Begin typing your search above and press return to search.

'కుంకుమలా' ఆడియో టీజర్: కలర్ ఫుల్ గా రణబీర్ - అలియాల ప్రేమగీతం..!

By:  Tupaki Desk   |   27 May 2022 6:36 AM GMT
కుంకుమలా ఆడియో టీజర్: కలర్ ఫుల్ గా రణబీర్ - అలియాల ప్రేమగీతం..!
X
బాలీవుడ్ లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెరకెక్కుతున్న చిత్రం ''బ్ర‌హ్మాస్త్ర''. రణబీర్ కపూర్ - అలియా భట్ - అమితాబ్ బ‌చ్చ‌న్ - మౌనీరాయ్‌ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన ఈ సోషియో ఫాంటసీ అడ్వెంచర్ మూవీలో కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా విడుదల చేయనున్నారు.

''బ్రహ్మాస్త్ర ఫస్ట్ పార్ట్: శివ'' పేరుతో మొదటి భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే విడుదలైన రణబీర్ - అలియా పాత్రలకు సంబంధించిన గ్లిమ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అలానే హిందీలో రిలీజ్ చేసిన 'కేసరియా' పాట శ్రోతలను ఆకట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా ఇదే పాట తెలుగు వెర్సన్ ను ఆవిష్కరించారు.

'కుంకుమలా' అనే ఈ గీతాన్ని అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నాగార్జున ట్వీట్ చేస్తూ ''రణ్‌బీర్ మరియు అలియాల పెళ్లికి అయాన్ #కేసరియా పాటను లాంచ్ చేసినప్పుడు నేను చాలా సంతోషించాను!!. ఇప్పుడు ఈ ఆడియో టీజర్‌ కి సంబంధించిన అందమైన తెలుగు వెర్షన్‌ సంగీతాన్ని ఆస్వాదించండి'' అని పేర్కొన్నారు.

'ఆ బ్రహ్మే నిన్ను చేయడానికే తన ఆస్తి మొత్తాన్నే ఖర్చే పెట్టుంటాడే' అంటూ సాగిన ఈ గీతాన్ని సిద్ శ్రీరామ్ ఆలపించారు. ప్రీతమ్ స్వరాలు సమకూర్చగా.. గేయ రచయిత చంద్రబోస్ దానికి సరిపడే లిరిక్స్ అందించే ప్రయత్నం చేశారు. ఆలియా భట్‌ - రణబీర్‌ కపూర్ లపై చిత్రీకరించిన 'కుంకుమలా' ప్రేమ గీతం కలర్ ఫుల్‌ గా ఉంది. ఇందులో ప్రధాన జోడీ చాలా అందంగా కనిపిస్తున్నారు.

''బ్రహ్మాస్త్ర మొదటి భాగం: శివ'' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబ‌ర్ 9న (09.09.2022) హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. తెలుగులో ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

రాజమౌళి సమర్పించడంతో పాటు అక్కినేని నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడం వల్ల తెలుగు ప్రేక్షకుల్లో 'బ్రహ్మాస్త్ర' పై అంచనాలు నెలకొన్నాయి. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సమర్పణలో ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ - ప్రైమ్ ఫోకస్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.