Begin typing your search above and press return to search.

ధనుష్ బుక్కయిపోయాడు

By:  Tupaki Desk   |   11 Dec 2015 8:20 AM GMT
ధనుష్ బుక్కయిపోయాడు
X
కొన్నిసార్లు ఎవరో చేసిన తప్పుకు వేరెవరో నిందను భరించాల్సి వస్తుంది. ముఖ్యంగా అడ్వర్ టైజ్ మెంట్ల విషయంలో సెలబ్రెటీలు అనుకోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మ్యాగీకి ప్రచారం చేసినందుకు మాధురీ దీక్షిత్.. ఓ మోసకారి రియల్ ఎస్టేట్ సంస్థకు ప్రచారకర్తగా ఉన్నందుకు జెనీలియా లేనిపోని తలనొప్పులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు తమిళ స్టార్ హీరో ధనుష్ కూడా ఇలాంటి ఇబ్బందే పడుతున్నాడు.

ధనుష్ కు తమిళనాట సూపర్ పాపులారిటీ ఉండటంతో దాన్ని క్యాష్ చేసుకుందామని ఓ డీటీహెచ్ సంస్థ భావించింది. అతణ్ని ప్రచారకర్తగా నియమించుకుని ఓ యాడ్ చేసింది. అందులో డీటీహెచ్ ప్రాధాన్యాన్ని చెబుతూ.. కేబుల్ టీవీ నెట్ వర్క్ వేస్ట్ అన్నట్లు మాట్లాడతాడు ధనుష్. ఇందులో ధనుష్ ప్రమేయం ఏమీ లేదు. డీటీహెచ్ సంస్థ ఉద్దేశాలకు తగ్గట్లు అతను నటించాడు. ఐతే ధనుష్ తీరుపై తమిళనాడు కేబుల్ టీవీ ఆపరేటర్ల సంఘం భగ్గుమంటోంది.

డీటీహెచ్ కు ప్రచారం చేస్తే తమకు అభ్యంతరమేమీ లేదని.. కానీ కేబుల్ టీవీలను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. ధనుష్ బాధ్యత గల వ్యక్తిగా ఇలాంటి ప్రకటనల్ని.. ఇలాంటి డైలాగుల్ని ఎలా అంగీకరిస్తారని వారు అడుగుతున్నారు. దీంతో ఆ ప్రకటన నుంచి ఆ వ్యాఖ్యల్ని తొలగించేసింది ఆ డీటీహెచ్ సంస్థ. అయినప్పటికీ కేబుల్ టీవీ ఆపరేటర్లు ఊరుకోవట్లేదు. ధనుష్ క్షమాపణ చెప్పి తీరాలని.. లేదంటే ఆందోళన బాట పడతామని హెచ్చరిస్తున్నారు. మరి ధనుష్ దీనిపై ఏమని స్పందిస్తాడో చూడాలి.