Begin typing your search above and press return to search.

బన్నీ కోరుతున్నదే త్రివిక్రమ్ మిస్సవుతున్నాడే..

By:  Tupaki Desk   |   16 Oct 2018 1:30 AM GMT
బన్నీ కోరుతున్నదే త్రివిక్రమ్ మిస్సవుతున్నాడే..
X
అల్లు అర్జున్ ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర గట్టి ఎదురు దెబ్బే తిన్నాడు. ఫ్లాప్ సినిమాలతో కూడా బ్రేక్ ఈవెన్ సాధించగల హీరోగా అతడికున్న గుర్తింపును ‘నా పేరు సూర్య’ చెరిపేసింది. బన్నీ కెరీర్లోనే అత్యధిక నష్టాలు తెచ్చి పెట్టిన సినిమాగా ఇది నిలిచిపోయింది. ఎంటర్టైనర్లకు పేరు పడ్డ బన్నీ.. సీరియస్ బాటలోకి వెళ్లడం వల్ల సినిమా తేడా కొట్టిందని.. అతడి నుంచి వినోదాన్ని ఆశించే మెజారిటీ ప్రేక్షకులకు ఈ సినిమా రుచించలేదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అల్లు వారి కాంపౌండ్ కూడా ఇదే నిర్ణయానికి వచ్చి.. బన్నీ తర్వాతి సినిమాలో వినోదం బాగా దట్టించాలని తీర్మానించినట్లుగా వార్తలొచ్చాయి. కొంచెం సీరియస్ టచ్ తో.. ఎమోషన్ల మీద సినిమాలు నడిపించే విక్రమ్ కుమార్ తో సినిమా ఓకే అయినట్లే అయి.. ఆగిపోవడానికి కూడా ఇదే కారణం అన్నారు.

బన్నీ కోరుకున్న స్థాయిలో స్క్రిప్టును విక్రమ్ వినోదాత్మకంగా మార్చలేకపోయాడని.. అందుకే ఈ సినిమాను హోల్డ్ లో పెట్టారని గుసగుసలు వినిపించాయి. ఎంటర్టైనర్లకు పేరు పడ్డ త్రివిక్రమ్ వైపు బన్నీ మొగ్గు చూపడానికి కూడా ఇదే కారణమని చెప్పుకున్నారు. ‘అరవింద సమేత’ ఫలితాన్ని బట్టి బన్నీ త్రివిక్రమ్ తో సినిమాను ఓకే చేసేలా కనిపించాడు. ఇప్పుడా సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని.. మంచి ఓపెనింగ్స్ తో సాగుతున్న నేపథ్యంలో వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా దాదాపుగా ఓకే అయినట్లే కనిపిస్తోంది. కానీ వినోదం కోసమే బన్నీ.. త్రివిక్రమ్ తో జట్టు కట్టాలని భావిస్తుండగా.. ఈ విషయంలో త్రివిక్రమ్ క్రమ క్రమంగా బలహీనపడిపోతుండటం చర్చనీయాంశమవుతోంది. ‘అజ్ఞాతవాసి’ పూర్తిగా తేలిపోవడానికి త్రివిక్రమ్ శైలి వినోదం కొరవడటమే కారణం. ఆయన కామెడీ కోసం చేసిన ప్రయత్నాలు వెగటు పుట్టించాయి. త్రివిక్రమ్ అంత హెల్ప్ లెస్ అయిపోవడం అంతకుముందెన్నడూ జరగలేదు. ఇక ‘అరవింద సమేత’లో సైతం త్రివిక్రమ్ కామెడీ టచ్ కనిపించలేదు. సినిమాలో వినోదం కోసం రాసుకున్న సీన్లే మైనస్ అయ్యాయి. మిగతా వ్యవహారమంతా బాగుండి రొమాంటిక్-కామెడీ ట్రాక్ తేలిపోయింది. మరి బన్నీ ఏం కోరుతున్నాడో అదే త్రివిక్రమ్ మిస్సవుతున్న నేపథ్యంలో వీళ్ల కాంబినేషన్లో సినిమా ఎలా వస్తుందో ఏంటో?