Begin typing your search above and press return to search.

రౌడీ గారు వేలు పెట్టకుండా ఉంటే చాలట!

By:  Tupaki Desk   |   22 Feb 2020 10:20 AM GMT
రౌడీ గారు వేలు పెట్టకుండా ఉంటే చాలట!
X
యువహీరో విజయ్ దేవరకొండకు యూత్ లో మంచి క్రేజే ఉంది. మొదట్లో మంచి హిట్లు కూడా వచ్చాయి. అయితే ఈమధ్య మాత్రం వరసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. విజయ్ నటించిన 'డియర్ కామ్రేడ్'.. 'వరల్డ్ ఫేమస్ లవర్' ఫ్లాప్ కావడానికి కారణాలు ఏవనేది నిజంగా తెలియదు కానీ బయట మాత్రం డైరెక్టర్ల పనిలో విజయ్ వేలుపెట్టి కెలకడం వల్లే అవి ఫ్లాప్ అయ్యాయి అని జోరుగా ప్రచారం సాగుతోంది.

నిజానికి ఈ రెండు సినిమాల్లో అర్జున్ రెడ్డి గెటప్పులు..ఆ ఛాయలు అవసరమే లేదు. ఆ కథలకు అర్జున్ రెడ్డి ఇంటెన్సిటీ కూడా అనవసరం. విజయ్ కారణంగానే ఈ రెండు సినిమాలకు అర్జున్ రెడ్డి ఫీల్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారని.. దీంతో అసలు కథలు పక్కదోవ పట్టి ప్రేక్షకులకు నచ్చలేదన్నది విజయ్ పై వినిపిస్తున్న ప్రధానమైన విమర్శ. దీంతో విజయ్ తన నెక్స్ట్ సినిమా 'లైగర్' విషయంలో ఇలా చేయకుండా ఉంటే మేలని ఇండస్ట్రీలో సలహాలు..సూచనలు చేస్తున్నారు. విజయ్ తన నెక్స్ట్ సినిమాను పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. పూరి సీనియర్ డైరెక్టర్ కాబట్టి విజయ్ కూడా గత సినిమాల తరహాలో జోక్యం చేసుకునే అవకాశాలు తక్కువ అని అంటున్నారు.

వరుస ఫ్లాపుల తర్వాత పూరి 'ఇస్మార్ట్ శంకర్' తో ఫామ్ లోకి వచ్చారు. ఆ సినిమాతో రామ్ కు సూపర్ హిట్ అందించారు. ఇప్పుడు విజయ్ దేవరకొండకు ఓ మెమొరబుల్ హిట్ అందించాలనే ప్రయత్నంలో ఉన్నారట. విజయ్ ఓ ఇంటెన్స్ యాక్టర్. ఈ సినిమాలో విజయ్ పాత్ర ఓ కొత్త కోణంలో ఉంటుందట. ఈ సినిమాను బ్లాక్ బస్టర్ గా మలిచి 'ఇస్మార్ట్ శంకర్' ఏదో గాలివాటం హిట్టు కాదని నిరూపించాలని పూరి కంకణం కట్టుకున్నారట. అయితే ఈ సినిమా ప్యాన్ ఇండియా సినిమా అవుతుందా లేదా అనేది సస్పెన్స్. ముంబైలో షూటింగ్ చేసిన ప్రతి సినిమా ప్యాన్ ఇండియా సినిమా అయిపోదు. మరి ఈ సినిమాకు యూనివర్సల్ అప్పీల్ ఉందా లేదా అనేది తెలియాలంటే మాత్రం కొంతకాలం వేచి చూడాలి.