Begin typing your search above and press return to search.

హైప్ సరే.. త్రివిక్రమ్ అంచనాలు అందుకుంటారా?

By:  Tupaki Desk   |   5 Jan 2020 6:44 AM GMT
హైప్ సరే.. త్రివిక్రమ్ అంచనాలు అందుకుంటారా?
X
ఈ సంక్రాంతి సీజన్లో రిలీజ్ అవుతున్న బడా సినిమాల్లో ఒకటి 'అల వైకుంఠపురములో'. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో ఈ సినిమాపై మొదటి నుంచి ఆసక్తి నెలకొంది. ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతూ మూడు నెలల ముందు నుంచి ప్రేక్షకులకు చేరువయ్యే ప్రయత్నం చెయ్యడంతో సినిమాకు భారీగా హైప్ పెరిగింది. ముఖ్యంగా 'అల వైకుంఠపురములో' పాటలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ఒక సినిమాపై హైప్ ఆకాశాన్ని తాకుతోంది అంటే అదెప్పుడూ రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. సినిమా కంటెంట్ బాగుండి.. ప్రేక్షకులకు కనెక్ట్ అయితే సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్తుంది. కానీ ఏమాత్రం అంచనాలు అందుకోలేక పోయినా బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడే అవకాశాలు ఉంటాయి. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన 'అజ్ఞాతవాసి' ఒక ఉదాహరణ. మహేష్ బాబు - మురుగదాస్ ల 'స్పైడర్' కూడా ఇదే జాబితాలోకి వస్తుంది.

'అల వైకుంఠపురములో' సినిమాకు పాటలు సూపర్ హిట్ అయ్యాయి కానీ టీజర్ కు మిశ్రమ స్పందనే దక్కింది. బన్నీ స్టైలిష్ గా కనిపించడం తప్ప కొత్తగా ఏమీ లేదని కూడా కొందరు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే త్రివిక్రమ్ ట్రాక్ రికార్డు కూడా ఈమధ్య అంత గొప్పగా లేదు. మునుపటి ఫామ్ లో లేడనేది స్పష్టంగా కనిపిస్తున్న విషయం. 'అజ్ఞాతవాసి' త్రివిక్రమ్ ఇమేజ్ ను దెబ్బ తీసిన సంగతి తెలిసిందే. అయితే 'అరవింద సమేత' ఏదో సోసో అనిపించుకుంది కానీ గొప్పగా ఏమీ లేదు. ఆ సినిమా అంచనాలను అందుకోలేక పోయింది.

ముఖ్యంగా 'పెనిమిటి' సాంగ్ కు రిలీజ్ అయిన సమయంలో ఆహా ఓహో అన్నారు.. ఈ పాటకు తిరుగులేదు అన్నారు. సాహిత్యం.. గానం.. సంగీతం అన్నీ సూపర్ కానీ చిత్రీకరణ ఆ పాట లోని ఆత్మను పూర్తిగా దెబ్బతీసింది. పాటలోని భావానికి ఆ చిత్రీకరణకు పొంతన లేకపోవడంతో చాలామంది ఆడియన్స్ యాంకర్ సుమ తరహాలో అవాక్కయ్యారు. అదేంటో కానీ ఈ విషయంపై పెద్దగా చర్చలు జరగలేదు.. ఇలాంటి అంశాలు 'అరవింద సమేత'లో ఇంకా కొన్ని ఉన్నాయి. మరి 'అల వైకుంఠపురములో' సినిమా విషయంలో ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉంటే మంచిదే. ఒకవేళ జరిగితే మాత్రం ఈ సినిమాపై ఉన్న హైప్ రివర్స్ ఎఫెక్ట్ చూపించే అవకాశాలు లేకపోలేదు.