Begin typing your search above and press return to search.

నిర్మాత‌ల మండ‌లి స్కామ్ కోట్ల‌లోనే?!

By:  Tupaki Desk   |   10 Dec 2015 4:41 AM GMT
నిర్మాత‌ల మండ‌లి స్కామ్ కోట్ల‌లోనే?!
X
తెలుగు సినిమా నిర్మాత‌ల మండ‌లిలో అంతూ ద‌రీ లేని అవినీతిపై ఒక్కో వివ‌రం బైటికొస్తోంది. ప్ర‌స్తుతం ఈ విష‌యంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఒక‌రు ల‌క్ష‌ల్లో స్కామ్ మాత్ర‌మే అని క‌వ‌ర్ చేసేందుకు చూస్తుంటే, కానేకాదు ఈ స్కామ్‌ కోట్ల‌లో ఉంటుంది అంటూ ఫిర్యాదు చేస్తున్నారు మ‌రికొంద‌రు. ఇది ఇప్పుడే మొద‌లైన భోగోతం కాదు. ఏళ్లుగా సాగుతున్న తంతు ఇది. 2003 నుంచి చిట్టా ప‌ద్దుల‌న్నీ తిర‌గేస్తే కోట్ల రూపాయ‌ల్లో స్కామ్ బైట‌ప‌డుతుంది అంటూ నానా ర‌భ‌స సాగుతోందిప్పుడు.

మెంబ‌ర్స్‌ లోని కొంద‌రు సొంత పెత్త‌నం చెలాయించారు. చేతి వాటం చూపించారు. చేతికొచ్చిన‌దంతా ప‌ర్స‌న‌ల్‌ గా ఉప‌యోగించుకుని తీరిగ్గా ఇప్పుడు లెక్క‌లు చెబుతున్నారు. ముఖ్యంగా గ‌తంలో మండ‌లిలో ట్రెజ‌ర‌ర్‌ గా ప‌నిచేసిన కె.సి.శేఖ‌ర్‌ బాబు అనే ఆసామి రూ.25 ల‌క్ష‌ల డిపాజిట్ సొమ్ముని వ్య‌క్తిగ‌త అవస‌రాల‌కు వాడుకున్నార‌ని, ఇప్పుడు లోగుట్టు బైటికొచ్చేస‌రికి ఆ డ‌బ్బును తిరిగి మండ‌లికి చెల్లించేశాడ‌ని చెప్పుకుంటున్నారు.

నిన్న‌టిరోజున అధికారికంగా జ‌రిగిన పాత్రికేయ స‌మావేశంలో ప్ర‌స్తుత నిర్మాత‌ల మండ‌లి అధ్య‌క్షుడు బూరుగుప‌ల్లి శివ‌రామకృష్ణ విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెబుతూ .. ఈ విష‌యాల్ని వెల్ల‌డించారు. కొంద‌రు చేసిన త‌ప్పును ఒప్పుకున్నారు. తిరిగి సొమ్ముల్ని చెల్లించేందుకు రెడీ అయ్యారు. అందుకే పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌లేదు.. అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు జ‌రిగిన స్కామ్ కేవ‌లం ల‌క్ష‌ల్లోనా? లేక కోట్ల‌లోనా ? అన్న‌ది ఆరాతీస్తేనే తేలుతుంది. ప్ర‌స్తుతం 2003 నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న ప‌త్రాల్ని ఆడిటింగ్ చేయిస్తున్నాం. అస‌లు స్కామ్ విలువెంతో త్వ‌ర‌లోనే తేల్తుంది.. అంటూ బూరుగుప‌ల్లి చెప్పుకొచ్చారు. ఇంత పెద్ద స్కామ్ జ‌రుగుతున్నా పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌కుండా లోలోన ప‌రిష్క‌రించుకోవ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు అధ్య‌క్ష‌త‌న ఏర్ప‌డిన క‌మిటీ దోషుల్ని శిక్షిస్తుంద‌ని త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ వంటి పెద్ద‌లు చెప్పుకొచ్చారు.

పోలీస్ స్టేష‌న్ వ‌ర‌కూ వెళితే ఈ వ్య‌వ‌హారం మొత్తం చెయ్యి దాటిపోయిన‌ట్టే. అందుకే మండ‌లిలోని కొంద‌రు పెద్ద‌ల్ని ర‌క్షించేందుకే ఈ వ్య‌వ‌హారాన్ని గుట్టు చ‌ప్పుడు కాకుండా ఇలా ప‌రిష్క‌రించుకునేందుకు చూస్తున్నార‌ని ప‌లువురు ముచ్చ‌టించుకోవ‌డం విశేషం. నిర్మాత‌ల మండ‌లి ఎన్నిక‌లు జ‌ర‌గ‌కుండా ఆగిపోవ‌డం వెన‌క కూడా బోలెడు మంది పెద్ద‌ల హ‌స్తం ఉంద‌ని చెప్పుకుంటున్నారు. ఏదో జ‌రుగుతోంది. బైటికి తెలియ‌ని ర‌హ‌స్యాలెన్నో ఉన్నాయి. అస‌లేమై ఉంటుందబ్బా!!