Begin typing your search above and press return to search.

పాపం .. పిలిచిమరీ ఫ్లాప్ ఇచ్చారే!

By:  Tupaki Desk   |   3 Aug 2022 8:30 AM GMT
పాపం .. పిలిచిమరీ ఫ్లాప్ ఇచ్చారే!
X
ఏ భాషలోనైనా వెండితెరపై మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న కొంతమంది ఆర్టిస్టులు, కొన్ని కారణాల వలన నటనకు దూరమవుతూ ఉంటారు. ఆ తరువాత కొంతకాలానికి మళ్లీ పరిస్థితులు అనుకూలించినప్పుడు, మంచి సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటారు. అలాంటి ఒక మంచి అవకాశం కోసం .. తమకి మంచి మైలేజ్ ఇచ్చే పాత్ర కోసం వెయిట్ చేస్తుంటారు. తమకి తప్పకుండా మంచి పేరు తీసుకుని వస్తుంది .. తమ కెరియర్ కి చాలా హెల్ప్ అవుతుందని అనిపించిన సినిమాకే వాళ్లు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటారు.

వేణు తొట్టెంపూడి కూడా అదే పని చేశాడు. 'స్వయంవరం' సినిమాతో చాలాకాలం క్రితమే హీరోగా తెలుగు తెరకి పరిచయమైన వేణు, ఆ తరువాత కొన్ని హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. డైలాగ్ డెలివరీ పరంగా .. బాడీ లాంగ్వేజ్ పరంగా తనకంటూ ఒక ప్రత్యేకతను సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగా కూడా కొన్ని సినిమాలు చేశాడు. ఎన్టీఆర్ 'దమ్ము' సినిమా తరువాత ఆయన తెరపై కనిపించలేదు. ఏదో బిజినెస్ చేసు కుంటున్నాడనీ .. ఫ్యామిలీకి రాజకీయ నేపథ్యం ఉండటంతో ఆ వైపు వెళ్లే ఆలోచనలో ఉన్నాడని చెప్పుకున్నారు.

అలా సినిమాలు మానేసి వెళ్లిపోయిన వేణు .. పదేళ్ల తరువాత రవితేజ హీరోగా ఇటీవల వచ్చిన 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. తనకి అసలు సినిమాలు చేసే ఆలోచన లేదనీ .. అందువల్లనే ఇండస్ట్రీకి ఇంతకాలంగా దూరంగా ఉంటూ వస్తున్నాని వేణు చెప్పాడు.

అలాంటి పరిస్థితుల్లో శరత్ మండవ తనకి కాల్ చేశాడనీ .. అప్పుడు కూడా తాను చేయననే చెప్పానని అన్నాడు. అయినా వినిపించుకోకుండా తనని కలిసి కథ వినిపించాడనీ, ఈ పాత్రను నేను చేస్తేనే బాగుంటుందని తనని ఒప్పించాడని అన్నాడు.

శరత్ మండవ కూడా వేణుని ఒప్పించడం చాలా కష్టమైందనీ .. తన పాత్ర గురించి చెప్పిన తరువాత వెంటనే ఒప్పేసుకున్నాడని అన్నాడు. దాంతో ఆ కథలో .. ఆ పాత్రలో విషయమేదో మాంఛి బలంగానే ఉండి ఉంటుందని అంతా అనుకున్నారు. తీరా సినిమాకి వెళ్లిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. వేణు మేనరిజానికి ఆ పాత్ర బాగానే సెట్ అవుతుంది. కానీ దానిని కూడా సరిగ్గా డిజైన్ చేయకపోవడం వలన ..

ఆయన నుంచి పూర్తిస్థాయి అవుట్ పుట్ తీసుకోకపోవడం వలన .. అసలు ఇవతల కథలో విషయం తగ్గడం వలన తేడా కొట్టేసింది. పాపం .. పిలిచిమరీ వేణుకి ఫ్లాప్ ఇచ్చారనే టాక్ బయట బలంగానే వినిపిస్తోంది.