Begin typing your search above and press return to search.

మహేశ్ ఇచ్చిన భరోసాను మరిచిపోలేను: కొరటాల

By:  Tupaki Desk   |   26 April 2022 10:30 AM GMT
మహేశ్ ఇచ్చిన భరోసాను మరిచిపోలేను: కొరటాల
X
వినోదంతో పాటు అంతర్లీనంగా సందేశం ఉండేలా సినిమాలను తెరకెక్కించడం కొరటాల శివ ప్రత్యేకత. 'ఆచార్య' సినిమా విషయంలోనూ ఆయన అదే పద్ధతిని ఫాలో అయ్యారు. నిరంజన్ రెడ్డి - అవినాశ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు.

ఇంతవరకూ ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి పాట కూడా మంచి వ్యూస్ ను దక్కించుకుంది. ఈ సినిమాలో చరణ్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. అయితే ఆ పాత్రకి అంతకుముందు మహేశ్ బాబును అనుకున్నట్టుగా వార్తలు వచ్చాయి.

ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న కొరటాలకు ఇదే ప్రశ్న ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. "అలాంటి ఒక టాక్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 'ఆచార్య' సినిమా సమయంలో నాకు ఒక సంఘటన ఎదురైంది. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర కోసం చరణ్ ను అనుకున్నాము. ఆ పాత్రకి ఆయన అయితేనే కరెక్ట్.

కానీ ఆయన 'ఆర్ ఆర్ ఆర్' ప్రాజెక్టులో లాకై ఉన్నాడు. చరణ్ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటే ప్రాజెక్టు మరింత ఆలస్యమైపోతుంది. ఏం చేయాలో తోచని పరిస్థితి. అలాంటి సమయంలో నేను అదే పనిగా ఆలోచిస్తూ ఉన్నాను.

అలాంటి పరిస్థితుల్లోనే ఒకసారి మహేశ్ బాబును కలిశాను. మా ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. సినిమాలు చేసినా .. చేయకపోయినా ఒకరి ఐడియాస్ ను ఒకరం షేర్ చేసుకుంటూనే ఉంటాము. అందువలన ఆయన 'ఆచార్య' ప్రాజెక్టు ఆలస్యం అవుతుండటం గురించి నన్ను అడిగాడు. 'నేనే స్లో అనుకుంటే .. మీరు ఇంకా స్లో ఉన్నారేంటి సార్' అన్నాడు. 'ఆచార్య' పరిస్థితిని గురించి ఆయనకి వివరించి, నేను ఎలా స్ట్రక్ అయ్యాను అనేది చెప్పాను. నా పరిస్థితి మహేశ్ బాబుకి అర్థమైపోయింది.

"సార్ .. నాకు కొరటాల శివ అంటే ఇష్టం. 'ఆచార్య'లో చిరంజీవితో పాటు చరణ్ చేయడం హండ్రెడ్ పెర్సెంట్ కరెక్ట్. కానీ ఒకవేళ అలా కుదరకపోతే .. వేరే ఆప్షన్ లేకపోతే మీరు టెన్షన్ పడొద్దు .. మీ కోసం నేను ఉన్నాను'' అన్నాడు. అసలు కథ ఏమిటో .. పాయింట్ ఏమిటో ఆయనకి ఎంతమాత్రం తెలియదు. అయినా ఆయన ఆ భరోసాను ఇచ్చాడు. ఆ ప్రాజెక్టులో నేను స్ట్రక్ అయ్యానని తెలిసి .. మరింత ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో ఆయన ఆ మాట అన్నాడు. ఆయన ఎలా అన్నప్పటికీ ఆ మాట నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది" అంటూ చెప్పుకొచ్చారు.