Begin typing your search above and press return to search.

ఆడాళ్లు ఫ్యామిలీ ఆడియ‌న్స్ ని థియేట‌ర్ల‌కు ర‌ప్పిస్తారా?

By:  Tupaki Desk   |   3 March 2022 5:30 PM GMT
ఆడాళ్లు ఫ్యామిలీ ఆడియ‌న్స్ ని థియేట‌ర్ల‌కు ర‌ప్పిస్తారా?
X
పాండ‌మిక్ కార‌ణంగా అన్ని రంగాల త‌ర‌హాలోనే సినీ ఇండ‌స్ట్రీ కూడా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంది. గ‌త కొన్ని నెల‌లుగా ప‌రిస్థితుల్లో మార్పులు మొద‌ల‌య్యాయి. దీంతో థియేట‌ర్ల వ‌ద్ద ప్రేక్ష‌కుల సంద‌డి మొద‌లైంది. అయితే ఫ్యామిలీ ఆడియ‌న్స్ థియేట‌ర్ల‌ల‌కు రావ‌డానికి ఇప్ప‌టికీ భ‌య‌ప‌డుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని గ‌త కొన్ని నెల‌లుగా మేక‌ర్స్ యూత్ ని టార్గెట్ చేస్తూ సినిమాలు నిర్మిస్తున్నారు. ఇదే పంథాని అనుస‌రించి నిర్మించిన క్రాక్‌, అఖండ‌, పుష్ప‌, భీమ్లానాయ‌క్ చిత్రాలు థియేట‌ర్ల‌లో విడుద‌లై సంద‌డి చేశాయి.

భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టాయి. అయితే ఫ్యామిలీ ఆడియ‌న్స్ ని మాత్రం థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌లేక‌పోయాయి. కేవ‌లం యూత్ ని మాత్ర‌మే టార్గెట్ చేసుకుని నిర్మించిన ఈ చిత్రాలు ఆ వ‌ర్గం ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకోగ‌లిగాయి. అయితే పాండ‌మిక్ నుంచి థియేట‌ర్ల వంక చూడ‌ని ఫ్యామిలీ ఆడియ‌న్స్ ని మాత్రం థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌లేక‌పోయాయి.

ఈ నేప‌థ్యంలో థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్న `ఆడ‌వాళ్లు మీకు జోహార్లు` చిత్రంపై ఇండ‌స్ట్రీ వ‌ర్గాల దృష్టిప‌డింది. చాలా కాలం త‌రువాత ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ థియేట‌ర్ల‌లోకి వ‌స్తుండ‌టంతో ఈ మూవీపై ప్ర‌త్యేక దృష్టిని పెట్టాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు.

గ‌తంలో ప్రేక్ష‌కులు భారీ చిత్రాల‌ని రిలీజ్ చేస్తే థియేట‌ర్ల‌కు వ‌స్తారా అని భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఆ భ‌యాల్ని క్రాక్‌, అఖండ చిత్రాలు పోగొట్టి ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌కు ధైర్యాన్నిచ్చాయి. ఈ రెండు చిత్రాలిచ్చిన ధైర్యంతో పుష్ప‌, శ్యామ్ సింగ రాయ్‌, భీమ్లానాయ‌క్ చిత్రాలు థియేట‌ర్ల‌లో విడుద‌లై సంచ‌ల‌నాలు సృష్టించాయి. అయితే ఇప్ప‌డు టార్గెట్ ఫ్యామిలీ ఆడియ‌న్స్ ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డం. వీళ్లు గ‌న‌క థియేట‌ర్ల‌కు రాగ‌లిగితే అన్ని వ‌ర్గాల ఆడియ‌న్స్ థియేట‌ర్ల‌కు వ‌చ్చిన‌ట్టే అవుతుంది.

అదే జ‌రిగితే తెలుగు సినిమా ప‌రిపూర్ణంగా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌డం మొద‌లుపెడుతుంది అనే విశ్లేష‌ణ‌లు ఇప్ప‌డు మొద‌ల‌య్యాయి. శ‌ర్వానంద్ న‌టించిన `ఆడ‌వాళ్లు మీకు జోహార్లు` కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్. రష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమ‌ల తెర‌కెక్కించారు. ఫ్యామిలీ ఆడియ‌న్స్ ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డ‌మే ప్ర‌ధాన ఎజెండాగా ఈ చిత్రాన్ని కేవ‌లం వారి కోస‌మే నిర్మించారు.

మ‌రి ఈ మూవీ కోసం ఫ్యామిలీ ఆడియన్స్ థియేట‌ర్ల‌కు వ‌స్తారా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఫ్యామిలీ ఆడియ‌న్స్ భారీ స్థాయిలో థియేట‌ర్ల‌కు రావ‌డం క‌ష్ట‌మే అని ఓ వ‌ర్గం వాద‌న వినిపిస్తుంటే మ‌రో వ‌ర్గం మాత్రం క‌రోనా భ‌యాలు తొల‌గిపోయాయని, షాపింగ్ మాల్స్‌కి.. మార్ట్ ల‌కి ఫ్యామిలీస్ భారీగా వెళుతున్న నేప‌థ్యంలో థియేట‌ర్ల‌కు కూడా అదే స్థాయిలో వ‌స్తార‌ని, ఇందులో ఎలాంటి అనుమానవం లేద‌ని మ‌రో వ‌ర్గం ధీమా వ్య‌క్తం చేస్తోంది. సినిమా ర‌న్ టైమ్ కూడా 2:21 నిమిషాలే కాబ‌ట్టి ఫ్యామిలీస్ ఖ‌చ్చితంగా `ఆడ‌వాళ్లు మీకు జోహార్లు` కోసం థియేట‌ర్ల‌కు వ‌స్తార‌ని చిత్ర బృందం కూడా బ‌లంగా చెబుతోంది.