Begin typing your search above and press return to search.

RRR పై అక్కసు వెళ్లగక్కుతున్న బ్రిటీష్ చరిత్రకారులు..!

By:  Tupaki Desk   |   22 July 2022 9:30 AM GMT
RRR పై అక్కసు వెళ్లగక్కుతున్న బ్రిటీష్ చరిత్రకారులు..!
X
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మాగ్నమ్ ఓపస్ ''ఆర్.ఆర్.ఆర్'' బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో భారతీయ చిత్రంగా రికార్డులకెక్కింది. అక్టోబర్‌ లో జపాన్‌ లో థియేట్రికల్ రిలీజ్ అయిన తర్వాత మరిన్ని రికార్డులు ఖాయలని విశ్లేషకులు భావిస్తున్నారు.

నిజానికి ఓటీటీలోకి వచ్చిన తర్వాత RRR మూవీకి అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కాయి. ఎందరో హాలీవుడ్ స్టార్, రచయితలు, విమర్శకులు మరియు దర్శకులు కూడా ఇండియన్ యాక్షన్ డ్రామాని కొనియాడుతున్నారు. తాజాగా హాలీవుడ్ ఫిలిం మేకర్స్ రూసో బ్రదర్స్ ఈ చిత్రాన్ని ప్రశంసించడమే కాదు.. రాజమౌళితో కలసి సినిమా చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

RRR' చిత్రానికి గ్లోబల్ రీచ్ వచ్చిన తర్వాత ప్రశంసలతో పాటుగా విమర్శలు కూడా వచ్చాయి. దీన్ని ఒక గే లవ్ స్టోరీ అని కామెంట్ చేసినవారు కూడా ఉన్నారు. రాబర్ట్ టోంబ్స్‌ అనే ఒక బ్రిటీష్ చరిత్రకారుడు ఈ సినిమాలో కొన్ని పాత్రలను తప్పుబట్టారు. హిస్టారికల్ కథలను రూపొందించడానికి బ్రిటిష్ వారిని విలన్‌లుగా మార్చారని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ ఆర్టికల్ రాశారు.

గత కొన్ని శతాబ్దాలుగా ప్రపంచంలో బ్రిటిష్ వారు ముఖ్యమైన పాత్ర పోషించారని.. గవర్నర్ స్కాట్ మరియు అతని భార్య వంటి ఇద్దరు బ్రిటీష్ పాత్రలను అసాధారణంగా సిల్లీగా చిత్రీకరించారని పేర్కొన్నాడు రాబర్ట్ టోంబ్స్‌. 'RRR' కథ సెట్ చేయబడిన 1920లలో భారతదేశం చాలా సుదూర బ్రిటిష్ పర్యవేక్షణలో ఎక్కువగా భారతీయులచే నిర్వహించబడిందని అన్నారు.

RRR వంటి సినిమాలు గతం గురించి దాచిన కొన్ని నిజాలను బహిర్గతం చేయవని.. కానీ భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తాయని.. వినోదం పేరుతో డబ్బు సంపాదించడమే ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నాడు. అంతేకాదు ఇలాంటి సినిమాలతో భారతీయ సంస్కృతి మరియు రాజకీయాలపై ఆధిపత్యం చెలాయించే హింసాత్మక హిందూ జాతీయవాదాన్ని మోడీ ప్రభుత్వం ఆకర్షిస్తుందని రాబర్ట్ తన వ్యాసంలో రాశారు.

నెట్‌ ఫ్లిక్స్ తన ప్లాట్‌ ఫారమ్‌ లో ‘RRR’ ని విపరీతంగా ప్రమోట్ చేస్తున్నందుకు సిగ్గుపడాలని రాబర్ట్ అభిప్రాయపడ్డారు. నిజానికి భారతదేశంలో బ్రిటీష్ వారి పాలన ఎలా సాగిందో ప్రతి ఒక్క చరిత్రకారుడికీ తెలుసు. వ్యాపారం కోసమని ఇండియాకి వచ్చి.. క్రమక్రమంగా మన దేశాన్ని ఆక్రమించుకుంటూ వచ్చారు. 18వ శతాబ్ది చివరకు దేశంలోని చాలా భాగాన్ని తమ పరిపాలన క్రిందకు, కొన్ని రాజ్యాలను తమ ప్రభావం క్రిందకు తీసుకువచ్చారు. 19వ శతాబ్ది తొలినాటికి వారి ఆధిపత్యం పూర్తిగా స్థిరపడిపోయింది.

భారతీయలను అణచివేయడానికి తీసుకొచ్చిన చట్టాలను.. బ్రిటీష్ వారి పరిపాలన కాలంలో జరిగిన దురాగతాలను ఎప్పటికీ మరిచిపోలేరు. ఇప్పుడు RRR సినిమాలో అప్పటి సంఘటనల స్పూర్తితో కల్పిత కథతో తెరకెక్కించారు. అయితే రాబర్ట్ వంటి పలువురు బ్రిటీష్ వ్యక్తులు దీనిపై అక్కసు వెలగక్కుతున్నారు. దీనికి నెటిజన్లు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. చరిత్రను మరిచిపోవద్దని చెబుతూ అప్పటి దురాగతాలను గుర్తు చేస్తున్నారు