Begin typing your search above and press return to search.

మరోసారి రెహ్మాన్ ను గౌరవించిన కెనడా!

By:  Tupaki Desk   |   29 Aug 2022 10:30 AM GMT
మరోసారి రెహ్మాన్ ను గౌరవించిన కెనడా!
X
ఏఆర్ రెహ్మాన్ .. సినిమా సంగీతం గురించి తెలిసినవారికి ఆయన పేరు తెలియకుండా ఉండదు. కృషి .. పట్టుదల .. నిరంతర సాధన ఉంటే ఒక మనిషి ఏ స్థాయికి ఎదగవచ్చనే దానికి రెహ్మాన్ నిదర్శనంగా కనిపిస్తారు .. నిర్వచనంలా అనిపిస్తారు. ఆయన అసలు పేరు దిలీప్ కుమార్. ఆ తరువాత ఆయన రెహ్మాన్ గా మార్చుకున్నారు. తండ్రి ఉన్నంతవరకూ మధ్య తరగతి కుటుంబంగా ఉన్న ఆ ఇల్లు, హఠాత్తుగా ఆయన పోవడంతో పేదరికంలోకి జారిపోయింది. తండ్రికి సంగీతం జ్ఞానం ఉంది .. వాద్య పరికరాలతో మంచి పరిచయం ఉంది.

తండ్రి ద్వారానే రెహ్మాన్ కి సంగీతం పట్ల ఆసక్తి ఏర్పడింది. కీ బోర్డు .. హార్మోని .. గిటార్ ప్లే చేయడంలో మంచి ప్రావిణ్యం సంపాదించారు. తండ్రి మరణించిన తరువాత కుటుంబ పోషణ ఆయనపై పడింది. దాంతో ఆయన సంగీత పరికరాల మధ్య తపస్సు చేయవలసి వచ్చింది.

కొంతమంది సంగీత దర్శకుల దగ్గర పనిచేస్తూ ఇల్లు గడిచేలా చూసుకున్నారు. ఆయన ప్రతిభ పట్ల గల నమ్మకంతో మణిరత్నం 'రోజా' సినిమాతో అవకాశం ఇచ్చారు. ఆ ఒక్క సినిమాతో సినిమా సంగీతం నడకను రెహ్మాన్ మార్చేశారు.

'జెంటిల్ మేన్' .. ' డ్యూయెట్' .. 'దొంగా దొంగా' .. 'ప్రేమికుడు' .. 'బొంబాయి' వంటి సినిమాలు రెహ్మాన్ స్థానాన్ని సుస్థిరం చేశాయి. పాటల పరంగా ఆయన చేసిన ప్రయోగాల కారణంగా ఎన్నో పురస్కారాలు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. కోలీవుడ్ నుంచి హాలీవుడ్ సినిమాల వరకూ ఆయన సంగీతాన్ని అందించారు.

అలాంటి రెహ్మాన్ పేరును కెనడాలోని 'మార్కమ్' పట్టణంలోని ఒక వీధికి పెట్టారు. అయితే ఇదే పట్టణంలో ఒక వీధికి 2013లో రెహ్మాన్ పేరును పెట్టారు. మళ్లీ ఇప్పుడు మరో వీధికి ఆయన పేరును పెడుతున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు.

ఈ విషయంపై రెహ్మాన్ స్పందిస్తూ .. భారతీయ సినిమా సముద్రంలో ఒక నీటి బొట్టులాంటి తనకి ఇంతటి గౌరవం దక్కడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. 'మార్కమ్' పట్టణ మేయర్ ఫ్రాంక్ స్కార్పిట్టికీ, ఇండియా కాన్సులేట్ జనరల్ కి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా తనకి మద్దతుగా నిలిచిన కెనడా ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఒక భారతీయుడికి కెనడాలో ఇంతటి గౌరవం లభించడం నిజంగా హర్షించవలసిన విషయమే .. గర్వించవలసిన అంశమే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.