Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ - రవితేజ ఫ్లాప్ చిత్రాలపై రీవర్క్ చేయాలనుకున్న బన్నీ..!

By:  Tupaki Desk   |   23 Nov 2022 1:30 PM GMT
ఎన్టీఆర్ - రవితేజ ఫ్లాప్ చిత్రాలపై రీవర్క్ చేయాలనుకున్న బన్నీ..!
X
టీవీ యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన వక్కంతం వంశీ.. ఆ తర్వాత రచయితగా మారి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 'రేసుగుర్రం' 'కిక్' 'టెంపర్' 'ఎవడు' వంటి చిత్రాలకు రచయితగా చేసి మంచి విజయాలను అందుకున్నారు.

వక్కంతం వంశీ కథ అందించిన సినిమాలలో 'ఊసరవెల్లి' మరియు 'కిక్ 2' ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. అయితే ఈ రెండు చిత్రాల కథలూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి చాలా ఇష్టమట. వాటిని రీవర్క్ చేసి ఎప్పటికైనా రీమేక్ చేస్తానని బన్నీ చెప్పినట్లుగా వంశీ వెల్లడించాడు.

వక్కంతం వంశీ తాజాగా కమెడియన్ అలీ హోస్ట్ చేస్తున్న షోకి గెస్ట్ గా వచ్చాడు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ.. "అల్లు అర్జున్ కి నా కథల్లో రెండు చాలా బాగా ఇష్టం. అవి ఆయన నటించిన సినిమాలు కూడా కాదు. అవే 'ఊసరవెల్లి' మరియు 'కిక్ 2'. బ్యాడ్ లక్ అవి రెండు సరిగా ఆడలేదు. అయినా సరే ఆ రెండూ ఆయనకి చాలా ఇష్టం" అని చెప్పారు.

"యునిక్ పాయింట్స్ చాలా రేర్ గా దొరుకుతాయి.. అవి వర్కౌట్ చేసుకోకపోతే మన ఫెయిల్యూర్ అవుతుందని బన్నీ చెప్తుంటాడు. 'కిక్ 2' లాంటి కథలు రెగ్యులర్ గా వచ్చేవి కాదు. కానీ వర్కౌట్ అవ్వలేదు. 'ఊసరవెల్లి' సినిమాని మాత్రం ఏదొక రోజు రీవర్క్ చేసి నేను చేస్తా.. ఆ కథని ఇంకో రకంగా చేయాలి అని బన్నీ ఎపుడూ అంటుంటాడు"

"తమిళ్ లో రీమేక్ చేస్తే ఎలా వుంటుందని అనేవాడు. ఆయన మైండ్ లో ఏమేమి ఐడియాలు ఉన్నాయో తెలియదు.. బన్నీ ఆ మాట నాతో నాలుగైదు సార్లు అన్నారు" అని వంశీ చెప్పుకొచ్చాడు. నిజానికి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఊసరవెల్లి' మరియు 'కిక్ 2' చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఫ్లాప్ అయినప్పటికీ.. ఆ సినిమాలను ఇష్టపడే ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు.

ముఖ్యంగా ఆ రెండు సినిమాలలో హీరో పాత్రలు మరియు క్యారెక్టైజేషన్స్ ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ టీవీలకు అతుక్కొని పోయి చూసే జనాలు వున్నారు. అంతలా టోనీ - రాబిన్ హుడ్ పాత్రలకు కనెక్ట్ అయ్యారు. అల్లు అర్జున్ సైతం ఆ కథలను బాగా ఇష్టపడినట్లు తెలుస్తోంది.

ఇకపోతే వక్కంతం వంశీ రచయితగా అల్లు అర్జున్ తో 'రేసు గుర్రం' చిత్రానికి పని చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 'నా పేరు సూర్య' చిత్రంతో వంశీని డైరెక్టర్ గా పరిచయం చేసాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. అలీ టాక్ షోలో ఈ విషయంపైనా వంశీ మాట్లాడారు.

"నిజానికి 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' తారక్ తో తీయాల్సింది. తను నన్ను ఎంతో ప్రోత్సహించాడు. తన కోసమే ఆ కథ రాసుకున్నా. ఆ కథ రాయడానికి మూడేళ్లు పట్టింది. కానీ, ఎందుకో తారక్ ను ఊహించుకుంటుంటే ఆ కథ కుదరడం లేదు. కొన్ని రోజులు రాయడం ఆపేసి పక్కన పెట్టా. ఆ తర్వాత నా ఫ్రెండ్ ఆ కథని బన్నీ దగ్గరకు తీసుకువెళ్లాడు. బన్నీ కథ విన్న వెంటనే ఓకే చేసేశాడు. నాకైతే ఆ సినిమా ఇప్పటికీ ఓ కల లాగా ఉంది" అని వంశీ తెలిపారు.

'నా పేరు సూర్య' సినిమాలో హీరో కంటే అన్వర్ పాత్రను హైలైట్ చేయడంపై మాట్లాడుతూ.. "ఈ ప్రశ్న ఇప్పటికి చాలా మంది అడిగారు. ఆ పాత్ర ప్రభావం సినిమా రిజల్ట్ మీద పడిందని అంటుంటారు. అన్వర్ పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. ఆ సినిమా కథే అన్వర్ పాత్ర. అల్లు అరవింద్ గారు కథ విన్నాక 'క్లైమాక్స్ ఇలా తీయడం రిస్క్. కానీ సినిమాకు అదే హైలైట్' అన్నారు. ఆ సినిమాకు సంబంధించి ఏ విషయంలోనైనా పూర్తి బాధ్యత నాదే. నేను స్క్రీన్ ప్లే విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది" అని అన్నారు.

'నా పేరు సూర్య' సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాదించలేదు. కానీ ఆ సినిమా హిట్ అవుతుందని నాకంటే బన్నీ - అరవింద్ గారు బాగా నమ్మారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత నన్ను పిలిచి ధైర్యం చెప్పారు. ఇకపై ఏది రాసినా బాగా ఆలోచించి రాయాలి అనుకున్నా. కొవిడ్ వల్ల గ్యాప్ వచ్చింది. నితిన్ సినిమా ఫిక్స్ చేసి ఏడాదిపైనే అయింది. స్క్రిప్ట్ కోసం టైం తీసుకుంటున్నా అని చెప్పారు. ఇప్పటికీ శ్రీలీలతో ఓ పాట చిత్రీకరించినట్లుగా వక్కంతం వంశీ తెలిపారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.