Begin typing your search above and press return to search.

మినీ రివ్యూ : బ‌ట‌ర్ ఫ్లై

By:  Tupaki Desk   |   30 Dec 2022 11:49 AM GMT
మినీ రివ్యూ : బ‌ట‌ర్ ఫ్లై
X
విభిన్న‌మైన సినిమాల‌తో హీరోయిన్ గా త‌న కంటూ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటోంది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. రీసెంట్ గా `కార్తికేయ 2`తో పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ ని సొంతం చేసుకున్న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ .. నిఖిల్ తో క‌లిసి మ‌రో సారి చేసిన `18 పేజెస్`తో మ‌రో హిట్ ని త‌న ఖాతాలో వేసుకుంది. తాజాగా ఉమెన్ సెంట్రిక్ నేప‌థ్యంలో సాగే పాన్ ఇండియా మూవీ `బ‌ట‌ర్ ఫ్లై`లో న‌టించింది. ఘంటా స‌తీష్ బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీని ర‌వి ప్ర‌కాష్ బోడ‌పాటి, ప్ర‌సాద్ తిరువ‌ళ్లూరి, ప్ర‌దీప్ న‌ల్ల‌మెల్లి సంయుక్తంగా నిర్మించారు.

థ్రిల్ల‌ర్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిన ఈ మూవీ తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో డిసెంబ‌ర్ 29 న విడుద‌లైంది. థియేట‌ర్ల‌లో కాకుండా ఈ మూవీ ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ `డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌`లో డిసెంబ‌ర్ 29 నుంచి తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తొలిసారి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన ఈ మూవీ ఎలా వుంది. ప‌బ్లిక్ టాక్ ఏంటీ?.. ప్రేక్ష‌కుల నుంచి ఎలాంటి స్పంద‌న ల‌భిస్తోంద‌న్న‌ది ఒక‌సారి చూద్దాం.

నికోల్ కోదాటి, భూమికా, రావు ర‌మేష్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. క‌థ‌లోకి వెళితే... వైజ‌యంతి (భూమిక‌), గీత (అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌) చిన్న‌త‌నంలోనే త‌ల్లిదండ్రుల్ని రోడ్డు ప్ర‌మాదంలో పోగొట్టుకుంటారు. అన‌థ‌లుగా పెరుగుతారు. దీంతో అన్నీతానై అనుప‌మ‌ను అమ్మ‌లా పెంచి పెద్ద చేస్తుంది వైజ‌యంత‌. త‌ను క్రిమిన‌ల్ లాయ‌ర్‌. జ‌డ్జిగా ప్ర‌మోష‌న్ కోసం ప్ర‌త్యేక ప‌ని మీద వైజ‌యంతి ఢిల్లీ వెళుతూ తన పిల్ల‌ల బాధ్య‌త‌ల‌ని చెల్లి గీత‌కు అప్ప‌గిస్తుంది. ఓ రోజు స్కూల్ కి వెళ్లిన పిల్లలిద్ద‌రూ కిడ్నాప్ కు గుర‌వుతారు. కిడ్నాప‌ర్లు రూ. 15 ల‌క్ష‌లు డిమాండ్ చేయ‌డంతో ఆ డ‌బ్బులు స‌మ‌కూర్చే ప‌నిలో వుంటుంది గీత‌.

ఆ త‌రువాత కూడా వారు పిల్ల‌ల‌ని త‌న‌కు ఇవ్వ‌కుండా డ‌బ్బులు డిమాండ్ చేస్తూ ఇబ్బందుల‌కు గురి చేస్తుంటారు. ఈ క్ర‌మంలో గీత ఎలాంటి స‌వాళ్ల‌ని ఎదుర్కొంది? పిల్ల‌ల‌ని కిడ్నాప్ చేయించింది ఎవ‌రు? ఫైన‌ల్ గా పిల్ల‌ల‌ని కిడ్నాప‌ర్ ల చెర నుంచి గీత కాపాడుకోగ‌లిగిందా? అన్న‌ది ఆస‌లు క‌థ‌. పిల్ల‌ల కిడ్నాపింగ్‌, సీరియ‌ల్ కిల్ల‌ర్స్ క‌థ‌లు కొత్తేమీ కాదు. అలా చూస్తే బ‌ట‌ర్ ఫ్లై కూడా కొత్త క‌థ కాదు పాత క‌థే. ఔట్ డేటెడ్ స్క్రీన్ ప్లే, ట్విస్ట్ కూడా చెప్పుకోద‌గ్గ‌ట్టుగా లేదు.

టెక్నిక‌ల్ గానూ సోసోగా వుందీ మూవీ. ఓటీటీ ప్రేక్ష‌కులు సో సో మూవీ అని కొట్టి పారేస్తున్నారు. స్క్రీన్ ప్లే, మేకింగ్ విష‌యంలో ద‌ర్శ‌కుడు ఘంటా స‌తీష్ బాబు మ‌రింత జాగ్ర‌త్త వ‌హిస్తే బాగుండేద‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఓవ‌రాల్ గా ఓటీటీ ప్రేక్ష‌కుల మాటేంటే బ‌ట‌ర్ ఫ్లై అనుకున్నంత‌గా క‌ల‌ర్ ఫుల్ గా లేద‌ని తేల్చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.