Begin typing your search above and press return to search.

అన్నం పెట్టి గొంతు కోసిన‌ట్లుంది

By:  Tupaki Desk   |   4 Dec 2017 11:03 AM GMT
అన్నం పెట్టి గొంతు కోసిన‌ట్లుంది
X
ప్ర‌స్తుతం టాలీవుడ్ - కోలీవుడ్ - మాలీవుడ్ - బాలీవుడ్....ఇలా అన్ని ఇండ‌స్ట్రీల‌ను పైర‌సీ భూతం ప‌ట్టిపీడిస్తున్న సంగ‌తి తెలిసిందే. నిర్మాత‌లు - డిస్ట్రిబ్యూట‌ర్లు త‌మ ఆస్తులు తాక‌ట్టు పెట్టి అహోరాత్రులు శ్ర‌మించి రూపొందించిన సినిమా...విడుద‌లైన రోజే ఇంట‌ర్నెట్ లో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతోంది. దీంతో, చిత్ర యూనిట్ ప‌డ్డ శ్ర‌మంతా బూడిద‌లో పోసిన ప‌న్నీర‌వుతోంది. తాజాగా, విడుద‌లైన జ‌వాన్ చిత్రం కూడా ఇదే త‌ర‌హాలో విడుద‌లైన కొద్ది గంట‌ల్లోపే పైరసీ బారిన ప‌డింది. ఈ విష‌యంపై ఆ చిత్ర ద‌ర్శ‌కుడు బీవీఎస్ రవి ఆవేదన వ్యక్తం చేశాడు. రిలీజ్ అయిన రోజే ఈ చిత్రాన్ని పైరసీ చేసిన‌ వ్యక్తులపై మండిప‌డ్డాడు. పైరసీ వల్ల నిర్మాతలు - పంపిణీదారులు నష్టపోతున్నారన్నాడు. `మెగా` హీరో సాయిధరమ్ తేజ్ - మెహ్రీన్ పీర్జాదా నటించిన `జవాన్` కు ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. వ‌రుస ప్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న తేజూకు ఈ చిత్రం విజ‌యాన్ని తెచ్చిపెట్టింది. అయితే, ఈ చిత్రం పైర‌సీ కి గుర‌వ‌డంతో ఆ ప్ర‌భావం క‌లెక్ష‌న్ల‌పై ప‌డుతోంద‌ని ర‌వి ఆవేద‌న చెందాడు.

ఆఖ‌రికి బస్సులో కూడా సినిమాను ప్రదర్శిస్తున్నార‌ని - పైరసీ వల్ల సినిమా హిట్ అయింద‌న్న ఆనందం లేద‌న్నాడు. ఈ సినిమా కోసం రక్తం ధారపోశామ‌ని - పైర‌సీ జ‌ర‌గ‌డంతో నోట్లో అన్నం పెట్టి గొంతు కోసేసినట్టుగా ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. పేప‌ర్ లీకై ఏమీ చ‌ద‌వ‌ని విద్యార్థికి టాప్ ర్యాంక్ కొట్టిన‌ట్లు త‌మ పరిస్థితి ఉంద‌న్నాడు. డిస్ట్రిబ్యూటర్లు తమ పెళ్లాం మెడలో పుస్తెలను తాకట్టుపెట్టి సినిమాలకు డబ్బు పెడుతుంటార‌ని - లైట్‌ బాయ్ నుంచి సైకిల్ స్టాండ్ నడిపే వారి వ‌ర‌కు అంతా సినిమాకోసం కష్టపడుతుంటార‌ని చెప్పారు. ఏ శుక్రవారం ఏ నిర్మాత రోడ్డున పడతాడో అని భ‌యం వేస్తోంద‌న్నాడు. ఎంత కష్టపడి ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్న పైరసీని తుద‌ముట్టించ‌లేక‌పోతున్నామ‌ని - పైరసీ...ఎయిడ్స్ కంటే భయంకరమైనద‌ని అన్నాడు. ఇదే పరిస్థితి కొనసాగితే ఇండ‌స్ట్రీలో త‌మ‌లాంటి వాళ్లు అడ్రస్ లేకుండా పోతార‌ని, పైరసీని ఆడ్డుకోకపోతే జీవితాలు రోడ్డున పడతాయ‌ని చెప్పాడు. వెంటనే పైరసీ నిరోధక అధికారులు తగిన విధంగా స్పందించి - పైర‌సీని నిరోధించాల‌ని - పైర‌సీ చేస్తున్న వారిపై క‌ఠిన చర్య‌లు తీసుకోవాల‌ని రవి కోరాడు.