Begin typing your search above and press return to search.

నంది అవార్డులపై బన్నీ వాసు మళ్లీ..

By:  Tupaki Desk   |   21 Nov 2017 1:26 PM GMT
నంది అవార్డులపై బన్నీ వాసు మళ్లీ..
X
ఆంధప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల విషయమై మళ్లీ రగడ మొలదైంది. అందరూ ఆ వివాదాన్ని మరిచిపోతున్న దశలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ గొడవ ముదిరేలా చేశాయి. ఏపీలో ఆధార్ కార్డు లేని వాళ్లు నంది అవార్డుల గురించి మాట్లాడుతున్నారని.. ఈ గొడవ పెద్దదైతే నంది అవార్డులు రద్దు చేసేస్తామని లోకేష్ హెచ్చరించడంపై సీనియర్ రచయిత.. నటుడు పోసాని కృష్ణమురళి తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై ఇండస్ట్రీ నుంచి గట్టి మద్దతే వస్తోంది.

ఇప్పటికే నంది అవార్డుల విషయమై నిరసన వ్యక్తం చేసిన నిర్మాత.. మెగా ఫ్యామిలీకి సన్నిహితుడు బన్నీ వాసు మరోసారి తన వాయిస్ వినిపించాడు. అతను పోసాని వ్యాఖ్యల్ని సమర్థిస్తూ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టాడు. ‘‘పోసాని గారూ.. సార్ మీరు 100శాతం ఆ అవార్డుకు అర్హులు. మనం ఏపీలో పుట్టాం. ఏపీలో పెరిగాం. అమెరికాలో కాదు. ఏపీలోనే చదువుకున్నాం. అమెరికాలో కాదు. మన యాస ఏపీదే. మనం ఏపీ వాళ్లమని రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు’’ అని బన్నీ వాసు అన్నాడు. నంది అవార్డుల ప్రకటన వచ్చిన వెంటనే విమర్శలు వ్యక్తం చేసిన తొలి ఇండస్ట్రీ ప్రముఖుడు బన్నీ వాసే. మెగా హీరోలందరూ తెలుగుదేశం ప్రభుత్వం నుంచి నటన నేర్చుకోవాలంటూ అతను వారం కిందట చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమే అయ్యాయి.