Begin typing your search above and press return to search.

చెర్రీ సినిమాకు.. మళ్లీ అదే రిపీటవుద్దా?

By:  Tupaki Desk   |   17 Oct 2015 5:30 PM GMT
చెర్రీ సినిమాకు.. మళ్లీ అదే రిపీటవుద్దా?
X
సరిగ్గా ఏడాది కిందట దసరా సెలవుల అడ్వాంటేజీని ఫుల్ గా వాడేసుకుందామని వచ్చాడు రామ్ చరణ్. కృష్ణవంశీ దర్శకత్వంలో అతను హీరోగా తెరకెక్కిన ‘గోవిందుడు అందరివాడేలే’ అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకొచ్చింది. చరణ్ సినిమా కదా విడుదల భారీగానే చేశారు. ఐతే దానికి ముందు శుక్రవారమే గోపీచంద్ సినిమా ‘లౌక్యం’ విడుదలైంది. దానికి చాలా మంచి టాక్ వచ్చింది. రెండో వారం కూడా మంచి వసూళ్లే ఉన్నాయి.

కానీ ‘గోవిందుడు అందరివాడేలే’ కోసం చాలా చోట్ల లౌక్యం సినిమాను ఖాళీ చేసి థియేటర్లు ఇవ్వక తప్పలేదు. కానీ గోవిందుడు.. ఏవరేజ్ టాక్ తెచ్చుకోవడంతో వీకెండ్ అయ్యాక, రెండో వారం నుంచి మళ్లీ ఆ సినిమాను తప్పించి చాలా చోట్ల ‘లౌక్యం’ వేశారు. ఆ సినిమా రెండు, మూడు వారాల్లోనూ మంచి వసూళ్లు సాధించింది. సరిగ్గా ఇప్పుడు కూడా రామ్ చరణ్ సినిమాకు ఇలాంటి అనుభవమే ఎదురైనా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.

ఎందుకంటే ‘బ్రూస్ లీ’కి అంత గొప్ప టాక్ ఏమీ రాలేదు. ఏవరేజ్ అని సరిపెడుతున్నారు. వీకెండ్ తర్వాత బండి నడవడం కొంచెం కష్టమే కావచ్చు. ఈ నేపథ్యంలో దీనికి ముందువారం విడుదలై.. వీక్ డేస్ లో కూడా మంచి వసూళ్లు సాధిస్తూ వచ్చిన ‘రుద్రమదేవి’ని తిరిగి థియేటర్లలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. రుద్రమదేవి బాగా ఆడుతున్నప్పటికీ ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం చాలా చోట్ల థియేటర్లు ఖాళీ చేయాల్సి వచ్చిందన్నది వాస్తవం. ఐతే కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేకుంటే ఒప్పందాన్ని పక్కనబెట్టి.. సినిమాను మార్చుకునే వీలు లేకపోలేదు. కాబట్టి గత ఏడాది లాగే మరోసారి చరణ్ సినిమా స్థానంలో పాత సినిమా వస్తుందేమో చూడాలి.