Begin typing your search above and press return to search.

'భీమ్లా నాయక్' విషయంలోను సెంటిమెంట్ వదలని త్రివిక్రమ్!

By:  Tupaki Desk   |   21 Feb 2022 1:12 AM GMT
భీమ్లా నాయక్ విషయంలోను సెంటిమెంట్ వదలని త్రివిక్రమ్!
X
త్రివిక్రమ్ సినిమా అంటే అది ఒక వినోదాల విందు భోజనంలా ఉంటుందని ప్రేక్షకులు నమ్ముతారు. ఆయన సినిమాలో యాక్షన్ .. ఎమోషన్ ఎంతలా ఉంటాయో, కామెడీ కూడా అదే పాళ్లలో సందడి చేస్తుంది. ఇక త్రివిక్రమ్ హాస్యభరితమైన సన్నివేశాలను .. సంభాషణలను సమకూర్చడంలో సిద్ధహస్తుడు. ఆయన సినిమాలు ఎక్కడా కూడా బోర్ కొట్టవు. సినిమా మొదలైన దగ్గర నుంచి చివరివరకూ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ నడుస్తూనే ఉంటుంది.

ఇక తన సినిమాల్లో బ్రహ్మానందం తప్పనిసరిగా ఉండేవారు. తాను క్రియేట్ చేసిన పాత్రలకు బ్రహ్మానందం పూర్తి న్యాయం చేస్తారని ఆయనకి ఒక గట్టి నమ్మకం ఉండేది.

రచయితగా ఆయన బ్రహ్మానందం సన్నివేశాలను ఎలా రాస్తారని చెప్పడానికి 'నువ్వు నాకు నచ్చావ్' .. 'మల్లీశ్వరి' సినిమాలు సరిపోతాయి. ఆ సినిమాల్లో బ్రహ్మానందం చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఈ సినిమాలు ఎన్ని సార్లు టీవీలో వచ్చినా మంచి రేటింగును రాబడుతూనే ఉంటాయి.

దానికి కారణం త్రివిక్రమ్ కథాకథనాలు .. సంభాషణలు అనే చెప్పాలి. ఇక తాను దర్శకుడు అయిన తరువాత కూడా తన ప్రతి సినిమాకి బ్రహ్మానందాన్ని తీసుకోవడమనేది త్రివిక్రమ్ సెంటిమెంట్ గా మారిపోయింది. తన ప్రతి సినిమాలోను ఆయన బ్రహ్మానందం కోసం ఒక పాత్రను క్రియేట్ చేస్తూ వెళ్లారు.

'జులాయి' .. 'అత్తారింటికి దారేది' .. 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాల్లో బ్రహ్మానందం నవ్వుల పువ్వులు పూయించారు. థియేటర్లను నవ్వుల పడవల్లా మార్చేశారు. ఆ సినిమాల్లో వినోదం పరంగా బ్రహ్మానందం తన విశ్వరూపం చూపించారు. ఆయన పాత్రను తలచుకుని తలచుకుని నవ్వుతూనే ఉంటాము. అలాంటి బ్రహ్మానందం ఈ మధ్య కాలంలో అనారోగ్య కారణాల వలన కొంతకాలం పాటు సినిమాలకి దూరంగా ఉన్నారు. మళ్లీ ఇప్పుడు ఆయన నెమ్మదిగా సినిమాలకి సైన్ చేస్తున్నారు. అలా ఆయనతో 'భీమ్లా నాయక్'లో త్రివిక్రమ్ ఒక పాత్రను చేయించారు.

సితార బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమైంది. పవన్ కల్యాణ్ తోను .. సితార బ్యానర్ తోను త్రివిక్రమ్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ సినిమాకి ఆయన స్క్రీన్ ప్లే అందించారు. రీమేక్ మూవీ అయినప్పటికీ కథా పరంగా కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఈ నేపథ్యంలో బ్రహ్మానందం కోసం ఆయన ఒక పాత్రను క్రియేట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా చివరిలో వచ్చే బ్రహ్మీ పాత్ర పడి పడి నవ్విస్తుందట. అటు బ్రహ్మానందానికీ .. ఇటు ఈ సినిమాకి ఈ పాత్ర ప్లస్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.