Begin typing your search above and press return to search.

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ‘దంగల్’

By:  Tupaki Desk   |   11 Sept 2017 12:50 PM IST
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ‘దంగల్’
X
ఆస్ట్రేలియా క్రికెటర్లకు చాలా మందికి భారత్ తో మంచి అనుబంధం ఉంది. నిన్నటి తరంలో స్టీవ్ వా.. మెక్ గ్రాత్.. షేన్ వార్న్ లాంటి వాళ్లు భారత్ తో ఎప్పుడూ అనుబంధం కొనసాగిస్తుంటారు. వీరి తర్వాత క్రికెట్లోకి వచ్చిన ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీకి కూడా భారత్ అంటే చాలా ఇష్టం. ప్రతి ఏడాదీ కొన్ని రోజుల పాటు బ్రెట్ లీ భారత్ లో పర్యటిస్తుంటాడు. ఇక్కడ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటుంటాడు. ఇక్కడి జనాలతో మమేకమవుతుంటాడు. ఇక్కడి కల్చర్ అతడికి చాలా ఇష్టం. తాజాగా బ్రెట్ లీ మరోసారి భారత పర్యటనకు వచ్చాడు. ఈ సందర్భంగా అతను కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో పర్యటించాడు.

కర్ణాటక ప్రిమియర్ రెజ్లింగ్ లీగ్ కు బ్రెట్ లీ వ్యాఖ్యాతగా వ్యవహరించడం విశేషం. ఇందులో భాగంగా బ్రెట్ లీ రెజ్లర్లు సాధన చేసే అఖాడాకు వెళ్లాడు. ఐతే కేవలం రెజ్లర్ల సాధన చూసి వచ్చేయకుండా తాను కూడా కదన రంగంలోకి దిగాడు. షార్ట్.. టీషర్ట్ వేసుకుని అఖాడాలో అడుగుపెట్టి.. రెజ్లర్ల తరహాలో ముందుగా ప్రార్థన చేశాడు. తర్వాత కసరత్తులు చేశాడు. ఆపై ఓ మల్లయోధుడితో పోరాటానికి దిగాడు. బ్రెట్ లీ కోసమని ప్రత్యర్థి కొంచెం జోరు తగ్గించాడు. బలహీనంగా ఉన్నట్లు నటించాడు. దీంతో బ్రెట్ లీ అతడిని కింద పడేసి అతడిపై పైచేయి సాధించినట్లుగా కలరింగ్ ఇచ్చాడు. ఈ వీడియో భలే ఆసక్తి రేకెత్తిస్తోంది. ఓ ఆస్ట్రేలియా క్రికెటర్ ఇలా మన దగ్గరికి వచ్చి రెజ్లింగ్ అఖాడాలో సరదాగా గడపడం ఆసక్తి రేకెత్తించే విషయమే. మరోవైపు మైసూర్ మహారాజా భవంతిని కూడా బ్రెట్ లీ సందర్శించాడు. అక్కడ రాణి ప్రమోదా దేవిని కలిశాడు. ఆమె కోసం పియానో కూడా వాయించాడు.