌బోతున్నారు. సినిమా రిలీజ్ కు 80 రోజులు వున్న నేప‌థ్యంలో ద‌క్షిణాదిలో భారీ స్థాయిలో రాజ‌మౌళితో క‌లిసి ప్ర‌చారం చేయ‌బోతున్నారు. ఈ సినిమాలో నాగార్జున న‌టించ‌డం... రాజ‌మౌళి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించ‌డంతో ఈ సినిమాతో ద‌క్షిణాదిలో బాలీవుడ్ పాగా వేయ‌డం ఖాయం అంటున్నారు. ఇది ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది తెలియాలంటే సెప్టెంబ‌ర్ 9 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.